Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 7


    "ఇంతమందికి చేయాలి_ అసలే నీ ఆరోగ్యం అంతంతమాత్రం ఇక తిండి కూడా సరిగా తినకపోతే ఎలా_" ఆప్యాయంగా అన్నాడు.

    "అబ్బాయి నయినా తీసుకురాలేక పోయావా" అడక్కుండా వుండలేక పోయిందామె.

    "వాడు తల్లికి మాలిమి అయ్యాడమ్మా! నీకు చెప్పలేదుకదూ? జానకి అక్కడ ఉద్యోగంలో చేరింది. ఎవరో కాన్వెంట్ స్కూలు తెరిచారు. పిల్లలిద్దర్ని అందులో వేసింది. తనూ టీచర్ గా చేరింది నూట యాభై యిస్తారుట"

    "అయ్యో రామచంద్రా!"

    "మీ అన్నయ్య సంగతి నీకు తెలిసే బోల్తా పడ్డావమ్మా"

    "అన్నయ్యదేముందిరా! అంతా ఆ బొమ్మ మీ అత్తయ్య చేస్తోంది. మొదటినుంచీ అదంతే. మమ్మల్నందర్నీ కాదని వేరు కాపురం పెట్టించింది_ మా అన్నయ్య_తమ్ముడు_ అమ్మ _ నాన్న అందరూ వీడికోసం బాధపడ్డవాళ్ళే. ఇప్పుడు తెలిసీ తెలిసీ నిన్ను దించాను - చదువుకున్నది దీనికయినా బుద్ధి వస్తుందనుకున్నాను. ఎలా వస్తుంది? తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా" అంది కోపంగా_

    "ఇప్పుడే ప్రెసిడెంటుగారు పోయారు. ఇక లాభం లేదు. మామయ్య బి.డి.వో. ని పట్టుకుని నన్ను ఆ వూరి స్కూలికి మార్పించుకుంటాడు. వెళ్ళి చేరటమో, సెలవు పెట్టడమో? రాజీనామా యివ్వటమో, అంతేగతి!"

    ఆ మాట వినగానే పార్వతి గుండెలు జల్లుమన్నాయి.

    "భగవంతుడా!" అంది నిస్సహాయంగా.

    భోజనం ముగించి లేచాడు దాసరధి.

    అంతలో శాస్త్రిగారు తిరిగి వచ్చారు. వాళ్ళ పాఠశాల కూడా ఆవేళ మూసివేశారు. కండవా చిలక్కొయ్యకి తగిలించి, చేతిలో సంచికూడా కొయ్యకి వేసి ఈజీ చెయిర్ లో కూర్చుని "కాస్త మంచినీళ్ళిస్తావా?" అనడిగారు.

    మంచినీళ్ళలో కొద్దిగా పంచదార వేసి తెచ్చి యిచ్చింది.

    అవి తాగేసి "స్వాతీ!" అని కోడల్ని పిలిచారాయన.

    దిద్దుతున్న పుస్తకాలను పక్కకి పెట్టేసి వచ్చిందామె.

    "కరెక్షనయిందామ్మా!"

    "ఇంకో రెండు పుస్తకాలున్నాయండీ!"

    క్షణంసేపు ఆగి యిలా అన్నారాయన_ "ఇంకో భారం నీ మీద పెడుతున్నావమ్మా. నేను రేపెల్లుండిలో రామాయణం అనువాదం ప్రారంభించాలి. మంచి వచనంలో రామాయణం రాసిపెట్టాలట. దేశంలో అందరూ రామాయణాలు రాసేస్తున్నారు."

    స్వాతి ఆశ్చర్యంగా వినసాగింది.

    "ఒక రచయితకి తానూ రామాయణం రాశాననిపించుకోవాలనే యావ బయలుదేరింది. అతనికి సంస్కృతం రాదు. యధాతధంగా మూలానుసారంగా ప్రతి శ్లోకానికి చక్కని అనువాదం రాస్తే ఎవరో పబ్లిషరు వేస్తానన్నాడట. కాండకి వెయ్యేసి రూపాయలు యిస్తానన్నాడట."

    "పేరు అతనిదీ శ్రమ మీదీనా? ఇదేం బావుంది" బాధగా ప్రశ్నించిందామె.

    "ఏం చేద్దాం తల్లి అది అంతే! మనం అదేమని ప్రశ్నించకూడదు. ఇందులో మనస్వార్ధం కూడా వుందిగా. అతనికి నవలా రచయితగా మంచి పేరుంది. నన్ను అనువాదం చేసి పెట్టమన్నాడు. వాళ్ళిచ్చే ఏడువేలూ నాకిచ్చేస్తానన్నాడు. ఏడువేలంటే సామాన్యమా మరి? అదీ పబ్లిషర్ యివ్వటంతో సంబంధం లేకుండా తనే యిస్తానన్నాడు. ఈ రోజే రెండు వేలకి చెక్కిచ్చాడు."

    "ఇలా కూడా జరుగుతుందా?" అని ఆశ్చర్యం వినసాగిందామె.

    "ఇది సరస్వతిని అమ్ముకోవటమే! కాదనను. ఏం చేస్తాం? నా రచనలకి విలువలేదు. అంతా పండితుడినని ఒప్పుకుంటారు. నవలలు రాయమంటారు. నేనెక్కడ రాసేది అదీ ఒక వరమేనేమో? సరైన పాండిత్యానికీ రోజుల్లో విలువలేదు .పేరు కావాలి అంతే!" దీర్ఘంగా నిట్టూర్చారాయన.

    స్వాతి తలూపింది గౌరవంగా_ "తప్పకుండా రాద్దాం మామయ్యా! పుణ్యమూ, పురుషార్ధమూ వుంటుంది. రచన మీదేకదా! లోకానికి తెలియకపోయినా మన మనసులకి తెలుసు ఆ విలువ. కొడుకుని దత్తు యివ్వడం లేదూ? ఇదీ అంతే!"

    "అవునమ్మా! అవును!" అలా జీవితంతో రాజీపడక తప్పటం లేదాయనకి.

    "మంచి రోజుచూసి ప్రారంభించండి."

    మళ్ళీ సాలోచనగా అన్నారాయన_ "ఈ డబ్బు నీ పేర వేద్దామనుకున్నానమ్మా! ఏ రోజు ఎలా వస్తుందో ఏమో! నీదంటూ కొంత ఉండాలి ఏనాటికైనా. ఈ తనువు శాశ్వతం కాదు. నేనూ, మీ అత్తయ్యపోయాక ఈ రాక్షస రాజ్యంలో సుఖంగా వుండాలంటే డబ్బు వుండాలమ్మా!"

    స్వాతికి మామగారి అభిమానానికి మనసు ద్రవించిపోయింది. "మామయ్యా!" అంది గద్దవ స్వరంతో.

    "నీ మామయ్య పూర్వాచార పరాయణుడేకాని, లౌకికం తెలియని చాందసుడు కాడమ్మా. నువ్వేం అనకు. రేపు బాంకుకి వెళ్ళి ఎకౌంట్ ఓపెన్ చేద్దాం."

    స్వాతి కళ్ళు చెమ్మగిల్లాయి. మరేం మాటాడలేకపోయింది. అంతలో పార్వతి అటుగా వచ్చింది.

    స్వాతి అత్తగారి భుజంపై తలవాల్చి వెక్కుతూ అంతా చెప్పింది. పార్వతికి అప్రయత్నంగా కళ్ళ నీళ్ళు తిరిగాయి.

    "మీ మామగారికి తెలీంది మనకు తెలుసామ్మా! పైగా అందులో నీ స్వార్జితంకూడా కొంతవున్నట్లే నువ్వులేంది ఆయన రాయలేరు కదా!"

    "నువ్వూ అలాగే అంటున్నావా అత్తయ్యా! నాకిప్పుడు డబ్బుతో ఏం పని? నా ఒక్క ప్రాణం ఎలా బ్రతికితే ఏం?"

    అంతలో దాశరధి అటుగా రావడంతో ఆ విషయం వదిలేశారు.

    బయటికి వెళ్ళిబోతున్న కొడుకుతో "దాశరధీ! సాయంకాలం లైబ్రరీకెళ్ళి వాల్మీకి రామాయణానికి తెలుగు అనువాదాలేమైనా వుంటే పట్రానాయనా!" అన్నారాయన.

    తలూపుకుంటూ వెళ్ళిపోయాడతను.

    "మామయ్యా! మీరు కొడుకుల పేర్లు పెట్టుకున్నందుకు ఆ శ్రీరామచంద్రుడు మీతో రామాయణం రాయిస్తున్నాడులా వుంది."

    "అంతా ఆ రాముడి దయ!" తృప్తిగా అన్నారాయన.


                                *    *    *


    పదిరోజులు గడిచాయి_


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS