నేను చాలా చాకచక్యంగా వాళ్ళిద్దర్నీ నావైపు త్రిప్పుకున్న వైనం సురేంద్రకు తెలీదు. అతను ఊహించలేక పోయాడు.
ఇహ కేసు నావైపు పూర్తిగా తిరిగి పోయింది. మా లాయర్ గారు రెట్టించిన ఉత్సాహంతో ఆర్గ్యుమెంట్స్ లో వీర విహారం చేశారు.
అవతలి లాయరు నీళ్ళు కారిపోతున్నాడు.
జడ్జిమెంట్ వచ్చింది.
సురేంద్రకు ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష పడింది.
25
మళ్ళీ కొన్నాళ్ళు వంటరితనం.
ఈ దశలో నాకు మదన్ చేరువుగా వచ్చాడు.
తరుచు యింటి కొచ్చేవాడు. కార్లో అలా.... వూరి బయటికో, దగ్గర్లో వున్న కొత్త కొత్త ప్రదేశాలు చూడటానికి తీసుకెళ్ళేవాడు. పెద్ద పెద్ద హోటల్స్ లో లంచ్ కో, డిన్నర్ కో వెళ్ళేవాళ్ళం.
అతన్తోటి కంపెనీ నాకు సంతోషంగానే వుండేది.
అసలీ వొంటరితనం నేనెందుకనుభవించాలి. నాక్కావల్సింది. నేనెందుకు పొందకూడదు అన్న కసితో ఒక్కోసారి రక్తం మరిగిపోయినట్లయేది.
ఎక్కువగా వివరించటమెందుకు? పరస్పరాకర్షణలున్న ఓ స్త్రీ, పురుషుడు - వీరి మధ్య అల్లుకునే సంభాషణలే మా మధ్య చోటు చేసుకునేవి. నా చేతిని తన చేతుల్లోకి తీసుకోవటంలో, నన్ను దగ్గరకు తీసుకోవటంలో అతను తీసుకునే చొరవను నేనభ్యంతర పెట్టేదాన్ని కాను.
కాని పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి సీరియస్ గా ఆలోచించక తప్పలేదు.
అంగీకారం, అనంగీకారం - యీ సంఘర్షణలో చాలా నలిగిపోయాను.
ఒక దశలో మెదడు ఆలోచించలేని స్థితి కొచ్చేసరికి అంగీకారం వైపే తలవొంచాను.
* * *
మనిషి - మనిషి దూరదూరంగా వుండి కొన్ని సమయాలలో మాత్రం కలుసుకుంటూన్నప్పుడు, యిరవై నాలుగు గంటలూ ఒకేచోటు క్రింద నివసించవల్సి వచ్చినప్పుడూ చాలా వ్యత్యాసముంటుంది. భరించక తప్పదు.
కాని నా కాశ్చర్యం కలిగించిన విషయమేమిటంటే మదన్ సాహిత్యంలో, మాటల్లో వున్న సెంటిమెంట్ అతని జీవిత విధానంలో లేకపోవటం.
స్త్రీ పట్ల చాలా సామాన్యమైన అభిప్రాయాలు కలిగి వుండి బయటి కొచ్చినప్పుడు ఆమె గురించి గొప్పగా మాట్లాడతాడు.
మా యిద్దరి మధ్యా దాంపత్యం అద్భుతంగా వుంటుందని అనుకోలేదుగాని, ఏ కళాత్మక విలువలు ఆశించానో, అవి కానరాక పోవడం నిస్పృహ కలిగించింది.
స్వల్పమైనవి, కొంచెం పెద్దవి అయిన సంఘటనల్లో కూడా అతని ప్రవర్తన యిబ్బంది కలిగిస్తూ వుండేది.
ఆరాధించిన వ్యక్తికి దగ్గరగా రావటం తప్పేమిటి? ఆ మాటే ఆ రోజతనకి చెప్పేశాను?
26
ఆ క్షణం....
అతను షాకై ఉంటాడు.
ఏదో అనబోతూ ఉంటే మళ్ళీ నేనే అన్నాను.
"అవును. ఓ సామాన్యుడిలో ఉండే సంస్కారం కూడా రచయితల్లో లేదు. అహంకారం, కుత్సితత్వం, నీచత్వం, అల్పత్వం. ఇవన్నీ మీలో పుష్కలంగా ఉన్నాయి. మీకంటే సామాన్యులు ఎంతో ఉన్నతులు. కాకపోతే మీ కలాలకు కొంతశక్తి ఉంది. దాంతో పాఠకులు మెస్మరైజ్ చేస్తారు.
మీ చేతలు వేరు. మెదళ్ళు వేరు. మీరు చెప్పే సిద్ధాంతాలకు జీవితపు పోకడలకూ సంబంధం లేదు. అసూయలూ, సంకుచితత్వం, వ్యసనాలూ, అవినీతి కార్యకలాపాలూ.... వీటితో మీరు మగ్గిపోతున్నారు.
"సతీ! నువ్వు రెచ్చిపోతున్నావు. రచయిత వ్యక్తిగత జీవితానికి, అతని సాహిత్యానికి సంబంధం ఉండనవసరం లేదు."
"కొంతవరకూ అవసరం లేదు. ఒప్పుకుంటాను. కాని అతను రాసే సాహిత్యంతో బాటు అతని మానసిక స్థాయి ఎదిగి ఉండాలి. మానసికంగా అధమపుటాలోచన్లతో ఉండి, తనవి కాని తనకు నమ్మకంలేని, తనకు గౌరవం లేని భావాలు పాఠకుల మీద రుద్దుతూ.... ఇది అమానుషం"
"మనిషిలోనే నిజాయితీ చచ్చిపోయింది. ఈ ప్రపంచమంతా లౌకికమైన కుయుక్తులతోనే నడుస్తోంది. రచయిత కూడా ఈ ప్రలోభం నుంచి తప్పించుకోలేడు. అతనికి సక్సెస్ కావాలి. అంతే. అదే. అదే. అతని అంతిమ లక్ష్యం."
"మదన్! ఓనాడు శరత్ సాహిత్యమనీ, సావిత్రి అనీ, కిరణ్మయి అనీ, కమల అనీ, తర్వాత ప్రియబాంధవి అనీ ఎన్నో కబుర్లు చెప్పావు. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది?"
అవున్నేనే అన్నాడు. అతని గొంతులో కాఠిన్యం ధ్వనిస్తోంది. ముఖం కూడా రంగులు మారినట్లు ఏదోలా కనిపించింది.
"నిజంగా ఒక నాడమాయకంగానే ఉండేవాణ్ణి. నిర్మలంగానే ఉండేవాణ్ణి. చుట్టూ ఉన్న కుళ్ళు ప్రపంచంలో ఇమడలేక, ఎవర్ని ఆహ్వానిస్తే ఏం జరుగుతుందోనని భయపడి, ఒంటరిగానే ఉండిపోయి, ఆ ఒంటరితనంలోనే సంతోషాన్ని ఆస్వాదించటానికి ప్రయత్నించేవాడిని. కాని ఎన్నాళ్ళు? నువ్వు పరిచయమయావు. నాలో కొత్త ఆనందం పరవళ్ళు త్రొక్కింది. కాని ఈ పోటీవల్ల, చుట్టూ క్రమ్ముకొస్తూన్న వక్రగతుల వల్ల నాలో మార్పులు చోటు చేసుకున్నాయి. నాలో ఇంకోమనిషి, అనేక రకాల మనుషులుండవచ్చు.
ఆ సత్యం నాకూ ఇన్నాళ్లూ తెలీదు. అది సహజమైన వికటత్వం కావచ్చు. ప్రేమ అనేదానికి మనం ఇవ్వగలిగే నిర్వచనమలా వుంది. మన కర్థమైన భాషలో, మన పరిధిలో నిన్ను చాలా ప్రేమించాను. ఇప్పటికి ప్రేమిస్తున్నాను. నీతోడు నాక్కావాలి. కాని జీవితం వేరు, ప్రేమ వేరు. నీకోసం నన్ను మారమంటే మారను. ఎందుకంటే మారలేను గనుక...."
