Previous Page Next Page 
వారుణి పేజి 70


    నోర్ముయ్! రానీ నీ సంగతీ_ ఆ రాణీ సంగతీ తేల్చేస్తాను. నా కొడుకుని బుట్టలో వేసుకుని తానాతందానా లాడింది కాక నిన్నూ మాయ చేస్తుందా? కొంపలో సుఖం, శాంతి లేకుండా చేస్తుందా?"
    మెల్లిగా బయటికి వచ్చింది వారుణి. ఆమె ముఖం నిద్రలేమితో పాలిపోయింది. ఆమె మనస్సు ఆలోచనలతో కాలిపోయింది. ఇప్పుడు అత్తగారి యీ దురుసుతనంతో యింకా విరిగిపోయింది.
    "రామ్మా! రా! పద్మకి ఏం చెప్పావు? మేం చూసే అబ్బాయిని చేసుకోవద్దన్నావా? అసలు పెళ్ళే వద్దన్నావా? నీలాగా చదువుకుని ఉద్యోగం చేసి కులం, గోత్రం విడిచి నచ్చినవాడిని చేసుకో అని బోధచేశావా?"
    "అత్తగారూ!" ఆమె కంఠం స్థిరంగా పలికింది. ఏదో చెప్పబోయింది. అయితే సుబ్బరత్నమ్మగారు ఆ అవకాశం యివ్వలేదు.
    "తొలినుంచీ చూస్తున్నాను. నువ్వొక విశిష్టమైన, అపూర్వమైన సృష్టిలాగా, ఈ ప్రపంచంలో నీ పుట్టుకే ఒక గొప్పగా, నీవూ నీ మాటా నీ ఆలోచనా గొప్ప అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. నీ అహంభావం, అహంకారం నా ముందు చెల్లవు. గుర్తుంచుకో_ ఈ యింట్లో వుండాలంటే నా కొడుకుతో సుఖంగా కాపురం చేయాలంటే కొన్ని హద్దుల్లో వుండాలి. నేను అత్తని. మీ మామయ్య వున్నారు. మా మాట మన్నించాలి, గౌరవించాలి."
    తల విదిల్చింది వారుణి. "మీ సోది ఆపండి! మీ నియమాలు నిబంధనలు మళ్ళీ వినిపించకండి. నేనిప్పుడు విన్లేను. నా మనస్సు బావోలేదు. ఆరోగ్యమూ బాగులేదు. మీ ధోరణిలో మీరు వాగితే నేను సమాధానం చెప్పలేను."
    "నాది వాగుడా?" నిర్ఘాంతపోయింది సుబ్బరత్నమ్మ. "ఓసినీ! ఎంతకు తెగించావే! రాత్రి మొగుడితో పోట్లాడి వాడినెక్కడికో పంపించి వేశావు. ఏమిటి నీ ఉద్దేశ్యం? సక్రమంగా కాపురం చెయ్యవా?"
    గుండె తూట్లు పడ్డట్టయింది వారుణికి. "వీళ్ళు మనషులేనా అనుకుంది. భార్యా భర్తల మధ్య విషయాలు కూడా చాటుగా వింటారా?"
    "పద్మ నా కూతురు. దాని బాగోగులు జావి. అది యింకా చిన్న పిల్ల. దానికేం తెలుసు. తప్పు తెలియని వయస్సు. నువ్వు దాని మనస్సు పాడుచేస్తావా? ఇదేనా మర్యాద? మీ నాన్నని పిలుస్తాను. తీర్పు చెప్పమంటాను. అందాకా ఎందుకు? వాడు రానీ! నిలేసి అడుగుతాను. నా మాటప్రకారం వుంటే యింట్లో వుండండి. లేదా వెళ్ళిపోండి యిద్దరూ. వాడు నా కొడుకు నా మాట వింటాడు. వాడిని నీతో తీసుకెళతావో_ నీవే వెళ్ళిపోతావో_ లేక రాజీ కొస్తావో_ చూద్దాం."
    అంతలో నారాయణ వచ్చాడక్కడికి.
    మామగారిని చూడగానే పైట నిండుగా కప్పుకుంది వారుణి. ఫణి కూడా వచ్చాడు. సావిత్రి ఆశ్చర్యంగా చూస్తోంది.


                                                                34


    "చూశారా మీ ముద్దుల కోడలి ఘనత !"
    "రత్నం!" విసుగ్గా అన్నారాయన. రాత్రి కొడుకూ కోడలూ ఘర్షణ పడ్డ విషయం ఆవిడే చెప్పింది. సారధి రాత్రి సినిమాకని వెళ్ళినవాడు యిప్పటిదాకా రాలేదనీ ఆమే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ వారుణిపై ధ్వజమెత్తుతోంది. ఏమిటి యీ మనిషి! కొత్త కోడలని ప్రేమలేదు. కట్నం తేలేదనే కోపం తప్ప. ఇంతగా సాధిస్తుందేమిటి అనుకున్నారాయన. "ఏమిటి ప్రొద్దున్నే యీ పంచాయితీ. ఈరోజే పెళ్ళి చూపులని మరిచిపోయావా?"
    "అదే! అదే! నేనంటూ వున్నది కూడా! అసలు యీ పెళ్ళిచూపులని మీ కోడలుగారు జరగనిస్తుందాని! అమ్మాయికేం నూరిపోసిందో మహాతల్లి_అది యిప్పుడే పెళ్ళి వద్దంటూ కూర్చుంది!"
    "అమ్మా!" పద్మ బాధగా పిలిచింది.
    "పద్మా !" నెమ్మదిగా పిలిచారు నారాయణ. "మీ అమ్మతో పోట్లాట వేసుకోవద్దని చెప్పానా! పద్మా! పెళ్ళిచూపులు కాగానే పెళ్ళి అవుతుందా! అబ్బాయి రానీ! చూడనీ_నీకు నచ్చి, వాళ్ళకీ నచ్చితే_ఆ తర్వాత కదా పెళ్ళి ప్రసక్తి. ఆదిలోనే యీ రభస ఎందుకమ్మా?" శాంతంగా అన్నారాయన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS