నేను చాలా సంవత్సరాలు భ్రమలో వుండిపోయి, మీ గొప్పదనాన్ని మనసారా అభినందించుకుంటూ చీకట్లో మగ్గిపోకుండా, పెళ్ళయినా కొత్తదనం మాసిపోకుండానే దాంపత్యంలోని సుఖాల అపూర్వత తగ్గకముందే నా కళ్ళు తెరిపించారు. నా భ్రమలు తొలగించారు. మీకు థాంక్స్. చాలా చాలా థాంక్స్. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వెరీ మెనీ థాంక్స్.
కానీ ఒక సందేహం సారధిగారూ! అదీ మిమ్మల్ని యిప్పుడిలా చూస్తోంటే కలుగుతున్న సందేహమే. దాన్ని తీర్చగల సమర్థులు మీరే.
అందరు మగాళ్లూ యింతేనన్నట్టుగా మీరు గీతోపదేశం చేశారు. అదే నిజమయితే_ ఇక యీ ప్రేమలెందుకు? ఆప్యాయత లెందుకు? ఈ చదువు లెందుకు? సంస్కారం లేని యీ చదువులెందుకు? ఈ ఉద్యోగాలెందుకు?
చెప్పండి సారధిగారూ!
ఇవన్నీ యికెందుకు? వేస్ట్ కదా!"
రాతియుగం నాటి మనిషిలా ప్రవర్తించటం రాయి లాంటి మనిషికే చెల్లు. కానీ చదువూ, సంస్కారం, సంఘంలో ఒక ఉన్నత స్థానం, మనస్సులో ప్రేమ, మాటల్లో ఆత్మీయత వున్నట్టుగా ప్రవర్తించిన మనిషి కూడా రాయిలా అయిపోయి రాతియుగం నాటి మనిషిలా ప్రవర్తిస్తాడా?
నీలిశిల అయిన మనిషిలా తన జీవిత భాగస్వామిని అయిన స్త్రీని యిలా శాసిస్తాడా? అలా అయితే యీ సంస్కృతి, యీ సంస్కారం అంతా వ్యర్థం. అంతా వ్యర్థమే కదా సారధిగారూ!
అప్పుడు_అప్పుడు_ యీ వివాహ వ్యవస్థే కుళ్ళిపోయిందని అనుకోవాలి కదండీ సారధిగారూ!
కానీ_కానీ_ అది నిజం కాదని కొన్ని సాక్ష్యాలూ, ఆధారాలూ ఋజువులూ కన్పిస్తున్నాయే_ వాటి సంగతేమిటి? వాటినెలా అర్థం చేసుకోవాలండి మరి?
మా నాన్నగారు ఏనాడూ అమ్మని యిలా అగౌరవపరచలేదు. నాతోపాటే పెళ్ళి చేసుకున్న నా చెల్లెలు తన దాంపత్య సౌరభాలు వెదజల్లుతున్నట్టుగా ఉత్తరాలు రాస్తోంది. యింకా యింకా నే చూసిన అనేకులు సుఖంగా సంతోషంగా అనుకూలంగా బ్రతుకుతున్నారు.
మరి_మరి_యీ విపర్యసనం ఎలా వచ్చింది. ఈ వికృతి_ యీ ప్రకృతి వైపరీత్యం, ఈ రాద్దాంత ధోరణి ఎలా వచ్చింది? ఎక్కడనుంచి వచ్చింది. రాతియుగం నాటినుంచీ మాసిపోకుండా అనుక్రమణికంగా ఎలా వస్తోంది.
చెప్పమంటారా సారధిగారూ!
అది_అది_మీ_మీ_ మగాళ్ళలోనే వుంది. అవును. జీవితాన్ని నరకం చేయాలన్నా, స్వర్గం చేయాలన్నా అది మీ చేతిలోనే వుంది. గౌరవం అనేది యిచ్చిపుచ్చుకోవాలంటారు. అలాగే ఆత్మీయత కూడాను. ప్రేమ యిస్తేనే తిరిగి స్వీకరించే యోగ్యత వుంటుంది సారధిగారూ!
మీరు నా భావాలని, నన్ను గౌరవిస్తే_నేనూ మిమ్మల్నీ, మీ భావాలనీ గౌరవిస్తాను. అలా వీలు కానపుడు ఒక కప్పు కింద ఒక గదిలో కలసిమెలసి జీవిచటం కష్టమండీ.
కేవలం ప్రేమను కోరితే అది బలాత్కారంగా పుచ్చుకుంటే వచ్చేది కాదండీ. ఇవ్వటం మాత్రమే ఆడాళ్ళకి తెలిసినట్టుగా మీ మగాళ్ళకి పుచ్చుకోవటం మాత్రమే తెలుసు. అది నా తరహాకి, నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి సరిపడే విషయం కాదండీ_
అందుకే_
దయచేసి మనం విడిపోదాం. ఈ మానసిక హింస_ ఈ అవమానం_ ఈ నైచ్యం_ నేను భరించలేను. కాబట్టి మనం విడిపోదాం."
ముఖంలో స్థిరమైన భావాలు కన్పిస్తున్నాయి. మాటల్లో తడబాటు లేదు. తొందరతనం లేదు. ఆవేశం లేదు. తను చెప్పదలచుకున్న భావాలని నిర్దుష్టంగా చెప్పేసింది.
సారధి నిర్విణ్ణుడై పోయాడు.
అతనిలా పర్యవసిస్తుందని అనుకోలేదు. ఇది అతనూహించని పరిణామం.
అతని నోట మాట రాలేదు.
బలవంతాన పెళ్ళగించినట్టుగా "వారుణీ! నువ్విప్పుడు మంచి మూడ్ లో లేవు. దయచేసి పడుకో, నిద్రపో. తెల్లారి లేచి మంచి మనస్సుతో మాటాడుకుందాం. నిద్రపట్టకపోతే ఓ టాబ్లెట్ వేసుకో_" అన్నాడు.
