నువ్వు అందంగా వున్నంత మాత్రాన కట్నం యివ్వవా? నేను తీసుకోకూడదా? నువ్వు లెక్చరర్ వి అయినంత మాత్రాన కట్నం యివ్వవా? అడక్కూడదా? ఏం? దేశంలో నువ్వొక్కదానివే అందగత్తెవా? ఈ దేశంలో నీలాంటి అందగత్తెలు కొన్ని వేలమంది వున్నారు. పెళ్ళికాని అమ్మాయిలే కొన్ని వేలున్నారు.
నీలా ఎమ్మెస్సీ, ఎమ్మే, ఎం.కాం.లు చదివి, బ్యాంకుల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో పనిచేసే నీలాంటి, ఆమాటకొస్తే నీకంటే అందమైన అమ్మాయిలు కొన్ని వేలమంది వున్నారు. వాళ్ళు కట్నం యివ్వరా? ఇవ్వటం లేదా? ఇవ్వనన్నా, యివ్వలేమన్నా జరిగేదేమిటో తెలుసా? వాళ్ళకీ జన్మలో పెళ్ళి కాదంతే!
నువ్వేదో సృష్టికి వ్యతిరేకంగా_అందరికంటే భిన్నంగా జన్మించావనుకోవద్దు. ఆఫ్టరాల్ నువ్వూ ఓ మామూలు ఆడదానివి. నలుగుర్లో ఒక్కత్తివి, కాదా?
నీకై నీవు గొప్పతనం ఆపాదించుకుని, అందరికంటే గొప్పదాన్ననీ, ప్రత్యేకత గలదాన్ననీ అనుకుని ప్రవర్తిస్తే జరిగేది యిదే! తెలుసుకో!"
క్షణం ఆగేడు సారధి.
పాలిపోయిన ముఖంతో పాలరాతి బొమ్మలా నుంచుండిపోయింది వారుణి. అతని ధోరణి, అతని ప్రవర్తనా, ఆ మాటతీరు ఆమెని నిస్తేజని చేశాయి.
అది చూసి తాను ఆమెని మానసికంగా డామినేట్ చేసినట్టుగా అనుకోసాగాడు సారధి.
"అవును. నేను నిన్ను ప్రేమించాను. ఆరాధించాను. నీకోసం తపించాను. నిజమే! కాదనను అనుకోను.
మనం పెళ్ళి చేసుకున్నాం. మన పెళ్ళయిపోయాక మనం సుఖంగా వుండాలి. కానీ యీ యింట్లో నువ్వూ నేనూ మాత్రమే లేం? ఈ సంఘంలో మన కుటుంబం మాత్రమే లేదు. మనం సంఘం కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటిస్తాం.
అలాగే మా కుటుంబం కోసం నా తల్లి తండ్రుల సోదరుల కోసం నువ్వు కొన్ని నియమాలని పాటించాలి. తప్పదు. నువ్వూ కొన్ని హద్దులకి లోబడి వుండాలి.
నువ్వు క్వీన్ ఎలిజిబెత్ వని నీమట్టుకు నువ్వు వూహించుకుని ప్రవర్తిస్తే ఎవరు సహిస్తారు? తన అధికారాన్ని, యింటిలో స్థానాన్ని సవాలు చేస్తే ఏ అత్త_ఏ భర్త సహిస్తారు. బాగా ఆలోచించుకో. నీవైపు నుంచి కాదు, మావైపు నుంచి ఆలోచించు.
వారుణీ !
నువ్వు కలల నుంచి దిగిరా! దిగిరావాలి! తప్పదు. వాస్తవాన్ని పరిశీలించి చూడు. మీ నాన్న డబ్బు యిస్తే నువ్వు వద్దని వాదించటం ఏమిటి? నాన్సెన్స్_వాడయినా నాకా డబ్బిచ్చి మళ్ళీ నీకు అలా రాస్తాడా? బుద్ధిలేదూ, ఏళ్ళొచ్చాయి ఎందుకూ, తగలెయ్యనా? రేపే జాబు రాసేస్తాను. తన తప్పు తెలిసిరానీ_అయినా ఆ మాత్రం ప్రపంచ జ్ఞానం వుండక్కర్లా?
నువ్వు విపరీత ప్రకృతివనీ_తాటిచెట్టుకి ఎదురుడేకే తత్త్వం నీదనీ నాకు బాగా తెలుసు. అందుకే_ యీ యిబ్బందిని ముందుగా వూహించే స్పష్టంగా చెప్పాను. ఈ విషయం మన మధ్యే వుండాలి. మీ అమ్మాయికి తెలీకూడదు అని ధ్వనించేట్టుగా చెప్పాను. అయితేనేం బుద్ధిలేని మనుషులకి ఎంత చెబితేనేం? ఏం చెబితేనేం? తెలివెక్కడుంటుంది?"
వర్షం! వర్షం!
అది బండ రాళ్ళలా అటూ యిటూ దిక్కు తెలీకుండా అన్ని దిశలనుంచీ వేగంగా కొడుతున్నది. ఏ చోటా తలదాచుకునే_ముఖం చాటు చేసుకునే అవకాశం లేదు. ఆశ్రయం లేదు. ఆ మనిషిలాగా నిలబడిపోయింది ఆమె_వారుణి...
అతని ప్రశ్నలకి, ఆరోపణలకి ఆమెకి ఎప్పటికప్పుడు జవాబులు స్ఫురించటం లేదు. మనస్సు నిశ్చైతన్యమై పోయింది. జడ పదార్ధంలాగా ఉండిపోయింది. ఏ కదిలికా లేని రాతిబొమ్మలా అతని వేపు చైతన్యంలేని చూపులతో కళ్ళప్పగించి నుంచుండి పోయింది.
అతనలా అంటూ వుంటే ఒక్కోమాటా ఒక్కో విషతిక్త బాణంలా గుండెల్లోకి దూసుకుపోతూ వుంటే ఆమె నిస్సహాయురాలిలా నిలిచిపోయింది.
