Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 6

 

    వచ్చిన ప్రతి పెళ్ళి వారు అడ్డమయిన ప్రశ్నలు వెయ్యటం వాటికి సురేఖ ఇష్టం గానో, అయిష్టం గానో సమాధానాలు చెప్పటం, చివరికి అవి అవతలి వారికి నచ్చకో, లేక సురేఖ కి నచ్చకో వెనక్కి వెళ్ళటం మాములయి పోయింది. చూస్తుండగానే రెండేళ్ళు గడిచి పోయాయి. సురేఖ ఎమ్మే పూర్తీ చేసింది-- ఉమ ఎలాగో పి.యు.సి అయాననిపించి ఆ తరువాత మరి చదవను అని మొండి కేసింది-- అయినా పాపం ఆ పిల్లకి చదువులో ఉత్సాహం లేదూ అంటే అందులో ఆ అమ్మాయి తప్పేం లేదు-- చదువు అయిపోయిన డాక్టరు బావ--  నీటయిన తెల్లని బట్టల్లో దర్జాగా స్టేతస్కోపు వూగించుకుంటూ వార్డుల వెంట తిరుగుతూ ఒక్కోసారి, అందరు డాక్టర్లు లాభం లేదని వదిలేసిన కేసుని పట్టి ఆ రోగికి ప్రాణ బిక్ష పెట్టి వాళ్ళందరూ తనని సాక్షాత్తూ దేవుడే అన్నట్లు పొగడి కృతజ్ఞతలు చెప్పుకుంటుంటే 'ఇందులో నేను చేసింది ఏమీ లేదు ఇది నా వృత్తి ధర్మం ' అంటూ ఎంతో మంచితనంగా దయగా వాళ్ళతో మాట్లాడుతున్నట్లు ఒక్కోసారి, ఆస్పత్రి లో అలసి పోయిన అతని అవసరాలని వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తూ సేద దీర్చబోయిన తనని రెండు చేతులతో చుట్టేసి, దగ్గరికి తీసుకుని అనురాగంతో తన కళ్ళలోకి చూస్తున్నట్లు మరోసారి ఇలా పుస్తకం మూసినా తెరిచినా బావ రూపే కళ్ళల్లో మెదులుతుంటే ఇంక ఆ పిల్ల కళ్ళకి  అక్షరాలెం కనిపిస్తాయి, చదువెం సాగుతుంది- అక్కయ్య కి అసలు పెళ్ళి యోగం వుందా ఆమె కోసం మేం ఇలా ఎన్నాళ్ళు విరహాగ్ని లో దహించుకు పోవాలి అనుకుంటూ ఇక్కడ ఉమా అక్కడ రామకృష్ణా కూడా క్షణాలు యుగాల్లా గడుపుతున్నారు.
    ఇంట్లో పెద్దవాళ్ళు కూడా, 'వాడి చదువయిపోయింది -- ఇంకా ఎన్నాళ్ళు ఆగుతాడు-- బ్రహ్మ ఎవరిని వ్రాసి పదేశాడో నాకు అని విధి చూసుకోవాలి కాని అన్నింటికీ అన్ని వంకలూ పెడితే ఎలా' అని గుసగుసలు పోవటం కూడా సురేఖ స్పష్టంగా వినగలిగేది -- ఆ పిల్లకి నవ్వు కూడా వచ్చేది. 'బ్రహ్మ వ్రాసి పడేయక పోవటం వల్లనే ఈ సంబంధాలు తప్పి పోయాయని వీళ్ళెందుకు అనుకోరు-- ఎలాగో అలా నన్ను వదుల్చుకోవాలనే ధోరణే తప్ప నా మనస్సుని కాస్తయినా అర్ధం చేసుకోటానికి ప్రయత్నించరేం అనుకునేది విసుగ్గా.
    చివరికి ఒకసారి తల్లితో అనేసింది 'నా పెళ్ళి కోసం అగవద్దు-- ఉమ పెళ్ళి చేసేయండి' అని.
    ఆవిడ క్షణం విస్తుబోయినట్లు చూసి 'బాగుంది వరస - నలుగురూ ఏమనుకుంటారు- పెద్ద పిల్లలో ఏదో లోపం వుందేమో అందుకే ఆ పిల్లకి పెళ్ళి కాలేదు స్వంత మేనత్త కూడా చేసుకోలేదు అని అనుకోరూ? అయినా నువ్వేం కురూపివా? చెయ్యి వనకరా? కాలు వంకరా? కుదురుతుంది మరి - ఆ పాట్లేవో పెద్ద వాళ్ళం మేం పడతాం కాని నువ్వా ఆలోచనేం పెట్టుకోకు.' కూతురు చిన్న బుచ్చుకుంది అని గ్రహించుకున్న ఆవిడ అనునయంగా నచ్చ చెప్పబోయింది.
    కాని సురేఖ ఓ నిశ్చయానికి వచ్చిన దానిలా 'లేదమ్మా-- నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. హాయిగా ఉద్యోగం చేసుకుంటాను.' అంది స్థిరంగా.
