"నిన్ను మార్చాలని ప్రయత్నించటం లేదు మదన్. ఒక మనిషి ఇంకో మనిషిని మార్చలేడనీ, అసలు మనిషెప్పటికి మారడని నాకు తెలుసు. కాని నాకు చాలా భావాలున్నాయి. వాటిని కూర్చి ఓ మహత్తర నవలా కావ్యంగా మలుస్తాను."
"సతీ! నూటికి ఏ ఇద్దరో తప్ప లేని సహృదయుల కోసం ఎందుకారాటపడతావు? చదివి ఊరుకుంటారు. లేకపోతే వాళ్ళ అతి తెలివితో అందులో కూడా తప్పులు పట్టటానికి ప్రయత్నిస్తారు. చివరకు నిన్ను నువ్వు కోల్పోతావు."
"పోయినా ఫర్వాలేదు. నా ప్రయత్నం మానను."
"ఒక నిష్ఫల ప్రయోజనానికి నీ శ్రమని వృధా చేసుకుంటున్నావు."
"బాధపడను."
"నీ ఇష్టం."
27
సురేంద్ర ఆపిల్ హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా వీగిపోయి క్రింద కోర్టిచ్చిన శిక్షనే ఖాయపర్చింది. హైకోర్టు జడ్జి అయితే "ఇతను చేసిన ఘాతకం సామాన్యమైంది కాదు. అసలితడికిచ్చిన శిక్ష సరిపోదు. ఇంకా ఎక్కువ కాలం జైలుననుభవించటం సమంజసం. కాని క్రింద కోర్టు ఇచ్చిన శిక్షను పెంచటమిష్టం లేక అదే పరిమితిని విధిస్తున్నాను జైల్లో కూర్చుని తిండిపోతురాయుళ్ళలా తినటం కాదు. అక్కడతనికి తాను చేసిన నేరం అనుక్షణం గుర్తొచ్చేలాగ ఏదైనా చాకిరీ అప్పగించాలి. అని తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు కూడా అదే పునరుద్ఘాటించింది.
ఒకరోజు జైలు కెళ్ళాను.
సురేంద్ర జైలు దుస్తులు వేసుకుని, వంటశాలలో వంట చేస్తున్నాడు. నేవెళ్ళేసరికి పెద్ద పొయ్యిమీద బానలో కాగుతున్న పులుసు పొడవాటి గరిటపెట్టి త్రిప్పుతున్నాడు.
"సురేంద్ర ఎలా ఉన్నావు" అనడిగాను.
నా గొంతు విని ఉలిక్కిపడ్డాడు కాబోలు తలెత్తి చూశాడు. అతని కళ్ళు నా వంక ఉరిమి చూస్తున్నాయి.
"ఈ దశలో నన్ను చూసి నీ విజయాట్టహాసం ప్రదర్శిద్దామని వచ్చావా?" అన్నాడు.
"సురేంద్ర! జైల్లో పప్పుకూ, పులుసుకీ తేడా తెలీదులే. అలాంటిదేదో వండటమొచ్చిందా? ఇంకా ట్రెయినింగులోనే ఉన్నావా?"
"ట్రెయినింగ్ ఎప్పుడో అయిపోయిందే రాక్షసి. రా. నిన్ను కూడా ముక్కలుగా తరిగేసి ఈ పులుసులో పడేసి వండేస్తాను" అంటూ తెడ్డు బానలో కారుతూన్న పదార్థంలో పెట్టి గిరగిర త్రిప్పుతున్నాడు.
అతని మాటలకు నేను కోపం తెచ్చుకోలేదు. "సురేంద్ర! మనిషి ఎటువంటి పరిస్థితుల్లోనూ మారడని తెలుసు. కాని.... అహంకారం వల్ల సాధించేదేమీ లేదు. ఈ ఏడేళ్ళూ వంటవాడిగా జైల్లో గడుపుతూన్న కాలంలో నీ అహాన్ని చంపేసుకుని అంతర్ముఖ మవటానికి ప్రయత్నించు సురేంద్రా. ఏడేళ్ళ తర్వాత బయటికొచ్చాక 'మంచి'గా గడపటానికింకా ఆయుర్దాయం మిగిలి ఉంటుంది. ఎందుకంటే జీవితం చాలా సుదీర్ఘమైనది. ఈ హితోపదేశం నీకు చెయ్యటానికే వచ్చాను" అంటూ వెనుదిరిగాను.
"జైల్లోంచి బయటకు రానియ్. నీ పని చెబుతాను" కసిగా ఉన్న అతని గొంతు కత్తిలా గుచ్చుకున్నట్లయి, మళ్ళీ అటుకేసి తిరిగాను.
"సురేంద్రా! ఈ ఏడు సంవత్సరాలూ ఇలాంటి ఆలోచన్లతోనే వెళ్ళబుచ్చితే ఈ జీవితాన్ని వృధా చేసుకున్నట్లే లెక్క. ఏం చేస్తావు? మళ్ళీ రేప్ చేస్తావా? అప్పటికి, అంటే ఏడు సంవత్సరాల నా శరీరం ఎన్నో అనుభవాలు పొంది ఉంటుంది. కొంత యవ్వనం కూడా దిగజారి వుంటుంది. రేప్ చేసి మరో ఏడేళ్ళో, ఈసారి పదేళ్ళో జైల్లో వంటవాడిగానో, గిన్నెలు తోమేవాడిగానో గడపటం తప్ప నువ్వు సాధించేదేమీ ఉండదు" అనేసి గబగబ అక్కణ్ణుంచి వచ్చేశాను.
* * *
ఆ రాత్రి చాలా కల్లోలంగా గడిపాను. సురేంద్ర మాటల గురించి కాదు. అదెప్పుడో మరిచిపోయాను. శరీరం అనారోగ్యానికి గురి కావడమనే దానికి నేను విలువనిస్తాను గాని చెడిపోవట మనేదాన్ని గురించి విలువ.... సారీ.... అలాంటి పదాలెందుకు లెండి ఆలోచించే స్థితినెప్పుడో దాటిపోయాను. అంతకన్నా నిర్వర్తించవలసిన బాధ్యతలెన్నో ఉన్నాయి. పోనీ! ఇంకోరకంగా చెప్పుకుందాం. లోకం దృష్టిలో చెడిపోయిన శరీరాన్ని పవిత్రమైన, పదునైన మనసు శుభ్రంచేసి కొత్త తీరుతెన్నులతో ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ పవిత్రమైన శరీరంలో పవిత్రమైన మనసేమిటంటారా? మన హిందూ సిద్ధాంతమంతా పునర్జన్మ ప్రాతిపదికల మీద ఆధారపడి ఉంది. ఒక జన్మలో ఎన్నో పాపాలు చేసిన మనిషి మరో జన్మలో 'మంచి'వాడై పుట్టి కూడా క్రితం జన్మలో చేసిన పాపాలను కర్మఫలంగా కష్టాలనుభవిస్తూ ఉంటాడు. అంటే ఓ జన్మలో 'చెడు'గా కరాళనృత్యం చేసిన ఆత్మ మరుజన్మలో మంచిగా, అమాయకంగా వాపోతూంటుంది. అంటే ఓ శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని ధరించేటప్పుడు ఆత్మ స్వభావం కూడా మారుతూ ఉంటుందన్నమాట. ఇదెలా సాధ్యమో నాకర్థం కాదు. మనిషి కొన్ని వాసనలతో పుడతాడు. అవి ఆత్మస్వభావాన్ని కూడా మార్చి వేస్తూ ఉంటాయా?
మదన్ మోహన్ మాటలు వెంటబడి తరుముతున్నాయి.
మంచీ, చెడూ అనేవి నిర్వచనం చెప్పలేని కాన్సెప్ట్ లు అయితే కావచ్చుగాని ఉత్తమం, అధమం అనే వాటికి రూపురేఖలున్నాయి.
నాలో ఇన్ని అందమైన భావాలు చెలరేగుతున్నాయి. వాటికో నిర్దుష్టమైన రూపమివ్వటానికి ఎందుకు తాత్సారం చేస్తున్నాను? ఈ తాత్సారమనేది మనిషికి ఎన్నో అవకాశాలు పోగొట్టుకునేటట్లు చేస్తుంది.
రాయాలి.
అసలు.... సమస్యను అందరూ అనుభవిస్తున్నారు గాని ఆ సమస్యను జీర్ణించుకోవటం ఎవరికి తెలియకపాయె. సమస్యలో ఇరుక్కుని బాధపడతాం కాని ఆ సమస్యని అర్థం చేసుకోవటం చేతకావటం లేదు. ఎంతసేపూ ఎస్కేపిజం, ఎస్కేపిజం.... ఇటువైపే పరుగులు తీస్తున్నారు.


