Next Page 
రాజ హంస పేజి 1

 

                               రాజ హంస

                                           కొమ్మూరి వేణు గోపాలరావు.

 

                           

 

    రాజహంస!
    ఈ పేరు ఆమె తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో గాని, అన్ని విధాల ఆమెకు సరిగ్గా సరిపోయింది. తెల్లగా, మెరిసే శారీర చ్చాయ, పెద్ద పెద్ద నల్లటి కళ్ళూ, నాజూకయిన అవయవాల పొందికా, వయ్యారమయిన నడుము, నడిచేటప్పుడు చకచక లాడుతూ కదలాడే వాలుజడా, చూపరులు ముగ్దులయేలా పదేపదే నవ్వినప్పుదల్లా మెరిసే పలువరుసా, నిగనిగలాడే నిండయిన చెంపలూ.....
    ఆమె కాలేజికే ఓ అలంకారం.
    ఇంటర్మీడియేట్ చదువుతున్నంత కాలం ఆమె ఇతరులు తనవంక చూపులనూ, ఆ చూపుల్లోని కంక్షనూ తనతో మాట్లాడాలని వాళ్ళు పడే తపత్రయమూ, కొంత మంది కుర్రకారు తనను చూసి చేసే చిలిపి చేష్టలు - ఇవన్నీ చూసి లజ్జితురలవుతుండేది. కాలేజి లేక్చరర్సు సైతం ఆమెను చూసి ఎలాగయినా మాటలు కల్పించుకోవాలని ఉత్సాహం ప్రదర్శిస్తూ వుండేవారు.
    అప్పట్లో ఆమె సిగ్గరి . తానూ చాలా అందగత్తెనని తెలుసుకొని దాని తాలూకు అహంభావ మేమాత్రం వుండేది కాదు. తోటి ఆడపిల్లలకు తానంటే అసూయ వుండేదని తెలుసు కాని, అందుకు గర్వపడేది కాదు. బాధపడేది మొగపిల్లలు తనవంక కొండంత కోరికతో చూసినప్పుడూ మీద మీదకు వోచ్చినప్పుడూ భయపడుతూ తొలగిపోయేది. ఆకతాయి కుర్రాళ్ళ దగ్గర్నుంచి తనకు ప్రేమలేఖలు వొచ్చినప్పుడు హడలిపోయి గజగజ వణికి పోయేది. సుదీర్ఘంగా ఆమె అందచందాలనీ, అవయవాల వంపుసొంపుల్ని వర్ణిస్తూ నిండివున్న ఆ ఉత్తరాలు ఒకటి రెండు పేరాలు చదవగానే వొళ్ళు జలదరించి తర్వాత చదవలేక వాటిని చింపి పారేసేది. అంతేగాక తండ్రిని చూస్తే తాను తప్పు చేసినట్టు ఎక్కడ భావించి చంపెస్తాడో నని వ్యాకులపాటు పడేది.
    ఇంటర్మిడియేట్ ప్యాసయి బి.ఏ  లోకి వచ్చాక ఆమెతనని గురించి తెలుసుకోసాగింది.
    అలా మొదటగా తెలియచెప్పింది కూడా ఆమె స్నేహితురాలలో ఒకరీతి. ఆమె పేరు ఊర్వశి.
    ఊర్వశి మాములు అందగత్తె. కాని ఆమెలో మొగవాళ్ళను ఆకర్షించే అనేక లక్షణాలున్నాయి. అవసరమున్నా లేకపోయినా సుతారంగా నవ్వటం వినిపించి వినిపించనట్లు మాట్లాడటం, మాటిమాటికీ అంటే అంటే ' అనే ఊతపదాన్ని వాడుతూ వుండటం, భుజాలు తనూ షాగా వొంచటం, మాట్లాడుతూ , మాట్లాడుతూ పరధ్యానంగా వున్నట్టు మొహం పెట్టటం, కళ్ళ  చుట్టూ కాటుక కొనలు పొడవుగా తీర్చి దిద్దటం అన్నిటికన్నా ముఖ్యం బాయ్ ఫ్రెండ్స్ తో ఫ్రీగా మాట్లాడటం వాళ్ళతో కలసి అప్పుడప్పుడూ బయట తిరుగుతుండటం.
    "నువ్వలా చేస్తావే. నీకు భయం వెయ్యడా?" అనడిగింది రాజహంస ఓసారి.
    "ఎలా?"
    "మొగవాళ్ళతో ఫ్రీగా తిరగటం."
    "తిరిగితే ఏమయింది?"
    "వాళ్ళేమైనా చేస్తే?"
    "వాళ్ళ మొహం! భయపడే ఆడదాన్ని ఏమయినా చెయ్యగలరు గానీ చలాకీగా చొరవగా వున్నదాన్ని ఏం చెయ్యగలరు?"
    "ఒకవేళ చొరవ తీసుకుని ఎవరన్నా ముందుకెళితే ?"
    "ఇష్టం లేకపోతే పళ్ళు రాలగోడతాను. ఇష్టపడితే రమ్మంటాను."
    "ఎవరిష్టపడితే?"
    "నా మనసు."
    రాజహంస కొంచెం సేపు మౌనంగా ఊరుకుని అడగలేక అడగలేక ఓ ప్రశ్న అడిగింది.
    "ఇష్టపడితే వూరుకుంటాను' అంటే అర్ధమేమిటి?"
    ఊర్వశి నవ్వింది. "తెలుసుకోవాలని వుందా?"
    "అంటే.....పూర్తిగా తెలుసుకోవాలని కాదు గానీ......కొంచెం వుంటుందిగా" అని ఒప్పేసుకుంది.
    ఊర్వశి మళ్ళీ నవ్వింది. "ఇలాంటి సంగతులు తెలుసుకోవాలని అందరికీ వుంటుంది కాని బయట పడరు" అంది జీవిత సత్యాన్ని కాచి వడబోసినట్టుగా.
    "చూడు హంసా! ఈ మనుషుల్లో బయటకు కనిపించే రూపం వేరు లోపలున్న జంతు తత్వం వేరు. ఇప్పుడు పత్రికల్లో వస్తుంటాయి చూడు. సెక్స్ సందేహాలూ. సమస్యలూ వగైరాలూ. అవన్నీ మరీ పచ్చిగా వుంటున్నాయి. నిజమేననుకో కాని చాలామంది బయటకు 'ఛీ ! ఛీ! ఇవేం రాతలమ్మా అసహ్యం. చండాలం అని చీదరించుకుంటూ ఎవరూ లేకుండా అటూ ఇటూ చూచి ఆ పేజీయే తిరగేస్తారు. అసలు చాలా పత్రికల సర్క్యులేషన్ వాటివల్లే పెరిగింది తెలుసా? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది సెక్స్, క్రైం , థ్రిల్! జీవితంలో ఈ మసాలా అంతా వుండాలి. నీతి శీలం ఇవన్నీ బయటకు చెప్పే నంగనాచి కబుర్లు."
    ఆమె చెప్పినదాంట్లో పాయింటు గురించి రాజహంస దీర్ఘంగా ఆలోచించింది.
    కొంచెమాగి 'అదిసరే! నేనడిగింది ప్రత్యేకంగా నీ గురించి."
    "ఓహో అదా!' అని అందంగా నవ్వింది ఊర్వశి. ఆమెకి అందంగా ఎలా నవ్వాలో తెలుసు.
    "ఇష్టపడితే ' అంటే ఏమిటో అడిగావు కదూ! అది ఆయా సందర్భాలను బట్టి రకరకాలుగా మారుతూంటుంది. బహుశా అప్పుడున్న మూడ్ ను బట్టి అవతలి వ్యక్తీ చొరవ తీసుకున్నా అభ్యంతరం తెల్పను."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS