Previous Page Next Page 
వారుణి పేజి 6


    ఒక్కక్షణమాగి "నాన్నా!" అంటూ పిలిచాడు సారధి.
    "ఊఁ బాగా ఎండన పడి వచ్చారన్నమాట!"
    "అవును నాన్నగారూ !"
    "వెళ్ళి స్నానం చెయ్-కాఫీ యిచ్చిందా మీ అమ్మ!"
    నవ్వేడు సారధి, నవ్వే జవాబు అన్నట్టుగా.
    "సారధీ! ఇవన్నీ ఫార్మాలిటీస్. వీటిని వదిలెయ్. వీటికి జీవితంలో అంత ప్రాధాన్యత లేదు. ప్రాముఖ్యమూ లేదు."
    "కానీ డాడీ-"
    "విను, వారుణి చాలా యోగ్యురాలు. తొలిచూపులోనే గ్రహించాను. నువ్వు సుఖపడ్తావు. తను సుఖపడ్తుంది. భార్య భర్తలు సుఖంగా వుండాలి. ఆ తర్వాతే ఎవరయినా. మనస్సుకి నచ్చి మనువాడారు. ఇక పొరపొచ్చాలు రాకుండా చూసుకుని సుఖపడండి సారధీ! ఐ విష్ యు ఎ హేపీ మేరీడ్ లైఫ్" మనస్ఫూర్తిగా అభినందించి ఆశీర్వదించారాయన.
    తండ్రి కంఠంలోని సిన్సియారిటీ, ఆయన ముఖంలో ప్రతిబింబిస్తోన్న స్వచ్ఛత, ఆయన మాటల్లోని ఆత్మీయత అతన్ని కదిలించాయి
    "థాంక్యూ డాడీ!" అన్నాడు కొద్దిగా భుజాలు ఎగరేస్తూ.
    "అన్నట్టు రేపా ? ఎల్లుండా? మీరు బయలుదేరేది? వివాహం కాగానే వారుణి సారధి కలసి టూర్ వెళ్ళాలని ముందుగానే నిశ్చయించుకున్నారు. అదే హనీమూన్. అదే విలాసయాత్ర. అదే వినోదయాత్రం. బ్రతుకు బరువులో కృంగిపోక ముందు హాయిగా స్వేచ్చగా తిరిగొచ్చే ప్రయాణం. జీవితమనే కాలంలో వచ్చే తొలి వసంత ఋతువు ఆ సమయం. దాన్నలా వినియోగించుకోవాలనుకున్నారు.
    నాన్నగారు తమ పెళ్ళివిషయం చర్చించదలచుకోలేదనీ అందుకే విషయం మార్చాడని అనుకున్నాడు సారధి. అది గుర్తించగానే తనలో తనే నవ్వుకున్నాడు.
    "ఆఫీసుకి వెళ్ళి మాట్లాడాలి నాన్నగారూ! ప్రిన్సిపాలు గారు ఏమంటారో సూపరింటెండెంట్ ఏమంటారో, ఆర్.జే.డీకీ రాయాలంటారో కనీసం నెల రోజులయినా సెలవివ్వందే తను రానంటుంది వారుణి. కనీసం సౌత్ అంతా తిరిగి రావాలని తన కోరిక. మధుర, రామేశ్వరం, త్రివేండ్రం, తంజావూరు, కన్యాకుమారి, మద్రాసు, తిరుపతి-ఒక్కచోట రెండు రోజులు అనుకొని మొత్తానికి నెలరోజులు కావాలి-"
    కొడుకు తన మనస్సులోని మాటని, భార్య మాటగా చెప్పాడని గ్రహించాడు నారాయణ.
    "అవును! ఊరకే నాలుగురోజులు అలా తిరిగొచ్చేందుకు ఎందుకు వెళ్ళాలి? బాగా తీరిగ్గా, విశ్రాంతిగా చూసిరండి! ఇదిగో వెయ్యి రూపాయలు. ఇది మీకు నా ప్రెజెంటేషన్. స్వయంగా పెళ్ళికి రాలేకపోయాను. దీన్ని చార్జీలకి ఖర్చులకి ఉపయోగించుకో. లేదా మీ యిష్టం- ఏదయినా కొనుక్కోండి. లేదా ఆమె పేరిట బ్యాంక్ లో ఎఫ్.డి. వెయ్యి. నీయిష్టం."
    జేబులోంచి పదివందల రూపాయి నోట్లు అందివ్వగానే నవ్వుతూ తీసుకున్నాడు సారధి.
    "థాంక్యూ డాడీ!" అన్నాడు కృతజ్ఞతగా.
    కొన్ని క్షణాలాగి "వారుణి వెంట ఎవరూ రాలేదేం? మీ మామగారు- అత్తయ్యగారో ఎవరో ఒకరు వచ్చి వుంటే బాగుండేది" అన్నాడు నారాయణ గృహ యజమానిగా, వరుడి తండ్రిగా ఆయన కోరిన కోరిక-
    సారధి ఆ మాటలు వినగానే చప్పున తండ్రి ముఖంలోకి చూశాడు, కానీ సమాధానం చెప్పలేదు.
    "ఈ పెళ్ళి వాళ్ళకీ యిష్టంలేదా?" సూటిగా ప్రశ్నించాడు నారాయణ. అటు వధువు తల్లితండ్రీ కూడా తమలాగే ప్రవర్తించారనీ, అయితే తను సాదరంగా ఆహ్వానించటంలో వాళ్ళకంటే ఉన్నత సంస్కారం కలవాళ్ళమని నిరూపించుకుంటున్నామనీ ఆ ప్రశ్నలో ధ్వనించారాయన.
    అయితే ఆ సూటి ప్రశ్నకి జవాబుగా సూటి చూపులే ఎదుర్కొన్నాడు నారాయణ. సారధి ఇంతకు ముందులాగే మౌనం వహించాడు. చూపు తిప్పకుండా తండ్రి గుండెల్లో నాటుకునేలాగా నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్మలంగా చూశాడు.
    ఆ చూపులు గుండెల్ని తాకాయి. ఎద లోతుల్లో చొచ్చుకుని పోయాయి. ఎన్నెన్నో అనుభవాలని చవిచూసిన నారాయణ ఆ చూపుల అర్ధాన్ని గ్రహించుకున్నాడు.
    వెంటనే తన తప్పుని సవరించుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS