కేజీ టమాటాలు ఐదు రూపాయలు, బీరకాయలు నాలుగు రూపాయలు. ఎంతో కొంత లాభం లేకుండా అమ్మడు. అంటే టమాటాలు సుమారు కేజీ ఆరు, ఆరున్నరకి తక్కువకి అమ్మడు. మలై మహదేశ్వర హిల్స్ పేదగ్రామం. కేజీకి ఆరున్నర పెట్టి టమాటాలు కొనే స్థితి వున్నవాళ్ళు ఆ గ్రామంలో ఖచ్చితంగా వుండరు.
మరి....? టమాటాలు ఫెరిషబుల్ వెజిటబుల్స్. ఎక్కువకాలం నిల్వ వుండవు. అలాంటప్పుడు యాభై కిలోల టమాటాలు ఆ వ్యాపారి ఎందుకు తీసుకెళ్తున్నట్లు? ఆ ఊరిలో ఏదైనా ఉత్సవంగానీ, పెళ్ళిగానీ జరుగుతోందా?
దినేష్ ఆలోచనలు పదును దేరేకొద్దీ అనుమానం పెనుభూతంగా మారసాగింది.
మహదేశ్వర హిల్స్ కి దగ్గర్లో వున్న టౌన్ కౌదల్లి ఒక్కటే. ఏది కావాలన్నా అక్కడికే వచ్చి తీసుకెళ్ళాలి. అంటే మహదేశ్వర హిల్స్ గ్రామంతో, ప్రజలతో కౌదల్లి వ్యాపారులకు సన్నిహిత సంబంధాలు వుండాలి. ఆ ఆలోచన వస్తూనే ఒక కానిస్టేబుల్ ని కౌదల్లి కూరగాయల మార్కెట్ కి వెళ్ళి వివరాలు కనుక్కురమ్మన్నాడు.
అతను అరగంటలో తిరిగివచ్చి మహదేశ్వర హిల్స్ లో ఆ రోజు గానీ, మరుసటిరోజుగానీ ఎలాంటి పండుగలు, పబ్బాలు జరగబోవటంలేదని చెప్పటంతో దినేష్ అనుమానం రెట్టింపయిపోయింది.
మలై మహదేశ్వరా హిల్స్ చుట్టుపక్కల అడవిలో వీరూ తన అనుచరులతో మకాం చేసి వున్నాడా? హొగెనకల్ ఫాల్స్ ప్రాంతంలో వున్నట్లు వచ్చిన వార్త ఫాల్సా? అనే ఆలోచనలతో దినేష్ ముందుకి వెళ్ళకుండా మలై మహదేశ్వరా హిల్స్ కి బయలుదేరాడు.
దారి మధ్యలో కారు తిరిగి ట్రబుల్ ఇవ్వటంతో అక్కడికి చేరుకొనేసరికి రాత్రి పదకొండు గంటలయిపోయింది.
తన ఊహే నిజమైతే వీరూ అనుచరులు ఆపాటికి వచ్చి డబ్బిచ్చి కూరగాయలు, పచారీ సామాన్లు తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయి వుండాలి....అన్న ఆలోచనలతోనే ఆ వ్యాపారి ఇంటిముందు కారుని ఆపించాడు.
వర్తమానంలోకి వస్తే ;
ఆ వ్యాపారి తనను కబుర్లలోకి దింపిన వ్యక్తిగానే అతన్ని గుర్తించాడు తప్ప పోలీసులని పసిగట్టలేకపోయాడు.
"మేం ఈ పక్కనే వున్న ప్రాంతానికి పిక్ నిక్ కి వచ్చాం. మాకు పచారీ సామాన్లు, కూరగాయలు, మసాలా దినుసులు కావాలి. ఎంత రేటైనా ఫర్వాలేదు" అన్నాడు దినేష్ చిన్న నాటకానికి నాంది పలుకుతూ.
వ్యాపారి కొద్ది క్షణాలు ఆలోచించి_
"కూరగాయలు లేవు. తెచ్చినవి అయిపోయాయి. పచారి సామాన్లు కొద్దిగా వున్నాయి. ఇవ్వమంటే ఇస్తాను" అన్నాడు.
"అరే.... అయిపోయాయా....? సరే.... సాంబారుపొడి వుంటే ఇవ్వండి" అంటూ దినేష్ జేబులోంచి డబ్బులు తీస్తుండగా_
"సాంబారు పొడి గ్రాము కూడా లేదు" అన్నాడా వ్యాపారి.
"సాయంత్రమేకదా....యాభై కిలోలు టమాటాలు, పదికేజీల సాంబారు పొడి, మసాలా దినుసులు, ఎడిబుల్ ఆయిల్ సాచెట్స్ తెచ్చావు. అప్పుడే ఎలా అయిపోయాయి? వాటిని తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రమయి వుంటుంది. ఇంతలోనే అంత సరుకు ఎలా అమ్మేశావు?" దినేష్ తిరిగి ప్రశ్నించాడు.
ఈసారి వ్యాపారికి ఒకింత అనుమానం వచ్చింది.
"ఎలా అమ్మావంటే ఏం చెప్పను? కొనేవాళ్ళు వున్నప్పుడు అమ్ముకోవటమేగా మా వ్యాపారం" వ్యాపారి బింకంగా అన్నాడు.
"నిజమే. అదే మీ వ్యాపారం, కాదనటంలేదు. కానీ ఎవరికమ్మావు?" ఒకింత అధికారం ఈసారి దినేష్ కంఠంలో తొంగి చూసింది.
వ్యాపారిలో అనుమానం బలపడింది.
"ఇంతకీ మీరెవరు?" అన్నాడు.
"ఇక దాచి ప్రయోజనం లేదు. మేం పోలీసులం" అంటూ దినేష్ తన ఐడెంటిటీ కార్డ్ తీసి చూపించాడు.
వ్యాపారి కాళ్ళలో వణుకు ప్రారంభమైంది.
ముఖంలోకి ప్రేతకళ వచ్చేసింది.
విషయం దినేష్ కి అర్థమయిపోయింది.
"నిజాలు చెప్పకపోతే నీ బ్రతుకేమవుతుందో ఊహించగలవనుకుంటాను. వీరూ అనుచరులు ఎప్పుడు వచ్చి కూరగాయలకి ఆర్డర్ ఇచ్చారు? తరువాత ఎప్పుడొచ్చి తీసుకువెళ్ళారు?" సూటిగా అడిగాడు దినేష్.
"మధ్యాహ్నం వచ్చి ఆర్డర్ ఇచ్చారు. సాయంత్రం వచ్చి తీసుకెళ్ళారు" వణుకుతూనే సమాధానం చెప్పాడా వ్యాపారి.
"ఏమేం తీసుకెళ్ళారు?"
"టమాటాలు యాభై కేజీలు, బీరకాయలు పాతిక కేజీలు, సాంబారు పొడి పది కేజీలు, వంట నూనె పది కేజీలు, మిగతా మసాలాలు ఒక ఐదు కిలోలు...."
"ఎంత డబ్బిచ్చారు?"
"రెండు వేలు" వ్యాపారి ఒళ్ళంతా అంత చలిలోనూ స్వేదంతో తడిసిపోయింది.
"మరలా కావాలని అడిగారా?"
"తరువాత చెబుతామన్నారు"
"ఎందరొచ్చారు?"
"ఇద్దరు"
"మేం అపరాత్రివేళ వచ్చి నిన్ను ప్రశ్నించినట్లు మరెవరికీ తెలియకూడదు. అలా జరిగితే నువ్వు, నీ కుటుంబ సభ్యులు మైసూర్ సెంట్రల్ జైలులో విశ్రాంతి తీసుకోవలసివస్తుంది. ఇప్పటినుంచి మా మనిషి ఒకరు మీ ఇంట్లోనే వుంటారు. ఆ విషయాన్ని ఎవరికీ తెలీనివ్వకూడదు. జాగ్రత్త" అంటూ దినేష్ ఒక కానిస్టేబుల్ కి సైగ చేశాడు.
అతను చొరవగా వ్యాపారి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతని దగ్గర ఒక వైర్ లెస్ సెట్, ఒక రైఫిల్ వుంది.
తలుపు వేసుకోమని చెప్పి దినేష్ తన వాళ్ళతో వెళ్ళిపోయాడు.
వీరూ అనుచరుల కోసం వల పన్నబడింది.
వ్యాపారి గుండెల్లో ఆటంబాంబు పేలింది.
కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం....
లైట్ ఆరిపోయింది, వ్యాపారి ఇల్లు నిశీధినీరవంలో కలిసిపోయింది.
* * * *
బెంగుళూరు, చామరాజ్ పేట్, ప్రకాష్ కేఫ్ వెనుక వున్న పెద్ద బంగ్లాలో చర్చలు వాడిగా, వేడిగా జరుగుతున్నాయి.
అది కర్ణాటక హోమ్ మినిష్టర్ బంగ్లా.
సమయం అర్ధరాత్రి కావటానికి మరో ఐదు నిమిషాలుంది.
ఇంటిముందు కార్లు, పోలీస్ జీప్ లు, వ్యాన్స్ బారులు తీరి ఉన్నాయి.
ఆ చర్చలు ఆరంభమై అప్పటికి నాలుగు గంటలైంది.
ప్రతి అరగంటకి ప్రకాష్ కేఫ్ నుంచి కాఫీలు, టీలు అందుతున్నాయి. రోడ్డుమీద డ్రైవర్స్ కునికిపాట్లు పడుతున్నారు.
లోపల అధికారులు బుర్రలు బద్దలు జేసుకుంటున్నారు.
ఉద్రిక్తత, ఉద్వేగం అక్కడి వాతావరణంలో గూడు కట్టుకుంది.
పన్నెండు....ఒంటిగంట....రెండు....
కాలం పరుగెడుతోందే తప్ప చర్చల్లో ప్రగతి కనిపించటంలేదు, చర్చలు ఒక కొలిక్కిరావటంలేదు.
ఆలోచనా సరళిలో వైరుధ్యం, అవగాహనలో వైఫల్యం వారిని ఒక దరికి చేర్చలేకపోతున్నాయి.
వారి ముందు పర్యావరణ అటవీ శాఖనుంచి వచ్చిన టెలెక్స్ మెసేజ్ ఉంది.
స్టేట్ కేబినేట్ మినిస్టరీ, హోమ్ మినిస్టరీ ఫర్ స్టేట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఫారెస్టు చీఫ్ కన్జ్సర్వేటర్, అటవీశాఖ మంత్రి తత్ సంబంధమైన మరికొందరు అధికారులు ఆ చర్చల్లో పాల్గొని నలభై వేల ఎకరాల అడవిని శాసిస్తున్న ఒకే ఒక వ్యక్తిని ఎలా పట్టుకోవాలో, అతని కార్యకలాపాల్ని ఎలా నిరోధించాలో తెలీక ఆవలిస్తూ లేచి చర్చల్ని మరుసటి రోజుకి వాయిదా వేసి ఇండ్ల దారి పట్టారు.
* * * *
