Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు-3 పేజి 6


    "సారీరా సత్యం! ఆ అమ్మాయే మా అమ్మాయి రాధ"

 

    సత్యం మరింక మాటాడలేదు వెళ్ళిపోయేందుకు వెనక్కి తిరిగేడు.


                                       7


    ఫోటోకి ఫోజివ్వడం గొప్ప శిక్షే!

 

    అంతకంటే గోడ కుర్చీ వేయడం సుఖం కాళ్ళు నొప్పులెట్టినా డోంట్ కేర్ ని తోసేయవచ్చు.

 

    ఫోటో సంగతి అట్లాకాదు. ఫోటో గ్రాఫరు సర్కస్ లా రింగు మాస్టర్లాగా క్షణానికో సూచన యిస్తాడు.

 

    తల ఎత్తమంటాడు. కొంచెం దించమంటాడు. నవ్వమంటాడు. నవ్వితే పళ్ళు బయట పడకూడదంటాడు. చిరునవ్వు నవ్వాలంటాడు. అదెట్లా వుంటుందో తెలీని మనిషి దాన్ని ప్రాక్టీసు చేయడానికి గింజుకు చావాలి.

 

    చేతులు కట్టుకోమంటాడు. గాలి పీల్చకూడదంటాడు. కెమెరావేపు చూడమంటాడు. ఆ చూపు అలవోకగా వుండాలంటాడు.

 

    నోటికొచ్చిన సూచనలిస్తూ ప్రాణాలు తింటాడు.

 

    ఫోటో దించేది ఒక్క మనిషే అయితే ఏదో ఇబ్బంది పడి అవునని పించుకోవచ్చు.

 

    అదే ఇద్దరయితే ఇబ్బంది రెట్టింపవుతుంది.

 

    ఒకరినవ్వు బావుంటే ఇంకొకరు పళ్ళికిలించే ప్రమాదముండొచ్చు. ఒకరు స్టడీగా కూచుంటే మరొకరు సర్దుకోవడం తోనే సతమతం కావచ్చు. వారు సిద్ధమైనప్పుడు వీరి మూడ్ పాడవ్వచ్చు. ఫోటో దిగే ఇద్దరిలో ఒకరు మగ ఇంకొకరు ఆడ అయిన పక్షంలో ఆ రభస కొంచెం పెద్ద స్థాయిలోనే వుంటుంది.

 

    ఆ ఇద్దరూ ప్రేమికులయితే ఆ బీభత్సం వర్ణనాతీతం!

 

    ఆర్కె స్టూడియోలో అక్షరాలా అలాంటి భీభత్సమే జరుగుతోంది.

 

    అరగంట గడిచినా కెమేరా క్లిక్ మనలేదు. ఫోటోగ్రాఫర్ సవాలక్ష సూచనలిస్తూ కృష్ణమూర్తి పద్మల ప్రాణాలు తింటూనే వున్నాడు.

 

    ఎలాగోలాగు కానిచ్చెయ్ మన కృష్ణమూర్తి కోరినా కుదరదన్నాడు. అందమైన జంటని ఆషామాషీగా ఫోటో తీస్తే. విద్యకు అపచారం జరిగి పోయి నట్టవుతుందన్నాడు. తీసినవాడికి పుట్టగతులుండవన్నాడు.

 

    పద్మకి కసి, కోపం ఎక్కువై పోతున్నాయి. కృష్ణమూర్తి ఏమనుకుంటున్నాడో గాని పైకి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నిబ్బరంగా వున్నాడు. ఫోటోగ్రాఫరు సూచనలన్నిటినీ మన్నిస్తున్నాడు.

 

    ఆ విధంగా---

 

    కృష్ణమూర్తి పద్మలు ఫోటో దిగే కార్యక్రమం జయప్రదంగా ముగిసేందుకు ముప్పావుగంట పట్టింది.


                                           8


    హైదరాబాదుకి వచ్చే రైలది!

 

    సత్యం ఫస్టుక్లాసులో వున్నాడు. వ్యాపార వ్యవహారంపై రెండు రోజుల క్రితమే విజయవాడ వెళ్ళి యిప్పుడు తిరుగు ప్రయాణం చేస్తున్నాడు.

 

    సాధారణంగా సత్యం కారులోనో, విమానంలోనో ప్రయాణం చేస్తుంటాడు. తిక్కపుట్టినప్పుడు మాత్రం తప్పనిసరిగా రైలెక్కుతాడు.

 

    ఆ రోజు అదే జరిగింది!

 

    బ్రాంచి మేనేజరు సత్యానికి ఫ్లయిట్ టిక్కెట్టు తెచ్చేడు. తీసుకురమ్మని చెప్పింది కూడా సత్యమే.

 

    తీరా అతను టిక్కెట్టు తెచ్చేక సడన్ గా మనసు మార్చుకున్నాడు సత్యం.

 

    రైల్లో వెళ్ళాలని వుందని చెప్పాడు. టైమీజ్ మనీ అనే సిద్ధాంతానికి కట్టుబడిన సత్యం రైలెందుకు కోరుకుంటున్నాడో మేనేజరుకు బోధపడలేదు.

 

    అక్కడికీ సత్యం సిద్ధాంతాన్ని గుర్తు చేసేడు కూడాను.

 

    సత్యానికి అప్పుడప్పుడు తమాషాగా తిక్కపుడుతుంది. పుట్టేక ఎవరెన్ని చెప్పినా వినిపించుకోడు.

 

    సత్యానికి పుట్టే తిక్క గురించి ఇక్కడ కొంత వివరించాలి.

 

    ఫార్టీ ఇయర్సు పెద్ద మనిషి అకస్మాత్తుగా ఫోర్టీన్ ఇయర్స్ పిల్లవాడుగా మారిపోవాలనుకోవడం ఎంతమందికుంటుందో గాని- ఆ ఫీటు సత్యానికి మామూలే!

 

    ఆనందంగా వున్నా విసుగు కలిగినా అతను పద్నాలుగేళ్ళ పిల్లవాడై పోతాడు.

 

    అప్పుడతను ఏ కుర్రచేష్టలు చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు.

 

    ఎక్కడికి వెడుతున్నదీ ఎవరికీ చెప్పకుండా కారెక్కేస్తాడు. స్వయంగా తానే డ్రైవ్ చేసుకుంటూ ఊరి చివరకు వెళ్ళిపోతాడు.

 

    చుట్టుపక్కల నిర్మానుష్యంగా వున్న కాలువో చెరువో చూసుకుంటాడు. అక్కడ కారు ఆపి దిగుతాడు.

 

    పేంటూ షర్టు విప్పేస్తాడు గబుక్కున చెరువులో దూకుతాడు. కాసేపు ఈదుతాడు. తామరపూలు కోస్తాడు.

 

    గట్లవెంట నడుస్తూ లల్లాయి పాటలు పాడతాడు - వాటి ప్రతిధ్వనులు వింటూ మురిసిపోతాడు.

 

    ఆ విధంగా అతను గంటా రెండు గంటలు కాలక్షేపం చేసి తన చిన్ననాటి ముచ్చట్లు జ్ఞాపకం చేసుకుంటాడు.

 

    ఫీట్ నెంబర్ రెండు-

 

    ఇంట్లోనే అర్జంటుగా పిల్ల చేష్టలు చేయాలనుకున్నప్పుడు గోళీలు తీసుకుంటాడు.

 

    ఫీట్ నెంబర్ మూడు-

 

    పొరుగూర్లో ఉన్నప్పుడు తానెవరో తెలీదు గనుక స్టంటు సినిమాకి నేల టిక్కెట్టు కొని వేరుశెనక్కాయలు కొట్టుకుంటూ చూస్తాడు.

 

    పై జాబితాలోనే ఈ రైలు ప్రయాణం కూడా చేరుతుంది.

 

    రైలెక్కి కిటికీ పక్కన కూచోవాలి. రైలు నడుస్తుండగా వెనక్కి పరిగెత్తే స్థంభాల్నీ, పొలాల్నీ వింతగా చూడాలి.

 

    ఇప్పుడు సత్యం చేస్తున్న పని అదే!

 

    రైలు శబ్దానికి లయబద్ధంగా కొన్ని పదాలు గొణుక్కుంటున్నాడు.

 

    "కొడతా! కొడతా! చెప్పుచ్చుకొడతా!" "తిడతా! తిడతా! నోటికొచ్చింది తిడతా!"

 

    ఆ విధంగా కొంతసేపు నడిచింది.

 

    అకస్మాత్తుగా---

 

    ఒక పద్యం పాడితే ఎట్లా వుంటుందో చూద్దామనుకున్నాడు. ఆ కూపేలో అతనితోపాటు మరో ముగ్గురున్నారు.

 

    ముగ్గురూ గొప్ప ఖరీదుగా కనిపిస్తున్నారు. చెడ్డ సీరియస్ గా వున్నారు.

 

    పద్యం పాడితే వాళ్ళు కోప్పడొచ్చు!

 

    వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక సత్యం ఆ కూపేలోంచి బయటకొచ్చేడు.

 

    రైలు వేగంగా పోతూనే వుంది.

 

    సత్యం తిన్నగా తలుపు దగ్గిరకి చేరుకున్నాడు. తలుపు తీసేడు. రైలు వేగానికి గాలి రయ్యిన వీస్తోంది.

 

    మనిషిని తోసేస్తోంది గాలి.

 

    సత్యానికి ఉత్సాహం ఎక్కువైంది. గొంతు విప్పేడు. చాలా గంభీరంగా పద్యం అందుకున్నాడు---

 

    "బావా ఎప్పుడు వచ్చితీవు---"

 

    పద్యాన్ని రాగాల్తో మెలికలు తిప్పుతూ పది నిమిషాలు లాగించేడు. అక్కడితో ఆగిపోతే బావుండు. "జండాపై కపిరాజు" కూడ గుర్తుకొచ్చింది.

 

    ఆ రికార్డు కూడా పెట్టి అయిదో పదో నిమిషాలు అల్లల్లాడించే వాడే.

 

    అంతలో-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS