చనువుగా ఏదో రాశాను. పెద్దదానివని గౌరవం వున్నా మనమధ్య వున్న ఆత్మీయతతో యింత పెద్ద ఉత్తరం రాశాను. ఏమీ అనుకోకు. అయినా ఆ పాటి స్వాతంత్ర్యం లేదంటావా నాకు?
ఇక వుండనా మరి
నీ చెల్లి
శిరీష
ఉత్తరం చదవటం పూర్తి కాగానే వారుణి మనస్సు చలన రహితమై పోయినట్టుగా అనిపించింది. కొన్ని క్షణాలపాటు అయోమయం. శిరీష రాసిన విషయాలని నమ్మలేకపోతోంది మనస్సు. సారధి కర్పితమైన మనస్సు. అతని కంకితమైపోయిన మనస్సు. అతన్నే తన జీవిత రధసారధిగా భావించిన మనస్సు తన మానం, ప్రాణం ,జీవం, చైతన్యం అన్నీ అతనే అని నమ్ముకున్న మనస్సు.
కానీ బుద్ధి నమ్ముతోంది. పరిస్థితులని పరిశీలనగా గమనిస్తున్న బుద్ధి, ప్రతిరోజూ ఆ యింట్లో క్షణ క్షణం జరుగుతోన్న సంఘటనలని నమ్ముతున్న బుద్ధి, పురుషులపై క్రమంగా విశ్వాసాన్ని కోల్పోతున్న బుద్ధి ఆ ఉత్తరంలోని విషయాలని విశ్వసిస్తోంది.
గుండెల్లో సన్నని మంటలాంటి ఆవేదన.
ఆలోచనలతో ఆమె మనస్సు దహించుకుని పోయింది. వారుణి మనస్సు రగిలే మంటలున్న అగ్నిగోళం అయ్యింది.
31
మనస్సు బాగా పాడైపోయింది.
వారుణికి వాళ్ళ మధ్యకి వెళ్ళాలనే అనిపించటం లేదు. అందుకే ఆ రాత్రి ఆమె భోజనానికి వెళ్ళనే లేదు.
ఆమెకి అందరూ ఒక దొంగల గుంపులాగా నమ్మకద్రోహుల్లాగా అనిపించసాగారు. అందునా సారధి మరీ విశ్వాస హీనుడిలా కనిపించసాగాడు.
బలహీనవర్గానికి చెందిన మనుషుల్ని తరతరాలుగా కట్టు బానిసలుగా ఉపయోగించుకుంటూ, తమ స్వార్థానికి వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాడుకుంటూ, వాళ్ళని యింకా అధోగతి పాల్జేసే క్రూర యజమానుల మనస్తత్వం కనిపించిందతనిలో.
శత్రువుతో కత్తితో పోరాడినట్టుగా అతనితో పోరాడితే తప్ప, మనస్సు శాంతించేట్టుగా లేదు. అందుకోసం కాచి, వేచి వుంది వారుణి.
దాదాపు పదిగంటల సమయంలో గదిలోకి వచ్చాడు సారధి. అతనికి వారుణి ముఖం చూడాలంటే అదో విధంగా వుంది. మాటాడాలన్నా కూడా ఏదో బెరుకు బెరుగ్గా వుంది.
"భోజనానికి రాలేదేం?" అడిగాడు.
"కడుపు నిండిపోయింది"
"తినకుండానే" బలవంతంగా నవ్వుని పెదాలపై తెచ్చుకుని అన్నాడు. అయినా అది శుష్కహాసమే అయింది.
"మీ వల్ల మీ చేష్టల వల్ల కడుపు బాగా నిండిపోయింది. అంతో యింతో కొరత వుంటే అదీ యిప్పటి మీ రాకతో పలుకరింపులతో నిండిపోయింది" నర్మగర్భంగా హేళనగా అంది వారుణి.
"వరూ!"
"మీరెందుకిలా మారిపోయారు?" సూటిగా ప్రశ్నించిందామె. మనస్సులో ఒకటి వుండగా పైపై మెరమెచ్చులకి యింకోటి మాట్లాడటం ఆమెకి చేతకావటం లేదు.
"ఎలా మారిపోయాను! ఊరికే విసిగించక? అయినా మీ ఆడవాళ్ళకి ఎప్పుడూ మీరు మారిపోయారు, మీరు మారిపోయారు అని భర్తని వేధించటమే తెలుసు. ఎందుకు మారిపోతాం మేము? ఒకవేళ మారినా అదేం తప్పా?
"ఎంతగా మారిపోయావు రధీ! ఎలక్షనుకి ముందు వాగ్దానాలు చేసిన అభ్యర్థి, ఎలక్షన్లో గెలవగానే ప్రజల్ని, వాగ్దానాల్ని మరిచిపోయినట్టు, వాళ్ళకి మళ్ళీ అయిదేళ్ళదాకా ముఖం చూపనట్టు మారిపోయావు. వాళ్ళకి మళ్ళీ అయిదేళ్ళకయినా తిరిగి గుర్తొస్తాయి అవి. కానీ నీకు జీవితాంతం అవి గుర్తుకి రావు. అంతగా మర్చిపోయావు_మారిపోయావు" సూటిగానే అందామె.
"ఏమిటిది? ఎందుకిలా అంటున్నావ్? నేనేం చేశానని నేరస్తుడిని నిలదీసినట్టు నిలదీస్తున్నావ్?" ఆమె ధోరణికి రెచ్చిపోయి, కోపంగా అడిగాడు సారధి.
