Previous Page Next Page 
వారుణి పేజి 7


    "మీ అత్తగారికి బొత్తిగా యిష్టం లేదట కదా ! ఏవిటో యీ ఆడవాళ్ళు. సారధి- కాలం మారిందంటారు. లోకం ఎంతో ప్రొగ్రెసివ్ ఔట్ లుక్ సంపాదించుకుందంటారు. ఆడవారు అన్నిటా ఎదిగారు. సరిసమానంగా తయారయ్యారంటారు.
    కానీ ఆడవాళ్ళు సంకుచిత దృష్టిలో మాత్రం మార్పు రాలేదు. భావ ఔన్నత్యం వచ్చిందంటారే కానీ భావ సారూప్యం రాలేదు. తమ జీవితాలని చూసైనా తమ పిల్లల జీవితాలు తమలా కాకుండా సుఖంగా వుండాలని అనుకోరు." జీవితం కాచి వడపోసిన సత్యంలా ఉద్ఘోషించాడు నారాయణ.
    "అదేంలేదు"
    "నువ్వు సమర్ధించకు సారధీ. ఈ ఆడవాళ్ళు బహుచిత్రమైన వాళ్ళు. తాము జీవితంలో పొందలేకపోయింది, తమ కూతురో, కొడుకో పొందుతూ వుంటే చూసి ఆనందించి ఆశీర్వదించలేరు."
    "డాడీ_" ఆశ్చర్యంగా పిలిచాడు సారధి.
    "అవును సారధీ. ఉదాహరణకి ఒక తల్లి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడలేక పోయిందనుకో- కట్టుకున్న భర్తతో రాజీపడి జీవితంలో సుఖశాంతులు పరిపూర్ణంగా పొందలేక పోయిందనుకో- అయినా సంసార పక్షంగా జీవితాన్ని లాక్కొచ్చిందే అనుకో- ఆమె తన కూతురో- కొడుకో వాళ్ళు ప్రేమించిన వ్యక్తుల్ని పెళ్ళాడతానంటే- ఒకవేళ భర్త అంగీకరించినా ససేమిరా అవునని ఆశీర్వదించలేదు. తను ముందుగా గట్టిగా వ్యతిరేకిస్తుంది- ఎందుకో తెలుసా ?"
    "ఎందుకు డాడీ ?"
    "ఎందుకా ? తన కూతురో కొడుకో అనుభవంలేక తప్పటడుగు వేస్తున్నారని భయపడుతుంది, భయపెడుతుంది. ఆ తప్పు వలన లాభమో నష్టమో వాళ్ళే అనుభవిస్తారనే విషయాన్ని విస్మరిస్తుంది. అడ్డు చెప్పి నానాగోల చేసి, ఆ పెళ్లిని-తన యధాశక్తి పోరాడి-ఆగిపోయేట్టు చేస్తుంది. పెద్దరికం చాటున, తల్లి హోదాలో ఆ పెళ్లికి అడ్డుపడుతుంది." నిట్టూర్చాడు నారాయణ.
    "కానీ వారుణి తన తల్లిని తండ్రిని ఎవర్నీ పిలవలేదు నాన్నగారూ! వారుణి వ్యక్తిత్వంగల మనిషి. తన జీవితం బాగోగులు తన చేతిలోనే వున్నాయని, వాటికి తనే కర్తనని ఆమె విశ్వసిస్తుంది, విశ్వసించింది" గర్వంగా అన్నాడు సారధి.
    అతనికి వారుణి ప్రసక్తివస్తే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఆమెలాంటి సౌందర్యవతి, విజ్ఞానవతి, వివేకవతి, సౌశీల్యవతి, గుణవతి- వాట్ నాట్ ఎవరూ లేరని మనసా వాచా కర్మణా విశ్వసిస్తాడు. "వారుణీ! నీదొక ప్రత్యేక సృష్టి. బ్రహ్మ తను ఒక ఆదర్శ స్త్రీమూర్తిని చూడదలచుకుని నిన్ను సృష్టించాడు" అనుకుంటాడు అతను.
    కొడుకు మాటలకి నవ్వొచ్చింది నారాయణకు. నిజమే ఆ వయస్సులో కోరుకున్న స్త్రీలో అన్నీ అలాంటి సుగుణాలే కనిపిస్తాయి అనుకున్నాడు. తిరిగి విషయంలోకి వస్తూ "మరి నువ్వయినా పిలవకపోయావా ?" అన్నాడు.
    ఈ పూట అన్నీ ఇలాంటి ప్రశ్నలే వేస్తున్నారేమిటి అనుకున్నాడు సారధి మాట మాటకి తండ్రి మాటల్లో పొరబడటం, తడబడటం అతనికి వింతగా కొత్తగా వుంది. జవాబు చెప్పలేదు.
    అతని ముఖకవళికలే జవాబు చెప్పాయి.
    "నాన్నా! మీరు నేను పిలిస్తే వచ్చారా?" అన్న దెప్పు కనిపించింది.
    ఆయన యింకేమీ అనలేదు.
    అంతదాకా బాత్ రూమ్ తలుపు చాటున నుంచుని గడపలో తను అడుగు పెట్టీపెట్టగానే అత్తగారిచ్చిన కితాబు, మామగారి మందలింపు, తిరిగి భర్త రాక, తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంభాషణ అంతా తూచా తప్పకుండా విన్న వారుణి, చెదిరిన మనస్సుని కుదుట బర్చుకుని బయటికి వచ్చింది.
    ఒక్క క్షణంపాటు నారాయణ మనస్సులో కురేలయిపోయి తడబడిపోయాడు ఆందోళనతో.
    ఆమె ముఖం చూడగానే వారుణి తన భార్య మాటలు విందేమోనని అనుమానపడ్డాడు. తొలిరోజే తొలి ఘడియలోనే అత్తగారిపై ఆమె ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకునే సంభాషణ జరిగిందో గుర్తొచ్చేసరికి అతని మనస్సు నిండా తేళ్లు, జర్రులు పరిగెత్తినట్లయింది.
    ఆమె ముఖం చూళ్ళేక చూపుతిప్పుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS