మధ్యాహ్నం భోజనాలయ్యాయి.
వారుణి భోజనానికి రాలేదు. అసలు ఉదయం నుంచీ కాఫీ కూడా పుచ్చుకోలేదు. ఆ విషయమై సావిత్రి కానీ సుబ్బరత్నం కానీ పట్టించుకోలేదు.
సారధికి తెలీదు.
తండ్రి చివాట్లు వేశాక అతను ఎప్పుడెప్పుడు వారుణితో ఏకాంతం దొరుకుతుందా, ఆమెతో రాజీ కుదుర్చుకోవాలా అని తపన పడుతున్నాడు.
దాదాపు రెండు గంటల సమయం_ఫణి భోజనం చేసి పడుకున్నాడు. నారాయణ ఆఫీసుకి వెళ్ళాడు. సుబ్బరత్నం, సావిత్రి వంటింట్లో గడపపై తలపెట్టుకుని పడుకున్నారు. సరోజ ఎక్కడికో వెళ్ళింది. పద్మ తన గదిలో పడుకుని యీ పెళ్ళి ఎలా తప్పిపోతుందా అని ఆలోచిస్తూ తప్పిపోయేందుకి వేలాది దేవతలకి నమస్కరిస్తోంది.
"వారుణీ !"
"రండి!" ప్రసన్నంగా పిలిచింది ఆమె.
అతను మంచంమీద కూర్చోగానే ఆమె వెళ్ళి కుర్చీలో కూర్చుంది. ఇద్దరి మధ్య హేమంతశీతలం వంటి నిశ్శబ్దం.
"సారధీ!" వారుణి పిలిచింది.
అతనామెవైపు చూశాడు.
"నేను వెళ్ళిపోతున్నాను."
నివ్వెరపోయాడతను.
"వరూ! ఎక్కడికి ?" గాబరాగా అడిగాడు.
"ఇప్పుడు హైద్రాబాదుకి. అక్కడికి వెళ్ళి నేను జోనల్ ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నిస్తాను."
"వరూ !"
"దయచేసి వినండి. నేను మీతో రాజీపడలేను. ఒక సంవత్సరంపాటు మిమ్మల్ని గమనించాను. నన్నూ నా అభిరుచులనీ గౌరవిస్తారనుకున్నాను. కానీ మూడు నెలలు తిరక్కముందే నా కలలన్నీ కల్లలయ్యాయి. నేనూ ఓ మామూలు ఆడదాన్ని. మీకు మీ వాళ్ళకి చాకిరిచేసే యంత్రాన్ని. అంటే మీ దృష్టిలో_
నేనలా జీవించలేను.
"నన్ను మా నాన్నగారు చాలా స్వతంత్రంగా పెంచారు. నిర్భయత్వం, సచ్చీలత సంప్రదాయాల మధ్య కట్టుదిట్టంగా పెరిగాను. ఆయన తన రక్తంతోపాటే ఆత్మగౌరవాన్నీ పంచి యిచ్చారు నాకు.
"ఆయన నాకు చదువుతోపాటే వ్యక్తిత్వాన్ని కూడా యిచ్చారు.
ఇక్కడ మీ ఛాయగా బ్రతకలేను నేను.
"అది నా వల్ల కాదు."
"వారుణీ!" బాధగా పిలిచాడు సారధి. "ప్లీజ్_నన్ను క్షమించు. నేను దురుసుగా ప్రవర్తించాను. ఇకముందు అలా ప్రవర్తించనని హామీ యిస్తాను. ప్రామిస్ చేస్తాను."
"హుఁ ప్రామిస్ కి అంత విలువ యివ్వను నేను సారధి. మీరూ అందరి మగాళ్ళవంటివారే! మీరు సమానత్వాన్ని భరించలేరు. ఈ సృష్ట్యాడి నుంచీ స్త్రీ మగవాడికి ఒక ఆట బొమ్మ, ఒక కీలుబొమ్మ, ఒక బానిస, ఒక యంత్రం, ఒక అవసరం. అంతే. ఆమెకూడా ఒక మనిషేననీ తనతో సమానమేననీ అనుకోరు మీరు."
"వారుణీ! తప్పయిపోయింది."
"సారధీ_విరిగిన మనస్సు అతుక్కోదు. నా మనస్సు నీపై అప్పుడు ఎలా లగ్నమైందో_ యిప్పుడు అలాగే విడిపోతున్నది. నేను నీతో కలసి జీవించలేను, అలాగని నేను నీతో విడిపోయి_డైవర్స్ తీసుకోలేను."
"వారుణీ_నేనేమంత ఘోరం చేశాను. భార్యాభర్తలన్నాక యిద్దరి మధ్య అపార్థాలు రావా! కలతలు రావా! తిరిగి సర్దుకోవాలి."
"మనదలాంటి దివ్యదాంపత్యం కాదు సారధీ. పగలంతా కాట్లకుక్కల్లాగా పోట్లాడినా, చీకటి పడగానే ఒక్కటై పాలతులుకనాటి కలయిక అని మనస్సుని సరిపెట్టుకోలేను. క్షమించు. అది నా మనస్తత్వం."
"వారుణీ! ఇది చాలా దారుణం."
"ఏది దారుణం సారధీ. పెళ్ళికి ముందు నన్ను ఎంతగా గౌరవించావో మరిచిపోయావా! ఇప్పుడేమైపోయింది ఆ మనస్సు."
"వారుణీ! మనవి ఉమ్మడి కుటుంబాలు_"
"అడ్డురావద్దు. మీ అమ్మగారి మెప్పుకోసం మా వాళ్ళని తిడితే నేను ఊరుకోవాలా? మా నాన్నగారిని వెధవ అన్నారు మీరు. అవును_ఆడపిల్లల తండ్రి అయిననాడే ఆయన అలా అయ్యారు సారధీ! నాకు మా నాన్న దేవుడి కంటే ఎక్కువ. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ. కొన్ని వందల మందిలో అలాంటి వ్యక్తి వుంటారు. ఎన్ని జన్మల పుణ్యఫలంగానో నేను ఆయన కడుపున పుట్టాను. అది మా అదృష్టంగా భావించాము మేము. కాని వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతని కూతుర్ని చేసుకున్న అల్లుడికి మాత్రం అతను లోకువే అని నువ్వు కూడా రుజువు చేశావు. అందుకే అలా నోరు పారేసుకున్నావు."
"వరూ! వరూ! నన్నింకా క్షోభ పెట్టకు. నేను పొరపాటుగా అన్నాను. క్షమించమన్నానుగా! ప్లీజ్! జరిగింది మరిచిపో."
"హుఁ! ఎంత తేలిగ్గా అనేశారు జరిగింది మరిచిపో. ఏది మరిచిపోవాలి_ మీ ప్రేమనా_ మీ ఆరాధనా? మీ ఆత్మీయతా? హుఁ మీతో జరిగిన పెళ్ళినా? మీరు యీ రెండు నెలల్లో ప్రవర్తించిన తీరునా?"
సారధి జాలిగా చూశాడు ఆమెవైపు.
"నా తండ్రి నాకు దైవం. పితృ దేవోభవ అన్న మాట అక్షరాలా పాటించాను నేను. అలాంటి నా తండ్రిని హీనంగా మాటాడి అవమానించారు. అంతకుముందు నన్ను నలుగురిలో అవమానించారు. కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడమన్నారు. ఇదంతా ఏమిటి? మీ పురుషహంకారం. మగవాడిని మగడిని అనే గర్వం.
