"నాన్నా !" జాలిగా పిలిచింది పద్మ.
"పద్మా ! వాదించకు!"
"అదికాదు నాన్నగారూ! మూడు నిమిషాలు చూసుకునే ఆ పెళ్ళిచూపుల్లో నచ్చటమేమిటి? నచ్చకపోవటమేమిటి? రూపం ఒక్కటే చూస్తారా?"
"పద్మా! కన్యా వరయతే రూపం_మాతా విత్తం. అంటే ఆస్తిపాస్తులు, చదువు యోగ్యత ఉద్యోగం ఇవి తండ్రి చూస్తారమ్మా. పెళ్ళిచూపులకి రమ్మనేముందు వధూవరుల జాతకాలు-వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలు, ఆస్తిపాస్తులు అన్నీ విచారిస్తామమ్మా! నువ్వక్కడ అతని నీడలో సుఖపడతావని అనుకున్నప్పుడే సంబంధం చూస్తాం."
పద్మ జాలిగా వదిన వైపు చూసింది.
వారుణి మనస్సులో మరుభూమిపై వర్షం కురిసినట్టుగా యీ సంభాషణ అంతా నాటుకుంటున్నది. ఏదీ ఒక నిశ్చితమైన అభిప్రాయానికి ఏర్పాటు చూపటం లేదు. ఆమె పద్మని గమనించలేదు.
"అంచేత_శుభ్రంగా మీ అమ్మ మాట వినేసి_ పెళ్ళిచూపులకి తయారుకా."
"నేను చదువుకోవాలి నాన్నా!" బేలగా అందామె.
నవ్వేరు నారాయణగారు. "ఆ విషయం అతనే చూసుకుంటాడమ్మా."
"ఊహుఁ నాకిష్టంలేదు."
అంతలో సారధి వచ్చాడు. అతన్లో నిద్రలేమి, అలసట మానసిక క్షోభ అన్నీ కనిపిస్తున్నాయి.
"రా బాబూ! రా! ఇంతలో నువ్వొస్తావో రావో అని ఆలోచనలో వున్నాను. నువ్వు వచ్చేశావు. నీ భార్య యింట్లో సమస్యలని సృష్టిస్తోంది." అంది సుబ్బరత్నం.
"రత్నం!" గద్దించాడు నారాయణ. "ఇప్పుడేమయిందని అలా అంటున్నావు. పద్మ పెళ్ళిచూపులకి ఒప్పుకుంది కదా! వారుణిపై వాడితో చాడీలు చెపుతావేం?"
"హవ్వ! ఇంత వయసొచ్చి యింత బ్రతుకు బ్రతికి ఆఖరికి కోడలిపై కొడుకుతో చాడీలు చెప్పుకొనే కర్మ పట్టిందా నాకు? అవును! పద్మని పెళ్ళి చేసుకోవద్దని తనలా చదువమని ఉద్యోగం చేసుకుని ఎవరినో ప్రేమించి తనలా పెళ్ళి చేసుకోమని వారుణి చెప్పబట్టే కదా యిప్పుడు పద్మ పెళ్లిచూపులు వద్దంటోంది. ఇది కుటుంబ సమస్య కదా! వాడికి బాధ్యత లేదా! చెల్లి పెళ్ళి విషయంలో వాడికి బాధ్యత లేదా! తన భార్య అది జరక్కుండా చూస్తే వాడు ఆమెని హద్దులో వుంచొద్దా? ఏం మాటలండీ మీవి! నేను ఆమెపై చాడీలు చెబుతానా! ఛ! ఛ!"
చెప్పకనే చెప్పినట్టయింది.
ఏం జరిగిందో తెలిసిపోయింది సారధికి. అతను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. వేగంగా వచ్చాడు వారుణి వద్దకి. చప్పున చెయ్యెత్తాడు.
"సారధీ!" గట్టిగా పిలిచారు నారాయణ.
వధ్యశిలపై తలవాల్చినదానిలా వున్న వారుణి అది గమనించలేదు.
"తప్పు సారధీ! భార్యపై చేయి చేసుకోవటం మహా నేరం! వాళ్ళేం కొడితే కొడతారా! తిడితే తిడతారా! ప్రేమించావు. పెళ్ళి చేసుకొన్నావు. అర్ధాంగిగా స్వీకరించావు. ఆమెని నీ సర్వ సౌభాగ్యదాయినిగా చూడు. అంతే! ఇలా అవమానాలపాలు చేయవద్దు. నలుగురిలో చెయ్యెత్తి కొడతావా! ఛీ! ఛీ! నువ్వు చదివిన చదువు ఏమైపోయింది? ఏమైంది నీ సంస్కారం?" తల వాచేట్లు చివాట్లు పెట్టారు ఆయన.
తర్వాత భార్యవైపు తిరిగి "రత్నం! ప్రతిదానికీ యాగీ చేసి రభస చెయ్యొద్దు. వెళ్ళు లోపలికి! పద్మా, పెళ్ళిచూపులకి తయారవు! ఇష్టాయిష్టాలు తర్వాత చర్చిద్దాం. దానికిప్పుడు అవకాశం లేదు" అన్నాడు.
సారధి నిశ్చేష్టుడయ్యాడు.
వారుణి తమ గదిలోకి వెళ్ళిపోయింది.
అందరూ వెళ్ళిపోయాక "సారీ నాన్నగారూ" అన్నాడు సారధి.
35
"సారధీ!" గంభీరంగా పలికింది నారాయణగారి కంఠం. "మీ యువకులకి ఆవేశం ఎక్కువ. ఆలోచించే అవకాశం తీసుకోరు. ఒక క్షణంలో పాలలా పొంగుతారు. మరో క్షణంలో చప్పగా చల్లబడిపోతారు. ఒక్క క్షణంలో ఉప్పు రాయి నిప్పుపై చిట్లిపోయినట్లుగా పేట్రేగిపోతారు. ఇంకో క్షణంలో కర్పూర పరిమళాలు వెదజల్లుతారు."
