ఎప్పుడు ఏం చేయాలో, ఏ దిక్కుకు కదిలిపోవాలో, ఏ ప్రాంతంలో మకాం చేయాలో ఆఖరి అరగంటలోగానీ వారికి తెలీదు. ఎవరో హఠాత్తుగా ఎటు నుంచో వచ్చి వీరూ ఆజ్ఞల్ని చేరవేసి అదృశ్యమైపోతారు. ఒక్కోసారి పెంపుడు జంతువయినా అతని ఆజ్ఞలతో రావచ్చు. పచారి సామాన్ల కోసం, కూరగాయల కోసం వెళ్ళిన తమ అనుచరులు ఎంతకి రాకపోవటంతో కొందరికి అనుమానం కలిగింది. మరికొందరు కేవలం రైస్ ని ఎలా తినాలనే ఆలోచనలతో సతమతమవుతున్నారు.
అంతలో ఆ నిశ్శబ్ద నీరవాన్ని ఛేదిస్తూ ఒక కూత వినిపించింది. అందరూ ఒక్కసారి ఆ దిక్కుకేసి తిరిగి స్థిమితపడ్డారు. వచ్చేది శత్రువులో మిత్రులో తెలిసేందుకు వాళ్ళు ఆ సంకేతాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
మరికొద్దిసేపట్లో వెళ్ళిన ఇద్దరు అనుచరులు చెమటలు కక్కుతూ చెరొక గోతంతో వచ్చారు. వాటినిండా కూరగాయలు, మసాలా దినుసులు, ఎడిబుల్ ఆయిల్ పాకెట్స్ ఉన్నాయి. అప్పటివరకు వారిలో వున్న ఆకలి రెట్టింపయ్యింది. టమోటా చారు, సాంబారు నిమిషాల్లో తయారయిపోయాయి.
భోంచేస్తుండగా కరియాకి అనుమానం వచ్చింది.
"ఇంతసేపు పట్టిందేమిటి?" అడిగాడు కరియా.
"మా మూలంగా కాదు_ అతను కూరగాయలు తీసుకురావటం ఆలస్యమైంది" అన్నాడు వాటికోసం వెళ్ళిన వారిలో ఒకడు.
"అతను కూరగాయలు ఎక్కడినుంచి తెచ్చాడు?" కరియా తిరిగి అడిగాడు.
"కౌదల్లి నుంచి"
"కౌదల్లి....కౌదల్లి నుంచి మలైమహదేశ్వరా హిల్స్ కి మధ్యదూరం సుమారు నలభై కిలోమీటర్లుంటుంది. మధ్యాహ్నం బస్సులో కౌదల్లివెళ్ళిన మనిషి పొద్దుపోయాక వచ్చాడంటే, ఏమిటర్ధం.... వచ్చేప్పుడు గూడ్స్ ఆటోలో వస్తాడు. అయినా ఆలస్యమైందన్న మాట...." అని అంటూ కరియా భోజనం ముగించి తిరిగి రైఫిల్ చేతబూని పహరా కాయసాగాడు.
సరీగ్గా ఇదే సమయంలో కూరగాయల వ్యాపారి ఇంటిముందు ఒక అంబాసిడర్ కారు వచ్చి ఆగింది.
నీతి, నిజాయితీలకు, ధైర్యసాహసాలకు ప్రతిరూపమైన మైసూరు ఎస్.ఐ. దినేష్ కారు దిగి తన వాళ్ళకు సైగ చేశాడు.
మలై మహదేశ్వరా హిల్స్ పదిహేనువందల జనాభా వున్న గ్రామం. అడవుల మధ్యలో వుండే గ్రామాలు సంధ్య చీకట్లు ముసురుతూనే గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోతాయి. చీకటిని ఆసరా చేసుకొని ఏ కౄర జంతువులు ఏ క్షణంలో గ్రామంలోకి ప్రవేశిస్తాయో, తాము పెంచుకున్న మేకల్ని, గొర్రెల్ని, గేదెల్ని, చివరకు తమనైనా ఏం చేస్తాయో తెలీని భయం వారిని నీడలా వెంటాడుతుంటుంది. అందుకే పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేసుకొని ఆరు ఏడు గంటలకే పడకలు ఎక్కేస్తారు.
ఎట్టి పరిస్థితిల్లోనూ రాత్రిళ్ళు తలుపులు తీసి బయటకు వచ్చే సాహసం చేయరు.
సరీగ్గా అలాంటి అపరాత్రివేళ తలుపుకొట్టిన చప్పుడయి ఆ వ్యాపారి ఒక్కక్షణం వణికిపోయాడు.
ఒకింతసేపటికి ధైర్యాన్ని ప్రోది చేసుకొని వెళ్ళి తలుపు తీశాడు. చీకటిగా వుండడం మూలంగా వచ్చిందెవరనేది ఆ వ్యాపారి గుర్తించలేక వరండాలోని లైట్ వేసి ఆ వెలుగులో వారిని పరిశీలనగా చూశాడు.
అంతలో ఎస్.ఐ. దినేష్ తో వచ్చిన ఒక కానిస్టేబుల్ ముందుకు వచ్చాడు. అతన్ని చూసి గుర్తుపట్టాడు వ్యాపారి, అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు.
ఎనిమిది గంటలు వెనక్కి వెళ్తే....
కర్ణాటక అటవీ ప్రాంతంలో స్మగ్లర్స్ కార్యకాలాపాలు ఎక్కువయ్యాయని, వారిని నిరోధించటం, పట్టి బంధించటం ఫారెస్ట్ డిపార్టుమెంటుకి తలకి మించిన భారం అయిందని రాష్ట్ర ప్రభుత్వం మెరికల్లాంటి పోలీసు అధికారుల్ని ఏరి మైసూర్ కి స్పెషల్ డ్యూటీ మీద పంపించటం జరిగింది. అలా వచ్చిన వారిలో ఎస్.ఐ.దినేష్ ఒకరు. అతను వచ్చిన దగ్గర్నుంచి వీరూ గ్యాంగ్ ఆనుపానుల్ని, నెలవుల్ని, కదలికల్ని పసిగట్టే ప్రయత్నంలో రాత్రింబవళ్ళు శ్రమించసాగాడు.
ఎప్పుడు ఏ ఇన్ ఫర్మేషన్ వచ్చినా రాత్రనక, పగలనక హుటాహుటిన బయలుదేరి వెళ్ళిపోతాడు.
అలాగే ఆ రోజు ఉదయం ఎవరో ఇన్ ఫార్మర్ ఫోన్ చేసి వీరూ అనుచరులు హోగెనకల్ ఫాల్స్ ప్రాంతంలో మకాం చేసి ఉన్నట్లు తెలపటంతో నలుగురు కానిస్టేబుల్స్ ని తీసుకొని పోలీస్ డిపార్టుమెంట్ జీప్ లో కాకుండా అంబాసిడర్ కారులో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకి కౌదల్లి చేరుకున్నాడు దినేష్.
అక్కడ లంచ్ తీసుకొని బయలుదేరబోతుండగా బ్యాటరీ ఛార్జ్ కావటంలేదని, ఆర్మీక్చర్ కాలిపోయిందేమోనని డ్రైవర్ అనుమానం వెలిబుచ్చటంతో కారుని టౌన్ బయట వున్న మెకానిక్ షెడ్ కి తీసుకొని వెళ్ళి రిపేర్ చేయిస్తుండగా ఒక గూడ్స్ ఆటో చిన్న ప్రాబ్లమ్ వచ్చి అదే షెడ్ కి వచ్చింది.
ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా వున్న దినేష్ గూడ్స్ ఆటో డ్రైవర్, షెడ్ లోని మెకానిక్ మాట్లాడుకొనే మాటలు చెవినబడ్డాయి. కూరగాయలు తీసుకొని వెళ్తున్న ఆ గూడ్స్ ఆటో మలై మహదేశ్వర హిల్స్ వెళ్ళి వాటిని అన్ లోడ్ చేసి రావాలన్నదే వారి మాటల సారాంశం.
దినేష్ కి వెంటనే అనుమానం వచ్చింది.
ఒక కానిస్టేబుల్ ని పక్కకు పిలిచి ఏదో చెప్పాడు.
అతను కూరగాయల్ని తీసుకువెళ్తున్న వ్యాపారిని చిన్నగా మాటల్లోకి దింపి టమోటాలు కేజీ ఎంత అని, బీరకాయలెంతని, వాటి రేట్లతో పాటు క్వాంటిటీని కూడా తెలుసుకొని వచ్చి ఎస్.ఐ.దినేష్ కి చెప్పేలోపే గూడ్స్ ఆటో మలై మహదేశ్వర హిల్స్ కేసి సాగిపోయింది.