    నీకేం మతి పోలేదు కదా అన్నట్లు చూసింది వర్ధనమ్మ గారు కూతురి వంక. 'సరేలే, ఇంట్లో తల్లి తండ్రి చాటున వుంటున్న పిల్లలకి పెళ్ళి కొడుకులని తేవాలంటేనే ఇంత ఇదవుతోంది -- ఇంక ఎక్కడో ఎవడి చేతి క్రిందో వుద్యోగం చేస్తోంది అంటే అయిన సంబంధం ఏదయినా గుమ్మంలోకి వస్తుందా-' అంటూ నోరు నొక్కుకుంది.
    మొగ పిల్లలతో సమంగా ఆడపిల్లలకి కూడా చదువులు చెప్పించటానికి సిద్దపడిన తల్లి తండ్రులు కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తాం అనే సరికి ఏదో అప్రతిష్ట చుట్టుకో బోతోంది అన్నట్లు ఎందుకు బాధపడతారో సురేఖ కి అర్ధం కాలేదు -- ఒకవేళ తనా మాట పైకే అంటే వూళ్ళో కాలేజీ వుంది కాబట్టి చదివించాము లేకపోతె అదీ చేసే వాళ్ళం కాదు అంటారేమో. పోనీ -- ఆవుద్యోగం ఏదో ఈ వూళ్ళో నే దొరికితే ఒప్పు కుంటారేమో--
    భయపడుతూనే ఆ మాట అంది తల్లితో .
    'అలాంటి విషయాలు నాతొ చెప్పకు -- నీ ఇష్టం , మీ నాన్నగారి ఇష్టం, అనేసిందావిడ చిరాగ్గా.
    సురేఖ తండ్రి ఇష్టం ఏమిటో తెలుసుకోటానికి ప్రయత్నించ లేదు-- కాని ఓ నాలుగైదు ఆడపిల్లల కాలేజీ లకి సోషల్ వేల్ఫేరు డిపార్టు మెంటు కి అప్లికేషన్లు రాసి పడేసింది ఎవరికీ చెప్పకుండా --
    అవి పోస్టు చేసిన వేళా విశేషమో ఏమో కాని ఉద్యోగం రాలేదు కాని పెళ్ళి నిశ్చయం అయిపొయింది అన్నంత వరకూ వచ్చింది.
    పెళ్ళి కొడుకు ఎం.కాం ప్యాసయ్యాడు. అదేదో ఆఫీసు లో పని . మూడు వందల పైనే వస్తుందిట. పిల్లవాడు చామన ఛాయ రంగులో చూడటానికి ఫరవాలేదు. అనిపించేలా వున్నాడు. అబ్బాయితో పాటు తల్లీ తండ్రీ వచ్చారు. అందరి మొహాలల్లోనూ సురేఖ ని ఇష్టపడిన లక్షణాలే కనిపించాయి. సురేఖ కూడా తన అంగీకారం తెలియజేసింది తల్లితో.
    "మాకు నచ్చింది . మూహూర్తం పెట్టించండి.' అని వుత్తరం వస్తుందనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇంకో లాంటి ఉత్తరం వచ్చింది.
    'రేపు బుధవారం రోజున ఫలానా ట్రైను లో మా తమ్ముడు, మా బావగారు వచ్చి అమ్మాయిని చూస్తారు' ఇదీ అందులో సారాంశం.
    అసలు సంబంధం ఇష్టం అయిందో లేదో చెప్పకుండా ఇలా వంతుల వారీగా వచ్చి చూడటం ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. సురేఖ సరేసరి. 'నేనసలు వాళ్ళ కంట పడనే పడను.' అంటూ చిందులు తొక్కింది --
    'మర్నాడే బుధవారం వీళ్ళు ఆ వుత్తరం లో వున్న రెండు వాక్యాలలో నిగూడమైన అర్ధం ఏమైనా వుందా అని అరా తియ్యాలని ప్రయత్నిస్తూనే వున్నారు. అటు ఆ పెద్ద మనుష్యులిద్దరూ రైలు దిగి ఇల్లు వెతుక్కుంటూ రానే వచ్చారు.
    స్టేషను కి రావాలను కున్నాను- ఏవిటో హటాత్తుగా కడుపు నొప్పి వచ్చింది -- ఇప్పుడు కాస్త సర్దుకుంది లెండి' అంటూ సంజాయిషీ ఇచ్చుకుంటూ వాళ్ళని మర్యాదగా లోపలికి తీసుకు వచ్చి కూర్చోబెట్టారు రమణమూర్తి గారు.
    నయానా భయానా ఎంత చెప్పినా సురేఖ ఒప్పుకోక పోయేసరికి ప్రాణం విసిగి తన నెత్తి మొట్టేసుకుంది వర్ధనమ్మ గారు-- దాంతో విధి లేనట్లు లేచి కాస్త మొహం కడుక్కున్నా ననిపించుకుని పెట్లోంచి ఓ ఇస్రీ చీర తీసుకుని కట్టుకుని మాట్లాడకుండా వెళ్లి వాళ్ళ ముందు కూర్చుంది. -- రమణమూర్తి గారితో కాస్సేపు లోకాభిరామాయణం మాట్లాడి కాస్త కాఫీ తాగి వెళ్ళిపోయారు ఆ పెద్ద మనుష్యులిద్దరూ.
    నాలుగు రోజులు గడిచేసరికి అసలా సంబంధం తీసుకు వచ్చిన మధ్యవర్తి సంబరంగా భుజం మీద కండువా సవరించుకుంటూ వచ్చాడు.
    'హమ్మయ్యా , రమణమూర్తి గారు కోటలో పాగా వేసినట్లే -- రెండు శుభకార్యాలు జరిపించేయోచ్చు." అన్నాడు పళ్ళు ఇకిలిస్తూ.
    "ఏ మాటా కామాటే చెప్పుకోవాలి-- అసలు పాపారావు గారికి కట్నం ఆశ లేనే లేదు-- అదివరకు వదులుకున్న సంబంధాలన్నీ అబ్బాయికి అమ్మాయి నచ్చని కారణం చేతనే ....'
    'సరే-- ఇప్పుడు అదీ కుదిరిందన్న మాట, అన్నాడు రమణమూర్తి గారు మధ్య లోనే. ఆయనకి చాలా సంతోషంగా వుంది. వర్ధనమ్మ గారు గడపలో నిలబడింది. ఉమ, కామాక్షమ్మ గారు వరండా లోకి వెళ్ళారు పెళ్ళి కబుర్లు వినటానికి.
    'అయితే ఇంకా మూహూర్తం పెట్టించటమే తరువాయి అన్నమాట.' అంది కామాక్షమ్మ గారు.
    'ఇదిగో వాళ్ళేవో మూడు ముహూర్తాలు పెట్టించారు-- ఇందులో మీకేది అనుకూలంగా అయితే దానికి వాళ్ళూ సిద్దంగా ఉంటామన్నారు-- మీరు ఆలోచించుకుని.....'
    'ఆలోచించటానికేముంది -- బావకి వ్రాస్తాను. వాళ్ళ అనుకూలం కూడా తెలుసుకోవాలిగా రెండు శుభకార్యాలు ఒక్కసారి జరిపిస్తేనే వీలు కదా.' అన్నారు రమణమూర్తి గారు.
    ఇంక పైన జరిపించవలసిన లాంచనాలని గురించీ, భజంత్రీ మేళం గురించీ చివరికి వంట వాళ్ళ ని గురించి కూడా మాట్లాడుకున్నారు చాలాసేపు-- మధ్యవర్తి లేచి వెళ్ళి పోబోతూ అప్పుడే గుర్తు వచ్చిన వాడిలా అన్నాడు.
    'ఈ మధ్య నేను నాలుగు రోజులు వూళ్ళో లేను. పాపారావు గారి తమ్ముడూ బావగారూ వచ్చి చూసి వెళ్ళారుటగా.'
    'ఆ వచ్చారు.' అన్నారు రమణమూర్తి గారు పొడిగా.
    మొగ పెళ్ళి వారికి కాస్త దూరపు బంధుత్వం వుండటం వల్ల సంబంధం తీసుకు వచ్చాడే కాని అలాంటి మధ్యవర్తిత్వం హాబీగా పెట్టుకున్న పెళ్ళిళ్ళ పేరయ్య కాడతను -- మారు అబద్దాలాడి అయినా ఓ పెళ్ళి చేయించాలి అన్న సూత్రం వంట బట్ట లేదింకా. అందుకే యధాలాపంగానే అనేశాడు. ' అబ్బాయి మొదట ఈ సంబంధానికి గునిశాడుట పిల్ల మరీ పీలగా బొత్తిగా నీరసంగా ...'
    'నీరసంగా వుందన్నడా,' రమణమూర్తి గారు మామూలుగానే అడిగారు.
    'మరే-- అబ్బే అదేం లేదు అమ్మాయి తీరే అంత అని చెప్పాను నేను. ఈలోగా ఏదో పని మీద పాపారావు గారి తమ్ముడు బావగారు మద్రాసు వెళ్ళవలసి వచ్చిందిట. సరే దారిలో ఓ పూట దిగి అమ్మాయిని కూడా చూసి వెళ్దామని వచ్చారట....
    "వాళ్ళెం చేస్తుంటారు.' ఎవరూ ఎదురు చూడని ఈ ప్రశ్న సురేఖ దగ్గర్నుంచి రావటం అందరికీ ఆశ్చర్యం గానే వుంది.
    "పాపారావు గారి తమ్ముడు డాక్టరు -- బావగారికి అదేదో ఆఫీసులో పనిట -- ఉయోగం-- మాటకేం గాని జ్యోతిషం లో మహాదిట్ట. సాముద్రికం లో కూడ -- అసలు మనిషిని చూస్తూనే భూత భవిష్యత్తులన్నీ చెప్పెస్తాదుట-- ఈ పెళ్ళి ముహూర్తాలు పెట్టింది ఆయనే--' ఈ అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పేదేమిటి అని ఒక్కసారి అనిపించినా క్షణం నోరు మూసుకుని కూర్చోలేని అతను తన వాళ్ళ గొప్పతనం ఏదో చెప్పుకుంటున్న ధోరణి లో అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS