"ఎందుకొచ్చింది ఆ గర్వం?
ఎక్కడినుంచి వచ్చింది?
"అది ఈ సంఘ నిర్మాణంలో వున్నది. స్త్రీ ఒంటరిగా బ్రతకటానికి అవకాశంలేని సొసైటీ యిచ్చింది. ప్రకృతి పరంగా స్త్రీని ప్రసాదించిన మాతృత్వం కల్పించిన బలహీనత యిచ్చింది.
"ఎక్కడుంది మాకు స్వాతంత్ర్యం? స్వేచ్చ! ఆనందం! హాయి! అంతా బూటకం సారధిగారూ! ఎక్కడికక్కడ ఎడ్జస్టయిపోతున్నాం విధిలేని పరిస్థితులలో.
"ఇది మా అందరి సమస్య సారధిగారూ! ఒక తోడు ఒక నీడ కావాలి మాకు. కానీ మీకు ఒక బొమ్మ కావాలి. అందునా కీలుబొమ్మ కావాలి. ఎలా ఆడిస్తే అలా ఆడాలి.
"మీకూ_మీ కన్నవారికి, మీ తోబుట్టినవారికి, మీ బంధుజనాలకి, మీ సంతానానికి మర్యాదలు, సేవలు చేయాలి. మీకు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి పెట్టాలి. కట్నాలు కానుకలు తీసుకురావాలి. మీ అవసరాలకి తోడ్పడాలి. మీకు సుఖాల్ని అందివ్వాలి. మేం క్రొవ్వొత్తిగా కరిగిపోతున్నా మీకు వెలుగునివ్వాలి.
"ఎక్కడిది ఈ న్యాయం?
"ఎవరు చేసింది యీ న్యాయం?
"ఎవరు నిర్మించింది ఈ చట్టం!
"ఈ బంధం నుంచి విముక్తి ఎప్పుడు?
"ఊహుఁ మాకు విముక్తి లేదు. మేం శాశ్వత బానిసలం. అవునా!
"కానీ నేను బానిసను కాను సారధిగారూ!
"నేను తిరగబడతాను."
"అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా.
"నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాను.
"మీకు లొంగిపోయి మీరు ఎలా ఆడిస్తే అలా ప్రవర్తించే బ్రతుకు నాకొద్దు. మా తండ్రిగారి వద్దకి వెళ్ళి ఆయన్ని క్షోభపెట్టను.
"నేను ఒంటరిగా బ్రతుకుతాను. స్వతంత్రంగా వుంటాను. మీకు నా ఛాయ సోకనంత దూరం వెళ్ళిపోతాను. నాకు చదువు వుంది. ఉద్యోగం వుంది. ఆ ఆధారం చాలు. ఈ ఆధారం లేకపోతేనో అంటారేమో. బ్రతకాలంటే సవాలక్ష మార్గాలు.
"మీరు మళ్ళీ సలక్షణంగా పెళ్ళిచేసుకోండి. సుఖపడండి. అయితే ఒక విన్నపం_"
"వారుణీ! వారుణి! ఎందుకలా మాటాడతావు! నన్ను ఇంకా హింసించకు. నా తప్పుకి నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఒక మగాడిగా_ భర్తగా కాదు ఫ్రెండ్ గా అడుగుతున్నాను. మనం ఫ్రెండ్స్ గా కలిసి వుందాం. దయచేసి వెళ్ళిపోవద్దు."
ఫక్కున నవ్వింది వారుణి_ "అది అసాధ్యం సారధిగారూ! మనం ఫ్రెండ్స్ గా బ్రతకలేం. మీ అమ్మ, మీ వదిన, మీవాళ్ళు, వాళ్ళూ వాళ్ళ మెప్పుకావాలి. అందుకే ఏదో సామాన్యంగా చదువుకుని, బోలెడంత కట్నం తీసుకుని వచ్చి, తిండికి వంటింట్లో శ్రమపడుతూ, బట్టకి మీకు చాకిరీ చేస్తూ, మీకు పిల్లల్ని కనే యంత్రంలా_ మీకూ మీ పిల్లలకీ అవసరం తీర్చే బానిసలాంటి అమ్మాయిని వెదికి పెళ్ళిచేసుకోండి."
దీనంగా చూశాడు.
వారుణి ముఖంలో కోపంలేదు, బాధలేదు, దుఃఖంలేదు, విచారంలేదు. ఒక స్థిరసంకల్పం వుంది.
"ఇవన్నీ నేను వేదనతో చెపుతున్నాను. మా స్త్రీల స్థితిగతికి విచారించి చెబుతున్నాను. మండిపోయే గుండెతో చెబుతున్నాను. ఇది నా ఒక్కదాని చరిత్ర కాదు. అనుభవం కాదు. ఇలాంటి అనుభవాలు ఈ దేశంలో ఇంటింటిలో ప్రతిరోజూ జరిగేవే. కాలం, స్థలం, సంఘటన మారుతున్నా బాధపడేది మాత్రం మేమే!"
అతను లేచాడు.
ఆమె దగ్గరగా వెళ్ళి రెండు చేతులూ పుచ్చుకోబోయాడు.
ఆమె అతన్ని దగ్గరికి రానివ్వలేదు.
"దయచేసి దూరంగా వుండండి! వుయ్ ఆర్ సపరేటెడ్. మానసికంగా మీరు అభిమానించి, ప్రేమించి, పెళ్ళి చేసుకున్న వారుణి_షి యీజ్ డెడ్. ఈ శరీరం మాత్రం మిగిలివుంది. మీకు_మీకు ఈ శరీరమే చాలు అనిపించవచ్చు.
"కానీ_"
ఈ శరీరంలో చైతన్యంతోపాటు ఆత్మశక్తి వుంది. శరీరంలో రక్తంలో రాగరేణువులతోపాటు అభిమానమూ ప్రవహిస్తోంది.
"అందుకే_అందుకే_
గుడ్ బై."
స్థిరస్వరంతో చెప్పింది.
సారధి నిశ్చేష్టుడైపోయాడు.
కేవలం తన చీరలు, రవికలు, సర్టిఫికెట్లు వున్న బ్రీఫ్ కేస్ పట్టుకుని ఒంటరిగా బయటికి వచ్చింది వారుణి. ఆమెని ఆపగల శక్తిలేదని తెలుసుకున్న సారధి తన దౌర్భాగ్యాన్ని నిందించుకుంటూ నిలుచుండిపోయాడు ఆ గదిలో_ ఆ చీకటిలో_ ఆ దుఃఖంలో_
వారుణి స్వేచ్చగా ధైర్యంతో ఉషఃవేళ పొడుచుకుని వచ్చే కాంతిరేఖలా ఆ యింటినుంచి బయటపడింది.
* సమాప్తం *
