Previous Page Next Page 
వారుణి పేజి 67


    కట్టుకున్న ఏడంతస్తుల మేడ తన కళ్ళెదుటే కూలిపోయి నేలమట్టమవుతూ వుంటే చూస్తోన్న గృహ యజమానిలా అయిపోయింది. తను నిర్మించిన సంస్థ తన కళ్ళెదుటే ఛిన్నాభిన్నమైపోతూ వుంటే నిస్సహాయంగా నిలిచిపోయే వ్యవస్థాపకుడిలా అయిపోయింది. తను దర్శించిన వేదధర్మం తన కళ్ళెదుటే శిథిలమవుతూ వుంటే, ఏమీ చేయలేని అసహాయుడైన మంత్ర ద్రష్టలా అయిపోయింది. సప్త స్వరాలని కమ్మగా పలికించిన వీణ ముక్కలవుతూ వుంటే అశక్తుడై చూసే వైణికుడిలా అయిపోయింది.
    అది చూసిన సారధి, రాక్షస తృప్తితో బయటికి వెళ్ళిపోబోయాడు.


                                            32


    "సారధిగారూ!"
    కొత్త పిలుపు!
    ఆ పిలిచిన కంఠస్వరంలో స్థిరత్వం.
    మనస్సు ఘనీభవించే స్థితిలో పలికే పలుకు.
    ఆ పిలుపు విన్న సారధి చప్పున ఆగిపోయాడు.
    అతనింతసేపూ మనస్సులో ఒక భావన, మాటలో పట్టుదల, తన వైఖరిలో మొండితనం ప్రదర్శించాడు. చిన్న పిల్లలు ప్రదర్శించే మూర్ఖత్వం ప్రదర్శించాడు. వారుణిని బెదిరింపులతో, మాటలతో లొంగదీసుకోవాలనీ, తద్వారా కుటుంబంలో సుఖశాంతులు నెలకొల్పాలనీ అలా దురుసుగా, దౌష్ట్యంగా ప్రవర్తించాడు.
    కానీ ఆ అభినయం, దౌర్ష్యం, ఆ బెదిరింపు, ఆ ప్రవర్తన ఆఖరిసారిగా వైద్యుడు చేసే గరళ ప్రయోగంలా పరిణమిస్తుందని అతనెన్నడూ అనుకోలేదు. అందులో_ఆ ప్రయోగంలో రోగి బ్రతికేందుకు ఎంత అవకాశం వుందో_చనిపోవటానికీ అంతే అవకాశం వుంది. చావచ్చు_బ్రతకచ్చు. అది రోగి ఆయుష్షుమీదా, అతని బంధువుల అదృష్టం మీదా ఆధారపడి వుంటుంది.
    కాసయితే ఆ గరళ ప్రయోగ ఉద్దేశ్యమూ. ధ్యేయమూ రోగి బ్రతకాలనే! కానీ యిప్పుడా ప్రయోగం వికటిస్తోందా అనిపించి, భయపడ్డాడు సారధి.
    ఇంత ఊహా క్షణంలో_
    అతనా పిలుపు కలిగించిన దిగ్భ్రాంతి నుండి, ఆ షాక్ నుండి తేరుకున్నాడు. వెంటనే_"వరూ" అని పిలిచాడు. అప్రయత్నంగానే అందులో ప్రేమ_ఆప్యాయతా, అనురాగం పలికేయి.
    అయితే వారుణి వాటిలో దేన్నీ గమనించే స్థితిలో లేదు. ఆమె మనస్సు యింకా ఆ శిథిల చైతన్యం నుంచి కోలుకునే దశలోనే వుంది.
    అదో విధమైన ఆవేశంతో, ఉన్మత్త భావనలో లాగా స్థిర సంకల్పంతో దృఢ చిత్తంతో వివిధ భావ చైతన్యలహరిలో మునిగిన మనస్సుతో అంది.
    "సారధిగారూ!"
    మీరు నాకు జ్ఞానోపదేశం చేశారు. అందుకు మీకెంతో కృతజ్ఞురాలిని.
    అంట్లు తోముకుని బ్రతికే అప్పలమ్మకి, ఐ.ఏ.యస్. ఉద్యోగినికీ, మామూలు గృహిణినీ, మంత్రిణికీ, ఉత్తమ యిల్లాలు ఉద్యోగినీ అయిన స్త్రీకీ, ఊడిగంచేసే పనిమనిషికీ ఏమీ తేడా లేదని మీరు ఋజువు చేశారు.
    ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయేం గొప్పకాదు. అందరిలాంటిదే_ మామూలుగా పెళ్ళి చేసుకుని తాళి కట్టిన స్త్రీతో సమానమే అన్నారు. మంచిమాట. మీ మనస్సులోని మాట చెప్పారు. దానికీ థాంక్స్.
    చదువు వచ్చినా రాకపోయినా, ఉద్యోగం చేసినా, ఊడిగం చేసినా ఆడది ఆడదేనన్న తమ అమూల్యాభిప్రాయం వెలిబుచ్చారు. అందుకీ థాంక్స్.
    ఎంత ఉన్నతురాలైనా స్త్రీ ఒక మగాడికి భార్యగా, మొగుడికి అణిగి మణిగి చెప్పుకింద తేలులాగా వుండాలని బోధించారు. ఇల్లిటరేట్ అయినా యిల్లాలులాగా పతిభక్తి, అత్తమామలంటే పూజ్యభావం, స్వతంత్ర భావాలు_అసలు స్వంత భావాలంటూ లేకుండానే వుండాలని ఆదేశించారు. నేను మీ నీడగా, నీ పడగనీడ బానిసలాగా మీ భావాలకి సేవకిగా వుండాలని నిర్దేశించారు.
    చాలా సంతోషం సారధిగారూ!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS