Previous Page Next Page 
నేను పేజి 64


    "చెరిచాడా? అనుభవించాడా?"


    "చెరిచాడు"


    "ఒక ఆడదాన్ని మగాడు చెరుస్తూన్నప్పుడు తనకిష్టం లేకపోతే ప్రతిఘటిస్తుంది. కదా. అప్పుడు నీవంటి మీద బలవంతంగా అనుభవించిన చిహ్నాలు, గాట్లు, గీట్లు, బట్టలు చిరగటం, మర్మాయవం దగ్గర అతి బలవంతంగా నలిగిన గుర్తులు.... ఇలాంటివి ఉండాలే"


    "నాకు మత్తుమందివ్వటం వల్ల ప్రతిఘటించే స్థితిలో లేను."


    "మత్తు మందిచ్చినప్పుడు అతనే రేప్ చేస్తున్నాడని ఎలా తెలుసు?"


    "అతను కూల్ డ్రింక్ లో ఇచ్చిన మందువల్ల శారీరకంగా నిస్సత్తువ ఆవహించి కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ మానసికంగా ఏం జరుగుతున్నదో గ్రహించగలిగే స్థితిలో ఉన్నాను."


    "అంటే కళ్ళు తెరిచి చూస్తున్నావా?"


    "అవును"


    "కళ్ళు తెరిచి అతన్నిన్ను అనుభవిస్తోంటే ఎంజాయ్ చేస్తున్నావు."


    "ఎంజాయ్ చెయ్యటం లేదు. శారీరకంగా నిస్సహాయంగా ఉండి, ప్రతిఘటించలేని స్థితిలో ఉన్నాను."


    "రేప్ అని మీరంటున్నప్పుడు తర్వాత వైద్యపరీక్షల కెళ్ళావా?"       


    "లేదు. కారణమేమిటంటే...."


    "నిన్ను కారణమడగలేదు. వెళ్ళావా? లేదా?"        


    "లేదు"


    "పోలీసులకి కంప్లెయింటిచ్చావా?"


    "వెంటనే ఇవ్వలేదు. తర్వాత....


    "తర్వాత విషయమలా ఉంచు. వెంటనే ఇచ్చావా లేదా?"


    "నాకు తెలివొచ్చేసరికి నా భర్త రావటం జరిగింది. తెలుసుకుని ఆత్మహత్య చేసుకోవటం...."     


    "అతనాత్మహత్య చేసుకోటానికి కారణం నువ్వు రేప్ చెయ్యబడ్డావన్న కట్టు కథలు నమ్మికాదు. నిన్నెంతో అమాయకంగా ప్రేమించిన అతను నీకెవరెవరితో ఉన్న అక్రమ సంబంధాలు తెలుసుకుని ఆ బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు."


    "అలా అని చెప్పి మీకు ఉత్తరం రాశాడా?"  


    "సురేంద్ర నీమీద అత్యాచారం చేయబట్టే తానాత్మహత్య చేసుకుంటున్నానని నీకు ఉత్తరం రాసి పెట్టాడా?"    


    కోర్టు దృశ్యాలు పెంచటమిష్టంలేక నేను కొంతవరకే రాసి ఊరుకుంటున్నాను. ఇంకా ఎన్నో అసభ్యకరమైన ప్రశ్నలు రేప్ రేప్ అంటున్నావు కదా అంటే.... ఎక్కడ ముట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు. ఏమేం చేశాడు....? నేనేం కలవరపడలేదు. అలాంటి ప్రశ్నలు వేస్తారని తెలియని తెలివితక్కువదాన్ని కాను. తెలిసే బోనెక్కాను. నాకు కోపమూ రావటం లేదు. మన న్యాయవ్యవస్థ ఏ విధంగా నడుస్తున్నదో, ఒక మనిషి నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు, ఆ సమస్యకు సంబంధించిన అధికార్లుగాని, వృత్తిపరంగా ఉన్నవారు కాని వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుంటారో తెలుసు. కష్టాల్లో, బాధల్లో ఉన్నవారి జీవితాలతో ఆడుకోవటం మనిషి ప్రాథమిక ధర్మమైపోయింది.


    అంతవరకూ సురేంద్రదే పైచెయ్యి అన్నట్లు కనిపించింది. నేను సకాలంలో పోలీస్ రిపోర్టివ్వలేదు. డాక్టర్లచేత ఎగ్జామిన్ చేయించుకో లేదు. సాక్ష్యాలు లేవు. కోర్టులో కేసెందుకు పెట్టినట్టు?     


    నా తరపున సాక్షులెవరూ లేరు. అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేయటానికి ఆ ఇంట్లో పనిచేసే రాజారావు అలివేణి బోనెక్కారు.


    అక్కడే కథ మలుపు తిరిగింది.


    ఒకరి తర్వాత ఒకరు.... వాళ్ళ ప్లీడరూ చీప్ ఎగ్జామినేషన్ లోనే వినేవారి కాశ్చర్యం కలిగేటట్లు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.


    "సురేంద్ర ఎలాంటివాడు?"


    "ఆయనగారి కన్నీ దుర్వ్యసనాలూ ఉన్నాయండీ."


    "తాగుబోతు. అమ్మాయిలంటే పిచ్చి. కొత్త పిట్ట కంటబడిందంటే లొంగతీసుకోకపోతే నిద్రపట్టదు. ఆయనగారు ఎంతమంది ఆడపిల్లల్నో పాడుచెయ్యటం, వాళ్ళ జీవితాలని నాశనం చెయ్యటం మాకు తెలుసు."    


    వాళ్ళ ప్లీడరు షాకయి ఎలాగైనా అంతకుముందు బోధించింది క్రక్కించటానికి తంటాలు పడుతున్నాడు.   


    "సతిశ్రీని ఆయన చెల్లెలు భావంతో చూసుకునేవాడు కదూ?"


    "కాదండీ. ఆమెగారి వల్లు ఆయనకు మోజయిందండి. అసలా ఉద్దేశంతోనే గెస్ట్ హౌస్  ఉండటానికిచ్చాడు. 'ఎట్లాగైనా దాన్ని నా సొంతం చేసుకోవాలిరా' అని తాగిన మైకంలో నాతో ఎన్నోసార్లన్నారు. ఒకసారి ఆమెగారి ఒంటి మీద చెయ్యి వెయ్యబోయి చెంపదెబ్బ తినటం కళ్ళారా చూశానండీ."     


    అవతల ప్లీడరు ఏం చెయ్యాలో తెలీక తికమక పడుతున్నాడు.    


    "తనని రేప్ చేశాడని సతిశ్రీ ఫిర్యాదు చేసిన రోజు సురేంద్రగారు ఊళ్ళోలేరు కదూ?"


    "ఉన్నారండీ.... అంతేకాదు.... ఆ రోజు పథకం చాలా పకడ్బందీగా అమలు చేసుకున్నారు. సుకుమార్ గార్ని ఆఫీస్ నుంచి అట్నుంచి అటే క్యాంప్ వెళ్ళేటట్లు ఏర్పాటు చేశాడు. అవేవో టాబ్లెట్స్ తెప్పించి కూల్ డ్రింక్ లో కలుపుతూండగా కళ్ళారా చూశాను...."


    చీప్, క్రాస్ లలో వాళ్ళు విజృంభించి చెప్పిన విషయాలు.


    అంతా పథకం ప్రకారం జరిగింది.


    నన్ను మాయమాటలతో నమ్మించి ఇంటికి రప్పించాడు. మత్తుబిళ్ళలు కూల్ డ్రింక్ లో కలిపి త్రాగించాడు. తమ ఇద్దర్నీ ఇళ్ళకి త్వరగా వెళ్ళిపొమ్మని హెచ్చరించాడు.


    అయినా ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో వెనక్కి మళ్ళి రహస్యంగా జరిగింది చూశాము.     


    టాబ్లెట్స్ వల్ల ప్రతిఘటించలేని స్థితిలో ఉన్న సతిశ్రీని రేప్ చేశాడు.


    మేము వారిద్దామనుకున్నాం. సురేంద్ర దుర్మార్గుడు. మమ్మల్ని చంపేస్తాడన్న భయంతో ఏం చెయ్యాలో తెలీక ఊరుకుండి పోయాం.     


    సుకుమార్ ఆత్మహత్యకు సురేంద్ర కారణం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS