"నువ్వు నేరమే చెయ్యలేదా?" నిలదీసినట్టుగా అడిగింది వారుణి. ఆమె అతన్నే గమనిస్తోంది.
"ఛ!" విదిలించినట్టుగా అన్నాడతను.
"రధీ! డబ్బెక్కడ తెచ్చావ్?" కోర్టులో ముద్దాయిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తోన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా అడిగింది.
"ఏం? అప్పుగా తెచ్చాను. నేనేం దొంగతనం చెయ్యలేదు. ముష్టెత్తలేదు. ఎవర్నీ మోసం చేయలేదు" స్థిరంగా అన్నాడు సారధి.
"హుఁ అవి చేసినా కొంత గౌరవంగా వుండేది. అంతకంటే హీనమైన పని చేశావు. ఆ పని చేశావనుకోటానికి నాకు సిగ్గుగా వుంది." వారుణి మాటలు పూర్తవలేదు.
అంతలోనే ఆమె చెంప చెళ్ళుమంది.
అతని దుడుకుతనానికి నివ్వెరపోయింది. నిర్ఘాంతపోయింది వారుణి.
తనపై చేయి చేసుకుంటాడని ఆమె ఎన్నడూ ఊహించనైనా ఊహించలేదు. ఆ సంఘటనతో ఆమె మాన్పడిపోయింది.
ఎవరో చదువూ సంస్కారం లేని మూర్ఖులు భార్యల్ని కొడతారనుకుంది, తిడతారనుకున్నది, హీనంగా చూస్తారని భావించింది. అనుమానించి అవమానిస్తారనుకుంది.
కానీ తనతో సమానంగా చదువుకుని పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ పుచ్చుకుని, తనతో సరిసమానంగా లెక్చరర్ వుద్యోగం చేస్తోన్న, జీవితంలో సమభాగిని అయిన తనలాంటి "స్త్రీ"ని కూడా "సారధి" లాంటి "మనిషి" కొడతాడని, కొట్టగలడని ఆమె ఊహించలేక పోయింది.
ఆమె అలా అవాక్కైపోగానే అతన్లో ఆవేశం చప్పున చల్లారిపోయింది. అతన్లో పశ్చాత్తాపం కలిగింది. "సారీ! నన్ను అనవసరంగా మాటలతో రెచ్చగొట్టావు వరూ!" పశ్చాత్తపడి క్షోభ పడుతోన్న మనస్సుతో అన్నాడు సారధి. ఆమెనలా చూస్తోంటే అతనికి గుండెల్లో శూలం దిగుతున్నట్టుగా అనిపించింది.
కానీ వారుణి అతన్ని క్షమించలేక, నిలువునా దహించినట్టుగా చూసింది.
"వరూ! నేనూ మామూలు మనిషినే! నువ్వూ మామూలు మనిషివే! మనకి లేనిపోని గొప్పతనాలు అంటగట్టుకుని ఇతరలని హీనంగా చూసి అవమానించదు. నేనూ ఒక మామూలు మగాడిని, అలాగే ప్రవర్తించాను.
వరూ! అలాంటి స్థితిలో, పరిస్థితుల్లో, ఆ సమయంలో సాక్షాత్తూ భగవంతుడైనా తన భార్యపై చేయి చేసుకుంటాడు" అన్నాడు సారధి.
తన చర్యని సమర్థించుకుంటున్న అతన్ని మరీ అసహ్యంగా చూసిందామె.
తప్పు చేయటం వేరు. కానీ దాన్ని సమర్ధించుకుని మరీ తప్పు చేయటం యింకా ఘోరం. అందుకని అతన్నామె క్షమించలేకపోయింది. క్షమించలేక పోతూంది.
తనన్న మాటలకే కోపగించి కొట్టాడతను. అతనలా చేస్తే తను బాధపడింది. తనూ తిరిగి కొడితే! ఛ! ఏం మనుషులు. అతన్నెంతగా ఆరాధించిందో ఆ క్షణానే అతన్నంతగా అసహ్యించుకుందామె.
"నేను సినిమాకి వెళుతున్నా"
అతనక్కడ వుండలేకపోతున్నాడు. ఆమెతో రాజీపడలేక పోతున్నాడు. తన చర్యని సమర్థించుకోలేక పోతున్నాడు. అందుకే కొన్ని గంటలయినా ఆమె పరిసరాల నుంచి తప్పించుకోవాలని, సినిమాకి వెళతానన్నాడు.
"రధీ! నిజం చెప్పు? డబ్బెక్కడి నుంచి తెచ్చావ్?" ప్రాణాలన్నీ చూపులోనే కేంద్రీకరించి ఆ చూపులన్నీ సూటిగా చేసి అతన్ని చూస్తూ ప్రశ్నించిందామె.
జవాబు చెప్పాలా అన్నట్టుగా చూశాడతను.
"కూలిపోయే సంసారాలు అబద్ధాలతో నిలవ్వు. నిజం చెప్పు." అతన్ని అష్టదిగ్భంధనం చేసి ప్రశ్నిస్తున్నట్టుగా నిల్దీసి అడిగింది వారుణి. ఆమె ముఖం గంభీరంగా అప్రసన్నంగా వుంది.
"వరూ! ఎందుకిలా ప్రతిదీ యాగీ చేస్తావ్?" చిరాగ్గా అన్నాడతను. ఆ క్షణంలో ఎలాగో ఆ విషయాన్ని మర్చిపోయేలా చేయాలని చూస్తున్నాడతను.
"వాదనలొద్దు. డబ్బెక్కడ నుంచి తెచ్చావో చెప్పు!" తప్పు చేసిన కొడుకుని దండించే తల్లిలా అడిగిందామె.
