పార్వతికి కళ్ళు చెమ్మగిల్లాయి. కొడుకుమీద ప్రేమాభిమానాలు పొంగిపొర్లాయి బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో అనుకుంది.
"మీ ఆడవాళ్ళంతా ఇంతేనమ్మా." మెత్తని మనసు! నాలుగు మాటలు చెప్పగానే ఇట్టే కన్నీళ్ళు పెట్టేసుకుంటారు. నీకో గమత్తయిన సంగతి చెప్పనా?" అన్నాడు తమాషాగా నవ్వుతూ.
"ఏమిటది?" కన్నీళ్ళు చీర చెంగుతో తుడుచుకుంటూ అడిగింది.
"కమలాపురంలో నాటకం వేశాం. అక్కడే రెండు రోజులుండాల్సొచ్చింది. ఆ వూరి పెద్దరెడ్డిగారమ్మాయి...
"వూఁ అమ్మాయి" రెట్టించిందామె ఆందోళనగా_
తల్లి అమాయకత్వానికి పకపక నవ్వాడతను.
"ఇంతకీ ఏమందిరా అమ్మాయి?"
"ఒకమ్మాయి, అబ్బాయితో ఏమంటుందమ్మా? ఆమాత్రం తెలీదూ?"
"అబ్బ! విసిగించక అసలువిషయం చెప్పరా"
"అయితే చెపుతున్నాను విను_ నన్ను ప్రేమించానంది"
"ప్రేమ" గుండెలమీద చేతులు వేసుకుని ఆశ్చర్యంగా చూసిందామె.
"అక్షరాలా ప్రేమే నేనంటే చాలా యిష్టమంది. వాళ్ళ నాన్నకి తెలిస్తే చంపేస్తాడని పారిపోదాం రమ్మంది_ తనతో యాభై తులాల బంగారం తెస్తానంది"
"నువ్వేమన్నావు?" ఆందోళనగా చూసింది.
"ఏమంటానో ఊహించుకోలేవామ్మా"
"ఏమోరా - అంతా గొడవగా వుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు మరీ తెగించిపోయారు. అంతా వాళ్ళ యిష్టమే. వాళ్ళ సాహసమే బ్రాహ్మణ బిడ్డవి. అలాంటి అప్రాచ్య పనులు చేయకు నాయనా! నలుగురిలో తలెత్తుకు తిరగలెం. భయం భయంగా చూస్తూ అంది.
"పిచ్చి అమ్మా! నీ కొడుకుమీద నమ్మకం లేదా! అమ్మాయికి మంచి మాటలు చెప్పి ఒప్పించి నమ్మించి... బుజ్జగించి లాలించి యింటికి పంపించితిని"
స్వాతి పక పకా నవ్వేసింది. "మరిదిగారు చతురులే" అంది గిన్నెలు సర్దుతూ.
"మరేమిటనుకున్నావ్ వదినా! నిగ్రహంలో ఆ కచుడి లాంటివాడిని. పరకాంత లెదురైన మాతృభావన చేసి మరలువాడను"
పార్వతి తృప్తిగా నిట్టూర్చి కొడుకువంక ప్రశంసా పూర్వకంగా చూసింది.
"వస్తానమ్మా, రాత్రికే నాటకం వుంది. ట్రూపు అంతా వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు ప్రయాణం ఎల్లుండి నాటకం"
"ఒరే_ మీ నాన్నగారిని చూసి మాటాడిపోరా, ఈ డబ్బూ ఆయనకే యిచ్చేస్తే ఎంతో సంతోషిస్తారు" ప్రయాణానికి సిద్ధమవుతున్న కొడుకుతో అంది. కొడుకు ప్రయోజకత్వాన్ని తండ్రికూడా మెచ్చుకోవాలని ఆమె ఆశ.
పేలవంగా నవ్వాడతను.
"లాభం లేదమ్మా! నాన్నగారి ముఖం ఇప్పుడే చూడలేను. ఇంకా బాగా పేరు తెచ్చుకుని బాగా సంపాదించిన రోజున ఆయన క్కనబడతాను. ఈ వూళ్ళోనే నాటకం వేసి_ సన్మానం చేయించుకుని నాన్నగారితో సన్మాన పద్యాలు రాయించుకున్న రోజున వస్తాను"
"అవేం మాటలురా అప్పటిదాకా ఆయనతో మాట్లాడవా" బాధగా అడిగింది.
"అంతే నమ్మా! నీకు తెలీదు ఆయన షష్టిపూర్తికి నేను ఘనంగా సన్మానం చేస్తాను..." అన్నాడు ఆవేశంగా.
పార్వతి మరేం మాటాడలేకపోయింది. కొడుకు పట్టుదల గురించి ఆమెకు బాగా తెలుసు.
సీతారాం ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు.
స్వాతి మాటల్లేక పోయింది. వెళుతున్న మరిదిని చూస్తూ వుండిపోయింది.
చేయి కడుక్కోబోతున్న అత్తగారిని చూసి...
"అత్తయ్యా! మీరు భోంచేయనేలేదు" అంది.
"ఏం భోజనమమ్మా కడుపు నిండిపోయింది" అంది బాధగా.
"మీరలా బాధపడకండి - అతనేం తప్పు చేయటంలేదు. తను ఎన్నుకున్న జీవనమార్గంలో సూటిగా పయనిస్తున్నాడు. అదేం నేరంకాదు_ ఈ రోజులలో వేషాలు వేయటానికి అందరూ ఉబలాట పడుతున్నారు. సినిమారంగానికి వెళ్ళాలని తహతహ లాడుతున్నారు" అంది.
పార్వతి సమాధానం ఇవ్వలేదు.
లేచి పళ్ళెం కడిగేసింది.
స్వాతి రెట్టించలేదు. తనూ లేచి పళ్ళెం కడిగి వంటింటి తలుపు చేరవేసి కాంపోజిషన్స్ దిద్దటంలో నిమగ్నమయింది.
ఈజీ చెయిర్ లో పడుకుని ఆలోచనలో పడిపోయింది పార్వతి.
* * *
ఆమె ఆలోచనలలో వుండగానే దాశరధి వచ్చాడు.
గదిలోకి వెళ్ళి లుంగీ చుట్టబెట్టుకుని వచ్చి కాళ్ళు కడుక్కుని రాగానే పార్వతి లేచింది.
"మీరు కూర్చోండత్తయ్యా? నేను వడ్డిస్తాను" అంది పార్వతి.
పార్వతి పలకలేదు.
"నువ్వింకా భోజనం చెయ్యలేదమ్మా" అడిగాడు. అతని కంఠంలో ఉదయం చిరాకు లేదు తల్లిపై ప్రేమ కనిపించింది.
పార్వతి సమాధానం యివ్వకుండా కొడుక్కి పళ్ళెం పెట్టింది.
స్వాతి వచ్చి చొరవగా అత్తగారిక్కూడా పళ్ళెం పెట్టి యిద్దరికీ వడ్డించింది. పార్వతి ఏదో అనబోయింది.
