Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 6


    "అరే కాలూ! అందులో సగంఖరీదు ఇచ్చినా అంతకంటే మంచిపేరు నీకు అమ్మివుండేవాళ్ళమే" అనేవారు.
    కాలూ చిరునవ్వు నవ్వాడు. ఎంత వింతవిషయాలు మనసుకు గోచరిస్తాయి? వెంటనే కాలూ అచేతనుడైనాడు. కూడబెట్టినదంతా తినేస్తున్నాడు. లేదా ఏదో అదృశ్యశక్తి నమిలిమింగేస్తూంది. త్వరలోనే అదికాస్తా ఖర్చైపోతుంది. తర్వాత?
    'తర్వాత?' అనే ప్రశ్న అతనిగుండెకు బాణంలా తాకింది. ఒక నెల గడిచింది. అయినా ఒక నిర్ణయానికి రాలేకపోయాడు.
    పట్నంవెళ్ళాలి. రాజధానీనగరం వెళ్ళాలి. జనాభానుబట్టి ఆ నగరం ప్రపంచంలో ఆయిదవదో ఆరవదో అని లేఖ భూగోళం చెబుతూంది. ఆ నగరవీధులు కాలూకు కొత్తేమీకాదు. యువకుడుగా ఉన్నప్పుడు కాలూ కలకత్తాలో రెండు సంవత్సరాలపాటు ఉన్నాడు. లేఖకు 12 సంవత్సరాలున్నప్పుడు ఆమెకు నగరంచూపించడానిగ్గూడా ఒకసారి వెళ్ళాడు. కాళిదేవాలయందగ్గర వారు ఒక గది అద్దెకు పుచ్చుకున్నారు. వారక్కడ మూడు రకాల కొత్త కొత్తరకాలుగా వండిన మాంసం రుచిచూచారు. ఉల్లిపాయలు నిండిన మాంసపు ఉండలు వారిద్దరికీ పసందైనాయి.
    ఝార్నాలో దయ్యాలు పోట్లాడుతున్నాయి. వందలమంది కలకత్తాకు బైల్దేరారు. రామాయణంయుద్ధంలాంటి యుద్ధం ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రాచీన భారతదేశపు అస్త్ర శస్త్ర లన్నింటినీ పాశ్చాత్యులు దొంగిలించారు. మబ్బుల్లో ఉండి యుద్ధంచేసే విమానమూ, శబ్దాన్నిబట్టి ప్రయాణంచేసే శబ్దవేది, సైన్యం మొత్తాన్ని మూర్చలోముంచే బ్రహ్మాస్త్రమూ, వీటన్నింటిని వారు దొంగిలించారు. ఈ ఆయుధాలన్నీ రాజధానిలోనే తయారుచేయబడుతున్నాయి. ఇనుమును కుమ్మరి మట్టిలా మలచగల ఉక్కుచేతులుగల కాలూ అక్కడ సోమరిగా వుండాల్సిన అవసరం వుండదు. అతనికి తప్పక అక్కడ ఏదో పని దొరుకుతుంది.
    లేఖను వృద్ధ స్త్రీ దగ్గరే ఉంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎడబాటు దీర్ఘకాలపుది కాకపోయినా కాలూకు అదొక గుట్టలాంటి విచారంగా పరిణమించింది. ఆమె కోసం నగరంలో ఒక రెండు గదులు ఇల్లు తీసుకుంటాడు. అందులో నీటిపంపూ, విధ్యుద్దీపాలూ ఉంటాయి. ఒక సంవత్సరంలో తాను స్వయంగానే పని ప్రారంభించవచ్చు. అప్పుడు అతనికి ఇంకొకరి క్రింద పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నగరప్రజలంతా పని చేయించుకోవడానికి అతని దగ్గరికే వస్తారు. అప్పుడు లేఖకు కొత్తరకపు ఆభరణాలు వస్తాయి. చెవులకు గంటల్లాంటి లోలాకులూ, చేతులకు కొత్తరకపు గాజులూను. బిడ్డ కూడా పెళ్ళి ఈడుది అయింది. నగరంలో మంచి యువకుడు తేలిగ్గా లభించవచ్చు. నగరం చేరుకోవడానికి ఇది రెండవ కారణం. ఆ కుర్రాడు కూడా తనతోపాటే పని చేసేవాడైతే ఇంక లేఖను విడిచి ఉండాల్సిన అవసరం ఉండదు. లేఖ సహితం భర్తకు దగ్గరే ఉన్నట్టు అవుతుంది. వయసుతో వచ్చిన ఓరచూపుల్ను కనిపెట్టి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేఖ అకారణంగా నవ్వుతూందని ముసలి పింతల్లి షికాయతులు కొద్ది రోజుల్నుంచి వినవస్తున్నాయి.
    "అవును ఆమె ఎందుకు నవ్వద్దు" తనకు తానే ప్రశ్నించుకున్నాడు.
    "తండ్రివైన నీకు తెలియొద్దూ. ఆ నవ్వు విన్నవారేమనుకుంటారు? అల్పురాలు అనుకుంటారు. కన్య దాచుకోవలసిందాన్ని నవ్వు బయట పడేస్తుంది. గాంభీర్యమే కన్యకు కవచం"
    ముసలిది చెప్పింది పూర్తిగా అబద్దమేమీకాదు. వ్యాపారం అడుగంటక ముందు కాలూ లేఖను ఒక హాస్యపు సినీమాకు తీసికెళ్ళాడు. అందులో ఒక సన్నటి వ్యక్తి లావుపాటి వ్యక్తితో సరససల్లాపాలు సాగిస్తుండడం చూసి లేఖ ఊగిపోయింది. ఆమెలో ఏదో రహస్యానందం నిండి నిబిడీకృతం అయినట్లు కనిపించింది. తన ప్రక్కనున్న వ్యక్తిని కూడా గమనించకుండా ఆమె నవ్వడంతో ఆమె మోచేయి పక్కనున్నవాడికి తగలడమూ, అతడు కోపంగా ఆమె క్రీగంటిని చూడ్డమూ తటస్థించింది. బిడ్డను లాక్కొని సినిమానుంచి అవతలికి వెళ్దామా అన్నంత కోపం వచ్చింది కాలూకు. కాని అతనికి అంతగుండె లేదు. లేఖ ఆనందమే తన ఆనందంగా భావిస్తున్నాడనేదాన్ని ఎందుకు కాదనాలి? ఏ పురుషుడూ ఆమెను రెండవసారి తిరిగి చూడకుండా పోలేడనే సత్యాన్ని ఎందుక్కాదనాలి? అయినా జనులు ఆమె నవ్వుకు అపార్ధాలు కల్పించకుండా జాగ్రత్త వహించాలన్నది నిజం.
    ఈ ఆలోచనలోనే అతడు గద్దించాడు. ఆమెకు అపకారం చేయతలచినవాని గుండెలు చీల్చివేస్తాననడంలో సందేహంలేదు.
    "ఏమిటి బాబూ"
    మధ్యాహ్న భోజనానిగ్గాను గిన్నెలు కడుగుతున్న లేఖ తండ్రి గద్దింపు విని బైటికి పరిగెత్తుకొచ్చింది. అతని చూపు పూర్తిగా ఆమె వదనంపై బడింది. జవాబుకై నిరీక్షిస్తుండగా అతని చిక్కని మీసాలు కొద్దిగా వణికాయి.
    "ఏమిటి బాబూ అది. నాకు చెప్పవూ?"
    అతడు మౌనాన్ని చీలుస్తూ "చంద్రలేఖా" అన్నాడు. విచారగ్రస్తభావన అతనితో పూర్తిపేరు పలికించింది. "చంద్రలేఖా, నేను చచ్చిపోతే నీవే మౌతావు?"
    మెరుపులా మూడుమెట్లుదిగి అతని రొమ్ముకు తల ఆన్చి ఒడిలో వాలిపోయింది.
    "కన్నీరు చూడాలనుకున్నావా?" అంది రుద్దకంఠంతో.
    అతని వక్షం పొంగింది. దట్టమైన వెంట్రుకలకు ఉన్న స్వేదం ఆమె నున్నని కపోలాల్ను ఆర్ద్రితం చేసింది.
    "నేను లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలిసుమా. కొత్తకొత్తవాళ్ళంతా, దుష్టబుద్ధుల్తో తిరుగుతున్నారు. నేను వెళ్ళకుండానే ఉండాలని దేవుని ప్రార్ధిస్తున్నా." అతని కంఠం రుద్దమై ఆగిపోయాడు. "నేను చాలా రోజులు వెళ్ళను. నీవు తెలివికలదానివి. నేనింకేం చెప్పాలి? ఈ గడ్డుదినాలు గడిచిపోనీ"
    ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అతని గుండె మెలికలు తిరిగి బాధపెట్టింది.
    సమ్మెట, తిత్తి, చిన్నది పెద్దది మాత్రమే ప్రస్తుతానికి అతనికి మిగిలిన ఆస్తి. "మీ కొత్త జయమానికి సరిగా పనిచేయండి" అని వాటిని బుజ్జగించాడు. "కొత్త అన్నదాత కీడు ఎన్నడూ ఎంచకండి" కళ్ళల్లోంచి జలజలా నీళ్ళురాలేయి.
    ఇంట్లో ఉన్నడబ్బు రెండునెల్లు, ఎక్కువకంటే ఎక్కువ మూడు నెల్లకు మాత్రం సరిపోతుంది. రెండు మూడు నెలల్లో అతనికి మంచి పని దొరకొచ్చు. టిక్కెట్లు కొనడానికి డబ్బులేదు. వేలకొద్ది జనులు నడిచేబండిని పట్టుకొని టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఝార్నాలో గట్టి పోలీసు బందోబస్తు చేయబడింది. అతడు మరుసటి స్టేషనుదాకా నడిచిపోయి బండి అందుకుంటాడు. తొందరగా పని సంపాదించాలి. సాధ్యమైనంత వెనక వేయాలి. నూరు రూపాయిలూ కూడగానే ఇంటికి తిరిగి రావాలి. అది అబ్బ ఎంత సంతోషదినం! లేఖను కలకత్తా తీసికెళ్ళాలి. ఇక చంద్రలేఖ ఎన్నదోఆకలికి వెరవాల్సిన అవసరం ఉండదు.
    త్వరగా బైల్దేరాలని ఆదుర్దా పడ్డాడు. కాని అతని గుండెలో ఇనుపగుండు పడ్డట్లు అయింది. అలాగే ఇంకో మూడురోజులు లేఖను చూస్తూ ఇంట్లో ఉండిపోయాడు. ఆమెను ఎన్నడు చోదోఅని వింతమనిషిలా ఆమెను పరీక్షగా చూశాడు. ఆమె వంట, ఆమె చదువు, ఆమె కట్టు అన్నీ చూడసాగాడు. ఆమె గోడకు అటుపక్కన నిద్రించి ఉందని తెలిసినా రాత్రంతా మెలకువతోనే పడి ఉండేవాడు.
    తనలాంటి మోటుమనిషి అలాంటి అందమైన యువతికి తండ్రి ఎలా కాగలిగాడు? తాను మట్టిబుర్ర మనిషి మరి లేఖా? మానవ వేషంలో ఉన్న దేవి. ఇది ఎలా సంభవం అయిందనే విచారం అతన్ని తినివేయసాగింది.
    మూడు రోజులూ గడిచాయి. ఆ భయంకర తరుణం రానేవచ్చింది. లేఖ తండ్రి మెడకు చేతులువేసి నిట్టూర్పులు విడిచింది. అంతేకాదు, కన్నీరు రాల్చింది. తండ్రిని తాను మళ్ళీ చూడలేనేమో అనే బాధ ఆమెను వేధించింది. లేఖ భయంతో మొద్దుబారి పోయింది. కాలూ ఆమెను ఓదార్చనూ లేకపోయాడు ఆమెకు హామీ ఇవ్వనూ లేక పోయాడు. అతని నోటవెంట మాట పెకల్లేదు. బాష్పపూరితమైన కండ్లతో ఆమె తల నిమిరాడు, వీపు చరిచాడు. అంతే, అతడు ఆమెను చూస్తూ ఉండిపోయాడు.
    ముసలి పింతల్లి చూచింది. "చాలు, ఏమిటిది. సూర్యుడు పడమటికి వాల్తే శుభసమయం దాటిపోతుంది. మళ్ళీ రెండు రోజుల్దాకా ప్రయాణం చేయడానికి వీలుండదు" అని అరచింది.
    కాలూ గుడ్డలమూటా, ఒక చిన్నగుడ్డలో కట్టిన బియ్యపుసున్ని ఉండలూ తీసుకున్నాడు. అతడు వెళ్ళి పోయేముందు పింతల్లిని పక్కకు పిలిచి కొంత డబ్బు ఇచ్చాడు.
    "లేఖ బలవంతంగా ఈ డబ్బు నాకు ఇచ్చింది. నాకు ఇంత అవసరం లేదు. మళ్ళీ తిరిగి యిస్తే ఆమె నొచ్చుకుంటుంది."
    "నీవు వట్టిచేతుల్తో ప్రయాణం చేస్తావా?" అని ముసలి విచారంగా తల ఆడించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS