నువ్వింత మంచోడి వనుకోలేదు తమ్ముడా!"
అప్పుడప్పుడు మొగోడి క్కూడా సిగ్గేత్తాదని ఎంకన్న కీ అప్పుడే తెలిసొచ్చింది.
ఆడంత గొప్పోడు తన సరస కూసోడవె గొప్ప! కూసుని మరియాదగా మాటాడ్డం మరీ గొప్ప!
ఎంకన్న కి ఏనుగ బలం వోచ్చినాది.
ఇంత ఉపకారం సేసీవోడికి ఏం ముట్ట సెప్పా పొతే ఏం బాగుంటాదీ? సల్ల కొచ్చి ముంత దాసడవెందుకో?
"బద్రయ్యా! నేను పట్న వొచ్చినప్పుడల్లా మంచి బేరాలు సూబెట్టావంటే, బండికి పదేసి రూపాయలు బగుమతీ యిత్తా నీకు!"
మాంచి తెలివయినోడిలాగే అన్నాననుకున్నాడు ఎంకన్న.
సూటిగా యీడి కల్లల్లోకి సూసి మల్లాయీపు సరిశాడు బద్రయ్య. దాంటో అర్ధ వేంటో?
"యాపారాల్లో తిరిగీ వోడికి బగుమతీ ఎందుకు ఎంకన్నా? నీకూ నాకూ మనుసులు కలిసినాయి గందా, నీ దగ్గిర నేను డబ్బుచ్చుగుంటావా? కనీషనిత్తె సాలు!"
"కనీషనా?"
ఆ మాట యివడం అదే మొదలు.
"అంటే?"
"అదీ వోరకం బగుమతీ యేలే! కొనీవోడికి , అమ్మీ వోడికీ నడాన పనిసేసి పెట్టి వోడికి ముట్ట సెప్పెదన్నమాట!"
"ఏంతీ మంటావ్?"
"నీ సిత్తం! దాని క్కూడా నీ కాడ బేరవా?'
"ఆ కనీస న్నెల్లా యిత్తారో నాకు తెల్దు! నువ్వే సెప్పు బద్రయ్య!"
"సెప్పమంటా? కొత్తోడివి కనక నీ దగ్గర ఎక్కువ తీసుకోడం నాయం కాదు. ఏదో కాడికి నువ్వే తోసిన అంకి సెప్పు!"
"పరవాలేదు, సెప్పు బద్రయ్యా?"
"బండికి పదేవిత్తావా?"
"ఓసోస్!" అనుకున్నాడు ఎంకన్న. సయ్యనీ అన్నాడు."
బద్రయ్య మల్లా జేబీలోంచి యింకో సిగొరోట్ట్టు తీసి గబుక్కుని అంటించాడు. ఎంకన్న కి వోటిచ్చాడు. ఒద్దంటూనే తీసుకున్నాడు.
బద్రయ్య దేవుడే!
"మావోడ్ని నీ కూడా పంపిచ్చి యవ్వారం పైనలు సేయిత్తా!" అంటానే ఆడి మనిసేపు ఏలు సాపాడు . అప్పటిదాకా కులాయి గట్టు కాడ నిలుసుని దమ్ము లాగుతా వున్న వో సేరబయ్య గాడు, సేతిలో బీడీ పీకి యిసిరి పారేసి బద్రయ్య కి ఎదురుంగా నిలవోడ్డాడు.
బలమైనవోడే! బద్రయ్య ఎంత సెబితే అంత ! మరి దొరోడి దరి జాకాదో?
"సేరబా! ఎంకన్న కూడా పెద్ద బజారు కెల్లీ యీరాసానికి నా పేరు సెప్పి యీ బండి మీదున్న సరుకు లోన ఏయించుకోవను. యాబయికీ పదేసు తగ్గించి మిగిలిన రొక్కం తమ్ముడి కిప్పించేయ్! తెలిసిందా? ఎంకన్న సాలా మంచోడు! దార్లో యిద్దరూ సింగిలి టీ తాగండి. ఇంక నే నేల్లోత్తా ! డబ్బులియ్యనా ఎంకన్నా?"
"అదేంటి బద్రయ్యా? ఆపాటి నేనియ్య లేనా?"
ఆడు నవ్వాడు. కడుపులోంచి నవ్వాడు. గోవుగా బుజాలేగరేశాడు. ఎల్లి పోతా అన్నాడు--
"ఇంకా వుంటావా?"
"ఈ ఎల్టికుంటాను. ఎల్లీ ముందునిన్ను కలుసుకుంటాలే!"
"ఎక్కడా?"
ఔను మరి! ఎక్కడా?
మాటోరస కనేశాడు. కలుసుకోవాలని ఉన్నాది!
బద్రయ్య నవ్వాడు.
"గోదారొడ్డు పడవల రేవు కాడ సీతాలచ్వీ వోటే లున్నది. ఆ వొటేలు మందేలే! నీ పనయి పోగానే అక్కడి కొచ్చేయ్యి. మరెల్లోత్తా!"
ఆడు కనుచూపుమేర దాటీ దాకా ఎంకన్న అలా సూత్తానె నిలుసున్నాడు. బద్రయ్య ఎల్లి పోయాడు.
పక్కనున్న సేరబయ్య అదో రకంగా నవ్వాడు. ఏంటో తెలీక ఎర్రిగా సూశాడు ఎంకన్న.
"అలిస్సేవెందుకు బెదరూ! బండి లేగెత్తు , బెగే పోదారి."
మల్లా బీడీ ముట్టించి సోగ్గా నిలబడ్డాడు సేరబయ్య. ఎంకన్న అరిసేతులు సాపుకుని కాడెత్తి ఎడ్లని కట్టాడు. సేక్రం మీద కాళ్ళు అనిసి సేరబయ్య బండెక్కాడు. కాడిలో గడ్డి సరుదుకొని ఎంకన్న కూడా కూకుని ఎలపటేద్దుని మలేశాడు. బండి యిసయిసా నడిసి పోయినాది.
బజార్లో బేరం అయిపోయాక , కాపీ తాగుదారన్నాడు సేరబయ్య. ఇద్దరూ వో వోటేల్లోకి దూరారు.
ఆయె లసలు వోన్నం తినలేదేవో, పీకిలు ముయ్యా యిడ్దేన్లు తెప్పించుకు తిన్నాడు సెరబయ్య. తినేసి గల్లా బల్ల దగ్గరి కొచ్చీ దాకా అడెంత తిన్నదీ ఎంకన్న కి తెలీలేదు.
'అంత ఉపకారం సేసీనోడు ఆమాత్రం తింటే మట్టుక్కేలే!' అని సరి పెట్టుగున్నాడు.
రొండు మిటాయి కిల్లీలూ, రొండు అనాకానీ సిగొరోట్లూ ఆడే దుకానం వోడిని అడిగి పుచ్చుకున్నాడు. ఎంకన్న ని డబ్బు లిమన్నాడు. ఆడి మొకం కేసి సూత్తానె యిచ్చాడు ఎంకన్న.
దమ్ము లాగుతా అన్నాడు సేరబయ్య-- "నే నెల్లోత్తా బెదరూ! మరి నువ్వెక్కడికి పోతావ్?"
"బద్రయ్య కాడికి."
"ఇక్కడ యీరాప్పానితో కొంచెం మాట్లాడి పనున్నాది నువ్వెల్లిరా!"
సెరబయ్య బుజాలూపుకుంటూ ఎల్లిపోయాడు.
మల్లీ ఎంకన్న కేసి తిరిగి సూన్నే లేదు. జేబు బద్రంగా తడువుకుని ఎంకన్న ఎనక్కి నడిశాడు.
* * * *
ఇంటికి తిరిగోచ్చీతలికి బాగా సాద్దోయినాది.
ఆడూ గుమ్మం లో అడుగు పెట్టాడో లేదో, సివాల్న వచ్చి రావులమ్మ ఆడ్ని సుట్టేసి నాది.
"పట్నం నించి నాకేంటి తెచ్చావ్?"
ఈరుడిలా నవ్వాడాడు. తన గొప్పతన విప్పుడు తెలిసింది దానికి. పల్లిటూల్లో కూకుని మట్టి పిసుక్కునీ రకవనుకున్నాది హే!
పట్నంలో ఎంతమంది గోప్పోల్లతో మాటాడేడనీ! ఎంత మర్యాద చేసేరని! ఆడి తెలివి ఏం మెచ్చుకున్నారనీ! ఇయన్నీ రావులమ్మకేం తెలుత్తాయంట?
ఇన్నేల్లూ పుట్టి పేడకడి లో కొంకి పురుగులా బతికాడు. పట్న మెల్లాక తన అదురుట్టవు ఎంత యిదిగా మారిపోయిందో రావులమ్మ కేం తెలుసూ? ఎర్రి మొగం!
దాన్నిదిలించుకునీ తలికి ఆడి తాతలు దిగొచ్చారు.
"అంత తొందరేటే? సందేలయింది గందా , కుతంత వొళ్లు తడుపుకుని ముత్తాబు సేసుకో మరి!"
"ఆకేంటి తెచ్చావో సెప్పు మరి!"
"ఇప్పుడు సెప్పేత్తే మజా ఏం ఉంటాదేఎర్రిదానా? కూడు తిన్నాక నువ్వే కట్టుగుందూ గాని!"
"ఏంటది ? సీరా?"
"మరి?"
"నువ్వెంతో -- మంచోడివి ! సుక్కల సీరా పువ్వుల రయికేనా?"
"సూత్తావు గదంటే!"
"యీల్లేదు! ఇప్పుడే సూబించాలి. లేపోతే నీకు కూడేట్టను. అసలు నీతో వూసే ఆడను!"
"ఓసోస్! కోపవోచ్చినా కూడా నువ్వు సానా అందంగా ఉంటావే రావే!"
ఆడు యియ్యలేదు.
సటుక్కుని అడి సేతిలో సంచీ లాక్కున్నాది. సీర ఎలపలికి తీసింది.
"ఏంటిది?"
"సీర!"
"స్సీ! ఇదేం సీరా?"
"కొత్త పేసను సీరే ఇదీ! పల్లిటూరు దానియి నీకేం తెలుసులే!"
"ఆడంగులు కట్టుగుంటానికే?"
"మరి మొగోల్లు కట్టుగుంటారేంటే ఎర్రి మొగవా?"
"వల్లంతా ఎలపలికి కనుపించదో?"
"ఓసి రావులమ్మీ! దీన్నే లైలాను సీరంటారు.
"లైలానా?"
"అవునే! ఎప్పుడూ యినలేదో! పట్నవులో అడోళ్ళంతా యియ్యె కట్టుగుంటారు."
"స్సీ! సిగ్గు మాలినోళ్ళు!"
"పెద్దింటి అడ కూతుల్లూ , సదూకున్న వోల్లూ అందరికీ యిదే పెసను. ఈ మద్ది కాలవులో యిలాంటి సరుకు రానేలేదంట!"
అడెంత నచ్చ సెప్పినా దాని బుర్ర కెక్కలేదు. పెదవిరిసినాది. సీదరించుకునీ సూసినాది. అడి మనస్సు సివుక్కు మన్నాది.
"ఎంతెట్టి కొన్నావు?"
"ఎంతయితే నీకెందుకో? ముచ్చటగా తెచ్చిత్తే కట్టుగోవాలంతే!"
"నాకోద్దుబాబో! వొల్లంతా సూబించుకునీ సీరలు కట్టుకోడం కన్నా, మావూరు సందల పాక సీర్లె మెరుగు!"
ఆడికి చాలా కట్టం కలిగినాది. అంత మనస్సు పడి పట్నం నించి దీని కోసం తేత్తే గడ్డి పోసలా తీసి పారేసింది! గొప్పోల్లంతా కట్టుగుంటా ఉన్నప్పుడు దీనికేం వచ్చిందంటా? ఈపాటి సిగ్గు అల్లకి మట్టుక్కి లేదో?
అయినా దీని కిలాంటి సీరెంటని ? అంత డబ్బు కరుసు సేసినందుకు లోన ఎంతో నొచ్చుకున్నాడు. మొదాటిసారిగా పట్నవెల్లి యిలవైన సీరతెచ్చి కట్టుగోవంటే దీనికేం పోయి కాలవో? తక్కినోళ్ళ పెల్లాలు యిల్లాగే సెత్తన్నారా? బద్రయ్య పెల్లావె అయితే యిల్లా మాటాడాతాదా?
ఆడి వుసారు సచ్చి పోయింది. కొరికి కరిగి పోయింది. ఆడి మనసంతా అయిరే అయి పోయింది.
'స్సీ! కట్టుకున్న పెల్లాలికి ఎంత సేసినా యిసివోస వుండదు!"
ఆ రేతిరంతా ఆడి గుండి సలసలా కాగినాది.

.jpg)
