Previous Page Next Page 
వారుణి పేజి 65


    "ఆ వ్యక్తి ఎవరో నీకు తెలీదు." ఏదో చెప్పి విషయాన్ని దాటెయ్యాలని ఆఖరి యత్నంగా అలా చెప్పేడతను.
    "పేరు చెప్పినా_ఊరు చెప్పినా నాకు తెలీదా? నేను తెలుసుకోలేనా?" కోపంగా అడిగింది వారుణి. అతనింకా అబద్ధమే చెబుతోంటే ఆమెకి ఉక్రోషంగా వుంది. అతని వ్యక్తిత్వం అంతగా పలచబడిపోతూ వుంటే ఆమె సహించలేకపోతున్నది. ఇంతకి దిగజారతాడా అనుకుంటున్నది.
    "ఎవరో ఒకరు_ఎవరైతేనేం? నీకు చెప్పాలా? చెప్పి తీరాలా? ఏమిటీ నీ మొండితనం వరూ? అనవసరంగా లాగి లాగి ఎందుకు ఘోష పెడతావ్? తెగేదాకా లాగటం దేనికీ మంచిది కాదు. ఇప్పుడా విషయం వదిలెయ్యమన్నానా? వదిలెయ్ అంతే!" ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు సారధి.
    ఆమె యిక తననితాను కంట్రోల్ చేసుకోలేక పోయింది. అతనంటే క్షణక్షణానికీ పెరుగుతోన్న అయిష్టత, అతనిపై నిమిష నిమిషానికీ పెరుగుతున్న కోపం నిగ్రహించుకోలేక పోయింది.
    "రధీ! ఎందుకీ దాగుడు మూతలు? నువ్వు మా నాన్నని డబ్బెందు కడిగావ్? అదీ అప్పని చెప్పి తెచ్చుకున్నావా? అప్పుడు కట్నంగా ఏమీ తేలేదని యిప్పుడిలా ఆయన్నించి వసూలు చేస్తావా?
    సిగ్గులేదూ? కొంచెమయినా అవమానం అనిపించలేదా? ఏ ముఖం పెట్టుకుని డబ్బడిగావ్? మీ తల్లిదండ్రుల ముందు మిధ్యా గౌరవం నిలుపుకోటానికని నా తండ్రి ముందు చేయి చాస్తావా?
    డోంట్ యూ ఫీల్ షేం? ఛ! ఛ! నువ్వింతకి దిగజారిపోతావనీ_నువ్వు దేనికయినా సిద్ధపడతావనీ_ దాన్ని సమర్ధించుకునేందుకు ఎంతయినా చేస్తావనీ_నేనెన్నడూ అనుకోలేదు సారధీ... రధీ...నువ్వు నన్ను చాలా దగా చేశావ్"   
    ముందుగా అంత తీవ్రంగా మాటాడిన వారుణి, తను బాగా మోసపోయానని రుజువయ్యాక బేలగా అయిపోయింది. ఆమె కంఠంలో బాధ సుళ్ళు తిరిగింది. గుండెల్లోని దావాగ్ని బాధగా మారిపోయింది.
    ఆ మాటలకి నివ్వెరపోయాడు సారధి.
    "ఆ వెధవ జాబు రాశాడా ?"
    చప్పున అన్నాక, నోరు జారేనని గ్రహించాడు. వారుణి అలా నిలదీసి ప్రశ్నిస్తూ వుంటే అతనికి మతిపోయినట్టయింది. మామగారిపై ఎక్కడలేని కోపం వచ్చింది.
    అతనలా అనగానే "రధీ" అని చప్పున అతని చొక్కా పట్టుకుందామె.
    "డోంటాక్ రబ్బిష్! నువ్వు మా నాన్నని ఎలా పడితే అలా మాటాడితే నే సహించను. వెధవపని చేసింది నువ్వు. ఆయన్ని వెధవ అని తిడతావా? సిగ్గులేదూ?" కోపంగా అంది వారుణి.
    ఆమె మాటలకి వళ్ళు మండిందతనికి. విదిలించాడు. "ఏమిటి నీ పొగరు? ఏం చూసుకుని ఆ పొగరు? నోటికొచ్చిట్టల్లా వాగుతున్నావ్? షటప్_ఇంకోమాట దురుసుగా అన్నావంటే వీపు పగులుతుంది. ఇప్పటికే నేనెంతో సహనంతో నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను" ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు సారధి.
    సారధి అలా ఆజ్ఞాపించినట్టు అనగానే వారుణి ముఖం పాలిపోయింది.
    అతనలా అనేసరికి ఆమె మనస్సు స్తబ్ధమైపోయింది. నోట మాట రాలేదు. ఒక పిడుగుపాటుని చూసి, దాని ప్రభావానికి లోనైనట్టు, ఒక భూప్రకంపనంలో చిక్కుకున్నట్టు, ఒక సుడిగాలి తనని ఎత్తుకెళుతున్నట్టుగా అయిపోయింది. ఆమె స్థంభీ భూతురాలైనట్టుగా అయిపోయింది.
    "అవును! మీ నాన్ననే డబ్బడిగాను. అదీ అప్పుగానే అడిగాను, తప్పా?
    ఇప్పుడు చెబుతున్నా విను. ఆ డబ్బు నేనతనికి తిరిగి యివ్వను. తీసుకునే సమయంలో ఆ డబ్బు నెలనెలగా కొంత కొంత జమ చేసి మొత్తం కాగానే ఆయనకి యిచ్చెయ్యాలనే అనుకున్నాను. కానీ యిప్పుడిలా నీవు నిలదీసి ప్రశ్నించాక, యింత గొడవ, ఘర్షణ జరిగాక ఆ డబ్బు నేనెందుకు తిరిగివ్వాలి! యివ్వను, అంతే!
    అది నాకు కట్నం అనుకుంటాను. ఏం? నువ్వు ఎమ్మెస్సీ చదివితే కట్నం యివ్వక్కర్లేదా? అడగక్కర్లేదా? మరొకరో మరొకరో అయితే యిలాగే కట్నం లేకుండా నిన్ను చేసుకునేవారా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS