వారుణి జవాబు చెప్పేలోగానే, మరో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోయాడు.
అలాగే చూస్తూ వుండిపోయింది వారుణి. ఆమె ఆ రాత్రి నిద్రపోలేదు. ఆలోచనలు భయంకరమైన ఆలోచనలు పులులా గర్జించేస్తున్నాయి.
33
ఉదయం యింట్లో మరో అగ్నిపర్వతం ప్రేలింది.
పద్మ పెళ్ళి ప్రస్తావన వచ్చింది.
ఆ రోజు ఎవరో వస్తున్నారు అమ్మాయిని చూట్టానికి. అనుకోకుండా సంబంధం వచ్చింది. నారాయణ పెళ్ళి చూపులకి రమ్మన్నాడు. సుబ్బరత్నం వేకువనుంచే హడావిడి పడుతున్నది. కాళ్ళు విరగదొక్కుకుంటున్నది సావిత్రి.
కాఫీల వద్దే ఘర్షణ ప్రారంభమైంది. శుభ్రంగా తలంటి పోసుకుని పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని భువన మోహినిలా కనిపిస్తే పెళ్ళికొడుక్కి నచ్చితీరుతుందని సుబ్బరత్నంగారి నమ్మకం.
కానీ పద్మ తలంటు పోసుకోనంది.
"ఎందుకే యీ మొండితనం? ఇప్పటినుంచే యిలా తయారైతే నువ్వేం కాపురం వెలగబెడతావ్? ఆనక అందరూ నన్ననుకుంటారు ఆ తల్లి పెంపకం అంటారు?"
పద్మ జవాబివ్వలేదు.
"లేమ్మా! లే!" అంది సావిత్రి.
"వదినా యీ పెళ్ళిచూపులు నాకిష్టం లేదు."
"ఎందుకమ్మా? అబ్బాయికేం కన్ను వంకరా? కాలొంకరా? ఎం.డి. చేశాడు. ఉస్మానియాలో పని చేస్తున్నాడు. నిన్నూ ఎమ్మే చేయిస్తానన్నాడు."
"ఇప్పుడే పెళ్ళేమిటి వదినా?"
ఆ మాటలకి నవ్వింది సావిత్రి. "పద్మా! కక్కొచ్చినా కల్యాణం వచ్చినా ఆగదు. నీకు పెళ్ళి ముహూర్తం తన్నుకొస్తోంది. అయినా పెళ్ళికి ఒక వయసంటూ ఏముంది. ఆడపిల్ల భూమ్మీద పడ్డప్పటినుంచీ ఆమె పెళ్ళి ఆ పిల్ల తల్లిదండ్రులకి ఒక సమస్యే. ఎప్పుడు కలిసొస్తే అప్పుడు చేస్తారు."
పద్మ జవాబివ్వలేదు.
"లే! లే! వాదించకు. మీ నాన్న వింటే నోరు నొక్కేస్తారు. తయారుకా!" అంది సుబ్బరత్నమ్మ.
"నాకు యిప్పుడే పెళ్లొద్దమ్మా!" మొండిగా అంది పద్మ.
"ఎప్పుడు చేసుకుంటావమ్మా?" ఎద్దేవగా అడిగింది ఆమె.
"అమ్మా! నేను బాగా చదువుకోవాలి. ఉద్యోగం సంపాదించుకోవాలి. ఆర్ధిక స్వాతంత్ర్యంలేని బ్రతుకు ఎవరికీ వద్దు. ముఖ్యంగా అన్ని విషయాలూ డబ్బు చుట్టూతా తిరిగే యీ రోజుల్లో ఉద్యోగంలేని స్త్రీకి భద్రత లేదు_గౌరవం లేదు. పైగా నేను యిలా పెళ్ళి చేసుకోను. నా అభిప్రాయాలతో ఏకీభవించే వ్యక్తిని నన్నూ నా ఊహల్ని గౌరవించే వ్యక్తిని పెళ్ళిచేసుకోవాలి. అమ్మా_యిలా వూరకే పెళ్ళిచూపుల్లో చూసుకుని భార్యా భర్తలయితే వాళ్ళ మనసులు కలియవు. కలియని దాంపత్యం సౌభాగ్యం చెప్పాలా? రోజూ వాదనలు_ ఘర్షణలు_ పోట్లాటలు_ అపార్థాలు_"
"నోర్ముయ్" గద్దించింది సుబ్బరత్నం. "ఇది నీ మనసులో పుట్టిన ఊహనా? మేమంతా అలా పెళ్ళి చేసుకున్నవాళ్ళం కాదూ? మాకేమయింది? మేం సుఖంగా లేమా? దేశంలో నూటికి తొంభై తొమ్మిది పెళ్ళిళ్ళు యిలాగే జరుగుతున్నాయి. తెలుసా? నువ్వు వూరకే వాదించక పెళ్ళిచూపులకి తయారుకా!"
"ఎందుకు సుఖంగా లేరు!" పెదవి విరిచింది పద్మ.
"పద్మా !"
"అమ్మా! నేను చిన్న వదినలాగా పెళ్ళి చేసుకుంటాను!" అంది స్థిర నిశ్చయంతో పద్మ.
అంతే! బాంబు పేలినట్టయింది.
"ఓహో! ఇదంతా ఆ మహారాణిగారి ప్రోద్బలమా! తా చెడ్డ కోతి వనమంతా చెరచినట్టుగా నిన్నూ తనలా చెయ్యాలనుకుంటోందా! ఏమమ్మా మహారాణీ! వారుణి! యిలా రా తల్లీ!" కోపంగా కేకేసింది సుబ్బరత్నమ్మ.
పద్మ భయంభయంగా "అమ్మా" అంది. ఈ విషయంలో అమ్మ వదిన్నేమంటుందోనని భయపడసాగింది ఆ పిల్ల.
