రాత్రికి రాత్రి ఎస్.ఐ. దినేష్ వైర్ లెస్ లో మైసూర్ హెడ్ క్వార్టర్స్ ని కాంటాక్ట్ చేసి మరింతమంది పోలీసుల్ని, ఫైర్ ఆర్మ్స్ ని కౌదల్లి పంపించమని వర్తమానం పంపాడు.
మరుసటిరోజు ఉదయానికి కౌదల్లి ట్రావెలర్స్ బంగ్లా పోలీసులులతో, ఆయుధాలతో నిండిపోయింది. అనుమానం రాకుండా ఉండేందుకు వారొచ్చిన వాహనాలని వేరేచోటుకి తరలించారు. ప్రైవేట్ వ్యాన్స్, టాక్సీల్లోనే వాళ్ళు రావాలని దినేష్ సూచన చేయటంతో పోలీస్ వాహనాలేమీ వారితో రాలేదు.
ట్రావెలర్స్ బంగ్లాలో అంతమంది పోలీసులు, అధికారులూ బస చేసినా వాళ్ళెవరూ బయటకొచ్చే ప్రయత్నం చేయకపోవటం, పెద్దగా మాట్లాడుకోకపోవటం, బంగ్లాలోని లైట్స్ ఏ ఒక్కటో తప్ప వేయకపోవటంలాంటి చర్యలు తీసుకోవటంతో ఆ బంగ్లా నిశ్శబ్దంగా వుంది.
ఆకాశమంతా కారుమేఘాలు కమ్ముకొని....ఉండుండి చిరుజల్లులు పడుతుండటంతో వీధుల్లో జనసంచారం అంతగాలేదు. పగలే చీకటి పడ్డట్లుగా ఉంది. అడవీ ప్రాంతాల్లో అది సహజం, ఎస్.ఐ. దినేష్ ఎక్కడున్నాడో వారికి తెలీదు.
ఏ క్షణాన వైర్ లెస్ మెసేజ్ వస్తే ఆ క్షణానే రంగంలోకి దూకేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
యుద్ధానికి ముందు ఉండే ప్రశాంతత ఆ చుట్టుపక్కల పరిసరాల్లో గూడుకట్టుకుని ఉంది.
వాళ్ళు ఎదుర్కోబోయేది అడవి సింహాన్ని అని వారికి తెలుసు. వాళ్ళు ఏ క్షణాన, ఏ దిక్కు నుంచి దాడిచేస్తారో....ఎంతటి అత్యాధునిక ఆయుధాలు వారివద్ద ఉన్నాయో, వారి ఊహకే అందని విషయం. అందుకే అందరి మొహాల్లో ఆందోళన, భయం చోటుచేసుకున్నాయి. కాలం భారంగా గడిచిపోతుంది.
పోలీసులెప్పుడూ తమ గడియారంలోని ముల్లుని నేరస్థుల గడియారంలోని ముల్లుకంటే ఐదు గంటల ముందుకు పెట్టుకోవాలి. పథక రచనలో పదడుగుల పైనుండాలి. కానీ అదిప్పుడు తిరగబడుతోంది.
నేరస్థుడ్ని ఎప్పుడూ రెండు బలీయమైన అవసరాలు ఆవరించుకొని వుంటాయి. అవి నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ బ్రతికేయటం_పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవటం.
కానీ పోలీసులెప్పుడూ ఒక బాధ్యతే ఆవరించుకొని వుంటుంది. అది నేరస్థుల్ని మట్టుబెట్టటం.
నేరస్థులకు తప్పించుకొనేందుకు ఎన్నో దారులుంటాయి. కానీ పోలీసులకు ఒకే దారి వుంటుంది. నేరస్థులు తప్పించుకుపోయిన దారి.
ఎస్.ఐ. దినేష్ కి కావల్సినంత ఫోర్స్ వచ్చి కౌదల్లి ట్రావెలర్స్ బంగ్లాలో విడిదిచేసి తన సూచన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది.
ఏ క్షణంలోనైనా ఏదో దిక్కుకి దూసుకుపోవాలనే సూచన ఎస్.ఐ.దినేష్ నుంచి తమకందుతుందని బంగ్లాలో నిశ్శబ్దం మాటున దాగిన పోలీసులకు తెలిసింది.
కాలం భారంగా గడిచిపోతుంది.
పోలీసుల ఎత్తు ఎప్పుడూ నేరస్థులు వేసే ఎత్తుని బట్టే ఊపిరి పోసుకుంటుంది.
మఫ్టీలో ఆ ప్రామ్తప్ ప్రజల వేష భాషల్లోకి రూపాంతరం చెందిన కొందరు పోలీసులు. మలై మహదేశ్వరా హిల్స్, కౌదల్లి ప్రాంతాల్లో తిరుగాడుతున్నారు. వాతావరణంలో ఎలాంటి మార్పు కనిపించినా వారి దగ్గర రహస్యంగా వున్న వైర్ లెస్ సెట్స్ ఆన్ అయిపోతాయి.
అడవిలో మాటువేసివున్న కరియా బృందానికి ఎలాంటి ఆజ్ఞ వీరూ నుంచి ఇంకా అందలేదు.
* * * *
కౌదల్లి టౌన్ కి ఆనుకొని ఉన్న అడవిలో నాలుగు కిలోమీటర్ల లోపల చిన్నగుట్ట ప్రక్కన సింధూర వృక్షం కింద వీరూ ప్రధాన అంగరక్షకుల్లో ఒకడైన వేలాయుధం పదిమంది అనుచరులతో మకాంచేసి వున్నాడు.
వీరూ దృష్టిలో కరియాకి ఎంత ప్రాముఖ్యత వుందో, వేలాయుధానికి అంతే ప్రాముఖ్యత వుంది. ఐదడుగుల ఎడంగుళాల ఎత్తులో, మీడియం బిల్డ్ శారీరక సౌష్టవంతో కనిపించే వేలాయుధం పథక రచనలో, ఎత్తుగడలలో నేర్పరి.
సాధారణంగా లొడలొడా వాగేవారి ఆలోచనలు, మనసు, మేథస్సు లోతుగా వుండవని మనస్తత్వ శాస్త్రవేత్తల అంచనా, కానీ వేలాయుధం అందుకు వ్యతిరేకం. అర్థంపర్థం లేనట్లు మాట్లాడుతున్నా, అతని అంతరంగంలో అనూహ్యమైన ఎత్తుగడలు క్షణాల్లో ఊపిరిపోసుకుంటుంటాయి.
కరియా భుజబలం_ వేలాయుధం బుద్ధిబలమే వీరూకి అనుక్షణం ఎదురయ్యే ప్రమాదాలనుంచి కాపాడే శక్తులని పోలీసుల నమ్మకం.
"కరియా బృందం ఎక్కడ మాటువేసిందో మనకు తెలీదు. మనం ఇక్కడ మకాం చేసినట్లు కరియా బృందానికి కూడా తెలీదు. మనం ఏం చేయాలి? ఎప్పుడు చేయాలనేది అంతకంటే తెలీదు...." ఒక అనుచరుడు సాలోచనగా అన్నాడు.
"మనం ఇక్కడ మకాం చేసి ముప్ఫైఆరు గంటలు దాటిపోయింది. అయినా మనం ఏం చేయాలన్నది యాజమానరే నుంచి వర్తమానం రాలేదు. అంటే ఈ ప్రాంతంలో పోలీసుల ఆనవాళ్ళు కనిపించాయా....?" మరొకరు అన్నారు అనుమానంగా.
అప్పటివరకు మౌనంగా వున్న వేలాయుధం ఏదో అనేందుకు ప్రయత్నిస్తుండగా పొదల్లో చిన్న కదలిక.... అందరూ ఊపిరిబిగబట్టి ఆయుధాలపైకి చేతుల్ని పోనిచ్చారు. వేలాయుధం మాత్రం నిబ్బరంగా వున్నాడు.
మరికొన్ని క్షణాల్లో వారిముందు ఒక కుక్క ప్రత్యక్షమయింది, గోధుమవన్నె రంగులో లేగదూడంత పరిమాణంతో వున్న ఆ కుక్క వగర్చుతూ వేలాయుధాన్ని సమీపించి తన నోట కరచిన కాగితాన్ని తీసుకోమన్నట్లుగా చూసింది.
సడన్ గా ఎవరన్నా ఆ కుక్కని చూస్తే భయపడిపోతారు. అంత వయొలెంట్ గా వుంటాయి దాని చూపులు.
వీరూ నుంచి సూచన వచ్చిందని గ్రహించారంతా, వేలాయుధం కాగితాన్ని అందుకోగానే భైరవీ అనే పేరుగల ఆ కుక్క వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది.
వీరూ రక్షణ దుర్గాల్లో అత్యంత ప్రాముఖ్యతను స్వంతం చేసుకొనేది ఆ కుక్క. వీరూ మనుషుల కన్నా జంతువులనే చాలా విశ్వసిస్తాడు. భైరవికి వీరూకున్న అనుబంధాన్ని చూసి ఒక్కోసారి అతని అనుచరులు సయితం అసూయ చెందుతుంటారు, వీరూ ఎప్పుడు ఏది తినాలన్నా, భైరవి ఆ ఆహారాన్ని రుచి చూసి అది తనమీద ఏ ప్రభావం చూపలేదని తెలుసుకున్నాకే వీరూని దరిచేరనిస్తుంది.
కొన్ని పదుల కిలోమీటర్ల దూరాన్నైనా అతి సునాయాసంగా అతి తక్కువ కాలంలోనే సాధించగలుగుతుంది. అప్రమత్తత ముందు పుట్టి భైరవి ఆ తరువాత పుట్టిందేమోనన్న అభిప్రాయాన్ని కలిగిస్తూ చీమ చిటుక్కుమన్నా అలర్ట్ అయిపోతుంది. వీరూని సమీపించే ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తుంది, అంతరంగంలోనే శతృత్వాన్ని దాచుకొని పైకి మాత్రం స్నేహాన్నీ, అభిమానాన్నీ ప్రదర్శించేవార్ని ఇట్టే పసిగడుతుంది.
రాత్రిళ్ళు వీరూ నిద్రపోయేటప్పుడు భైరవి మేలుకుని ఉంటుంది. యాభై మీటర్ల రేడియస్ లో అది పరిభ్రమిస్తూ ప్రమాదాల్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుంది. చివరికి కరియాని, వేలాయుధాన్ని కూడా వీరూ నిద్రపోయేటప్పుడు దగ్గరకు రానివ్వదు.
దృఢంగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండే భైరవి నలుగుర్ని సయితం తేలిగ్గా మట్టి కరిపించగలదు. ఏ కండకాకండ నిర్ధాక్షిణ్యంగా చీల్చివేయగలదు. ఒక కాగితాన్నిచ్చి కరియాకి ఇచ్చి రమ్మంటే కరియాకి_వేలాయుధానికి ఇచ్చిరమ్మంటే వేలాయుధానికి ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా శరవేగంతో దూసుకు వెళ్ళిపోయి, వారికే ఇచ్చి తిరిగి అదే వేగంతో వీరూని వచ్చి కలుస్తుంది. దానినోట వున్న కాగితాన్ని వేరే వ్యక్తులు పొందటం అనేది దుర్లభం.
నియంత్రించిన రోబోట్ కి విశ్వాసాన్నీ, నిబద్ధతనీ, నీతినిజాయితీల్ని జోడిస్తే భైరవి అవుతుంది.
