Previous Page Next Page 
వారుణి పేజి 72


    ఆయన కొద్దిగా ఆగారు. "నువ్వు ప్రేమించావు. సంవత్సరంపాటు ఆమెని గమనించానన్నావు. ఆమె మనస్సు తెలుసుకున్నానన్నావు. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? భార్యగా గౌరవించలేదు. ప్రియురాలిగా మన్నించలేదు. స్నేహితురాలిగా అభిమానించలేదు. ఒక మామూలు స్త్రీని ఒక మామూలు మగాడు నిలేసినట్టుగా నిలేశావు.
    మీ అమ్మ విషయం నాకంటే నీకు ఎక్కువ తెలుసా? ఆమెదదో తరహా! నేను అడ్జస్ట్ అయిపోయాను. నువ్వు మీ అమ్మ ముందు, మీ వదిన ముందు వారుణిని ఇన్ సల్ట్ చేశావు. యస్! మీ భార్యాభర్తల మధ్య ఏదైనా వుంటే దాన్ని నాలుగు గోడల మధ్యనే వుండనివ్వండి.
    శృంగారం ఒక్కటే కాదు రహస్యంగా వుండవలసింది. జీవితంలో అన్నీ వాళ్ళిద్దరికీ పరిమితం చేసుకోవాలి. ఫ్రెండ్ కి కోపం వస్తే నువ్వు తగ్గిపోయి అతని స్నేహంకోసం రాజీపడతావు. అలాంటిది సహధర్మచారిణితో రాజీపడలేవా?
    సారధీ! నువ్వు మీ అమ్మ మాటకి విలువ యిచ్చావు. ఒక విషయం గుర్తుంచుకో! భార్య ముందు తల్లి ఎక్కువ కాదు. తండ్రి ఎక్కువ కాదు. తోబుట్టువులు ఎక్కువ కాదు. అందరూ భార్య తరువాతే! ఆ విషయం నువ్వు ఎప్పుడూ మరచిపోకూడదు.
    బాబూ! భార్యకోసం దేన్నయినా వదులుకోవాలి. పెళ్ళప్పుడు ఏం చెప్పిస్తారో తెలుసా? ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని ముమ్మారు పలికిస్తారు. మానవుడికి కావలసినవి సుఖం, డబ్బు, ధర్మము. ఈ మూడింటిలో భార్యని కాదని ప్రవర్తించకూడదు. అంటే యేమిటి? నీకు భార్య తప్ప జీవితం లేదు. నువ్వే భార్య. భార్యే నువ్వు. వివాహిత అవుతూనే స్త్రీ అర్ధాంగి అవుతుంది. అంటే ఏమిటో తెలుసా? శరీరంతోపాటు సర్వస్వమూ భర్తకి సగం యిచ్చేస్తుంది. తను సగం తీసుకుంటుంది. అంటే శరీరాలు రెండైనా పారమార్ధికంగా ఒకటే!
    "భార్యని గురించి యింతగా ఆలోచించాలి సారధీ."
    సారధి ఏం జవాబు చెప్పలేదు.
    "ఇంకా వెళ్ళలేదా?" సుబ్బరత్నమ్మ వచ్చి అడిగింది.
    నారాయణ జవాబు యివ్వలేదు.
    "సారధీ! నువ్వు మీ మామవద్ద డబ్బు తెచ్చావ్. అది నీకు కానుకగా యిచ్చాడా? కట్నం బదులు యిచ్చాడా? నువ్వు అప్పుగా తెచ్చావా?"
    "అమ్మా !" కంగారుగా పిలిచాడు సారధి.
    "రత్నం! నువ్విచ్చిన డబ్బు సారధి ఎక్కడో తెచ్చాడన్నావే! అది నరసింహంగారి వద్ద తెచ్చాడా? ఛ! ఛ! ఎంత అప్రదిష్ట. నా కూతురి పెళ్ళికోసం యితర్ల వద్ద చేయి చాచవలసివచ్చిందా? నీ చదువేమైంది? నీ సంస్కారమేమైంది సారధీ. ఎలా అడిగావు ఆయన్ని? పాపం! ఎంత యిబ్బంది పడ్డాడో_"
    సారధి తలొంచుకున్నాడు.
    "ఆ విషయం గురించేనా మీ ఘర్షణ ?"
    "ఆఁ మర్యాద తెలీని ఆ పెద్దమనిషి అల్లుడికి డబ్బిచ్చాడు. కూతురుకు జాబు రాశాడు. ఛ! ఛ!"
    "నువ్వూరుకో రత్నం. నీకు బొత్తిగా లోకం తెలియదు."
    "ఇక తెలుసుకుంటానులేండీ!"
    "సారధీ_మీ మామగారు."
    "వెధవపని చేశాడు" అంది సుబ్బరత్నం.
    తీక్షణంగా చూశాడు నారాయణ. ఆమె విసవిసా వెళ్ళిపోయింది.
    "సారధీ_ఆ డబ్బు పంపెయ్యి. మనకొద్దు. ఇన్ని సంవత్సరాలుగా యీ యింట్లో తిరుగుతూ నువ్వు నా గురించి తెలుసుకున్నది యిదేనా, ఇంతేనా?"
    "సారీ నాన్నగారూ !"
    "ఊఁ నాక్కాదు సారీ చెప్పాల్సింది_వారుణికి సారీ చెప్పుకో." నిర్దేశించాడు నారాయణ.
    సారధి జవాబు చెప్పలేదు.
    నారాయణగారు పద్మ పెళ్ళిచూపుల విషయమై బయటికి వెళ్ళాడు.


                                          36


    పెళ్ళిచూపులు జరిగిపోయాయి.
    పద్మ పెళ్ళిచూపుల సమయంలో వంచిన తల ఎత్తలేదు. సూటిగా అబ్బాయిని చూడనేలేదు. వారుణి పద్మతో పాటే హాల్లోకి వచ్చి పద్మతోపాటే వెళ్ళిపోయింది. మగపెళ్ళివాళ్ళు ఊరి కెళ్ళగానే జాబు రాస్తామని వెళ్ళిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS