Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 7


    అతని భుజమ్మీద ఎవరో చెయ్యి వేసేరు.

 

    ఉలిక్కిపడి చూసేడు సత్యం.

 

    చెయ్యి వేసినతను ఫుల్ సూటులో వున్నాడు. దర్జాగా, హుందాగా వున్నాడు. అతన్ని చూడగానే సత్యం చాలా ఆనందంగా అరిచేడు---

 

    "ఒరే రంగా!"

 

    రంగా అనబడే రంగనాధరావు సత్యాన్ని చెయ్యిపట్టుకొని లోపలకు లాగపోతే సత్యం నేలమీదపడి ప్రమాదానికి గురయ్యేవాడు.

 

    "వెధవ ఉత్సాహం నువ్వూను! కిందా మీదా చూసుకోవు గదా!" అంటూ రంగనాధం ఆ తలుపు మూసేడు.

 

    "చాలా కాలానికి చూసేను గదరా-అంచేత..." అంటూ నసిగేడు సత్యం.

 

    "అవునూ! నేనిక్కడున్నట్టు ఎట్లా తెలుసుకున్నావ్" అని కూడా సత్యమే అడిగేడు.

 

    "వేరే పరిశోధన చేయాలా ఏమిటి? నీ పద్యం విని కూపేలోంచి బయటికొచ్చేను."

 

    "ఇంత రైలు రొదలో నా పద్యం వినిపించిందట్రా?"

 

    "బోడి రైలు. నీ గొంతుముందు ఈ శబ్దమొక లెక్కా! టాపు లేపేసే గొంతు. గార్డుక్కూడా వినిపించి ఉంటుంది. అద్సరే---జోరుగా పద్యం వినిపిస్తున్నావ్? ఏమిటి కథా?

 

    "ఏమీ తోచక పాడేన్రా. అవునూ---ఇప్పుడెక్కడుంటున్నావ్? ఏం చేస్తున్నావ్?"

 

    "రైల్వేలో ఇంజనీరుగా ఖర్గపూర్లో వుంటున్నా! కమాన్-కాసేపు మాతో కూచుందువుగానిరా!"

 

    "వద్దురా! నాకిక్కడే బావుంటుంది!"

 

    "బావుంటుంది, బావుంటుంది! నీతో పాటు నేను కూడా ఇక్కడే కాసేపు నించుంటే గయోపాఖ్యానం వినిపించగలం. ఆ దెబ్బతో రైలాగి పోతుంది. జనం పెట్రోమాక్సు లైట్లు పట్టుకొస్తారు. తెల్లవార్లూ పద్యాలు పాడి వాళ్ళ ప్రాణాలు తీయడ మెందుగ్గాని-రా!" అన్నాడు రంగనాధరావు.

 

    ఇష్టం లేకపోయినా రంగనాధరావుని వెంబడించేడు సత్యం.

 

    రంగనాధరావు వాళ్ళ కూపేలోకి అడుగు పెట్టిన సత్యం అక్కడ వున్న అపరంజి బొమ్మను చూసి ముగ్ధుడయ్యాడు.

 

    అంచేత అతను మామూలు స్థితికి రావడానికి కొంచెం జాప్యం జరిగింది.

 

    అప్పటికే అపరంజి బొమ్మ తనకి రెండు చేతులూ జోడించి వుండటంతో పరిస్థితి ఏమిటో సత్యానికి చప్పున బోధపడలేదు.

 

    రంగనాధమే సత్యంతో అంటున్నాడు---

 

    "ఏమిటలా చూస్తున్నావ్? మా అమ్మాయిరా! పేరు జ్యోత్స్న."

 

    "అమ్మాయికి తగ్గ పేరే పెట్టేవు. ఎంతో అందమైన పేరు!"

 

    సత్యం చేసిన కాంప్లిమెంటుని రంగనాధరావు కేర్ చేయలేదు. వాళ్ళమ్మాయితో అంటున్నాడు---

 

    "నాటకాల సత్యమని చెబుతుంటానే---వాడే వీడు!"

 

    ఇప్పుడు అపరంజి బొమ్మ కోటి వీణలు ఒకేసారి పలికినట్టు ఎంతో ముచ్చటగా సత్యాన్ని పలకరించింది---

 

    "నిలబడి పోయారేం అంకుల్! ఇల్లా కూర్చోండి."

 

    మంత్రించినవాడిలా సత్యం ఆ పిల్లకి ఎదురుగా కూచున్నాడు. మాటా పలుకూ లేకుండా ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు.

 

    రంగనాధరావు సత్యం పక్కనే కూచున్నాడు. హైస్కూలు రోజుల్లో సత్యం చేసిన ఘనకార్యాల గురించి చెప్పటం ప్రారంభించేడు.

 

    జ్యోత్స్న శ్రద్ధగా వింటోంది. గమ్మత్తయిన సంఘటనలకు కులాసాగా నవ్వుతోంది.

 

    సత్యం అవేమీ పట్టించుకోవడం లేదు.

 

    సాక్షాత్తు దేవుడే దయతలచి తనక్కావల్సిన కోడలు పిల్లను చూపించేడని మురిసిపోతున్నాడు.

 

    అతను మెల్లిగా కలలోకి జారుకున్నాడు---

 

    పచ్చ తోరణాలతో ఆ కళ్ళకి మంటపం చూడముచ్చటగా వుంది. ఆ మంటపంలో జ్యోత్స్న పక్కన కృష్ణమూర్తి కూచుని వున్నాడు.

 

    పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. మంగళ వాయిద్యాలు మనోహరంగా మోగుతున్నాయి.

 

    అత్యధిక సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యేరు. సత్యం కాలు ఒకచోట నిలబడ్డంలేదు. వచ్చిన వారిని పలకరించడంలో బిజీగా వున్నాడు.

 

    వచ్చిన వాళ్ళంతా వధూవరుల అందచందాలను, వాళ్ళ ఈడూజోడూను పొగుడ్తుంటే సత్యం తెగ మురిసిపోతున్నాను.

 

    కృష్ణమూర్తి జ్యోత్స్న మెళ్ళో మూడు ముళ్ళూ వేసేడు.

 

    సత్యం కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిలిచాయి. ఆ దంపతుల మీద అక్షింతలు వేసేడు.

 

    ఆ నూతన వధూవరులు సత్యం కాళ్ళకి నమస్కరించేరు. సత్యం వాళ్ళని ఆప్యాయంగా లేవనెత్తేడు.

    అక్కడ్తో కల కరిగింది!

 

    కృష్ణమూర్తికి పెళ్ళంటూ చేస్తే జ్యోత్స్నతోనే జరగాలని సత్యం నిర్ణయానికి వచ్చేడు.

 

    ఈ మొత్తం కార్యక్రమం ముగిసేసరికి అవతల రంగనాధంకూడా మాటలాపేసాడు. చివర్లో సత్యం గురించి ఏమి ముక్తాయింపు ప్రయోగించాడోగాని అందుకు జ్యోత్స్న కళ్ళవెంట నీళ్ళొచ్చేలా నవ్వుతోంది.

 

    సత్యం వరస గమనించిన రంగనాధం అడిగేడు---

 

    "ఏమిట్రా తీవ్రంగా ఆలోచిస్తున్నావ్?"

 

    సత్యం సీరియస్సై పోయాడు.

 

    "నీపిల్ల నా కోడలిగా నా ఇంటికి రావాలి" అనే వాక్యాన్ని గంభీరంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రతిమాటనీ తూచితూచి ప్రయోగిస్తూ అంటున్నాడు---

 

    "ఒరే రంగా? నువ్వు నాకో వరం ఇవ్వాలి!"

 

    రంగనాధం భుజాలెగరేస్తూ అన్నాడు---

 

    "వరమేమిట్రా పిచ్చోడా? వరాలిచ్చేందుకు నేనేం విష్ణుమూర్తిని కాను."

 

    "జోక్ చేయొద్దు. నేనొకటి అడుగుతాను. దానికి నువ్వు యస్సనాలి"

 

    రంగనాధం కూడా సీరియస్ గానే సమాధానం చెప్పేడు---

 

    "ఊ---అడుగు!"

 

    "అభ్యంతరం చెప్పకూడదు."

 

    "ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను సరా?"

 

    "థేంక్స్! అమ్మాయ్ మా అగ్రిమెంటు నువ్వూ విన్నావుగా" అని జ్యోత్స్నను అడిగేడు సత్యం.

 

    జ్యోత్స్న తలూపింది.

 

    "నేను అడిగింది విన్నాక కుదరదు గిదరదని బ్రేకులేస్తే నాన్నకి నువ్వే బుద్ధి చెప్పాలి. ఓ.కే?"

 

    "అల్లాగే అంకుల్!" అన్నది జ్యోత్స్న నవ్వేస్తూ---

 

    క్షణంలోనో అరక్షణంలోనో సత్యం అడగదలుచుకున్నది అడిగేవాడే---

 

    అంతలో---

 

    ఆ కూపేలోకి ట్రిమ్ముగా వున్న యువకుడొకడు ప్రవేశించేడు. బాత్ రూం లోంచి వచ్చేడు కాబోలు టవలు భుజాన వుంది.

 

    ఈ కొత్త వ్యక్తి ముందు తన మనసులోని మాట చెప్పేందుకు సత్యం తటపటాయిస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS