చీఫ్ ఎగ్జామినేషన్ లో నాతో చెప్పించిన విషయాలు. సురేంద్రకు ఎప్పట్నుంచో నా మీద కన్నుంది. నన్ను పొందాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. లొంగక పోయేసరికి నామీద పగబట్టాడు.
ఈ సంగతి నా భర్తకు ఎందుకు చెప్పలేదు?
అమ్మో ఇంకేమన్నా ఉందా? నా పచ్చని సంసారం భగ్గుమని పోదూ? నా కాపురం కూలిపోదూ? అందుకని చెప్పలేదు.
నేను చాలా అమాయకురాల్ని. ఆభమూ శుభమూ తెలీనిదాన్ని.
నా భర్త సుకుమార్ కూడా అమాయకుడు. స్నేహితుణ్ణి గుడ్డిగా నమ్మాడు.
అసలు సురేంద్ర ఇంట్లో మాకు ఆశ్రయమివ్వటానికి కారణం.... నా మీద కోరికతోనే, నన్నెట్లాగైనా లోబర్చుకోవాలన్న ఉద్దేశంతోనే జరిగింది.
సురేంద్ర ఎలాంటివాడు?
పరమ ఛండాలుడు. త్రాగుబోతు. ముండల ముఠాకోరు.
'ముండల ముఠాకోర'న్న పదం నేను వాడనన్నాను. మా లాయరుగారు ఆ పదం వాడక తప్పదన్నారు. కోర్టులో కేసంటే ఏమిటి? కొన్ని భయంకరమైన పదాలు వాడితీరాలన్నారు.
ఇంటికి 'ముండ'లను తీసుకొచ్చేవాడు.
ఆ 'ముండ'తోనే ఇష్టానుసారం గడిపేవాడు. ఇతని ప్రవర్తన భరించలేకనే అతని పెళ్ళాం ఎవడితోనో 'లేచి' పోయింది.
నన్ను పొందుదామన్న అతని ప్లాను ఫలించకపోవటంతో పెద్ద పథకం పన్నాడు.
ఆ పథకం ప్రకారం తాను మారినట్టు నటించాడు.
అక్కడ్నుంచి జరిగింది జరిగినట్టు వివరించాను.
అతన్నన్ను ఆక్రమించిన దృశ్యం చాలా విశదీకరించేటట్లుగా ప్రశ్నలడిగాడు.
ఎంతో నమ్మకంగా కూల్ డ్రింక్ ఎలా ఇచ్చిందీ, అది త్రాగాక నా శరీరమెలా స్వాధీనం తప్పిపోయి ఎలా నిస్సహాయురాలయి పోయిందీ, తర్వాత నా జాకెట్ ఊడదియ్యటం, చీరె విప్పటం.... ఆ తర్వాత ప్రేక్షకురాల్లా మిగిలిపోవటం.... అతన్నన్ను అణువణువునా అనుభవించటం, తర్వాత నా పోర్షన్లోకి తీసుకురాబడటం....
నా భర్త రావటం, ఆ షాక్ కి తట్టుకోలేక ఆత్మహత్య....
పత్రికలన్నీ నా ఫోటోతో సహా ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ప్రచురించాయి.
ఈ కేసు ఓ సెన్సేషనయి కూర్చుంది.
తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్....
మొదట నా పుట్టు పూర్వోత్తరాలన్నీ తీశాడు.
"మీ తండ్రి చనిపోయాక మీ తల్లి నవనీతరావు అనే మనిషిని ఉంచుకుంది. అవునా?"
ఈ 'ఉంచుకుంది' అనే మాట మనుషులెంత తేలిగ్గా ఉపయోగిస్తారు!
కోర్టులో సాధ్యమైనంత వరకూ నిజం చెప్పకూడదు.
"లేదు"
"యుక్తవయసొచ్చి నప్పట్నుంచీ నీకు బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే అలవాటుంది."
"లేదు"
"కొంతమందితో విచ్చలవిడిగా ప్రవర్తించావు కూడా."
"లేదు."
"నీకు రాజేంద్ర అనే వ్యక్తితో పెళ్ళయ్యింది."
"అవును"
"కొన్నాళ్ళు కాపురం చేశాక నీ క్యారెక్టర్ మంచిది కాదని తెలిసి, నిన్ను భరించలేక ఒదిలేశాడు."
"ఇది నిజం కాదు. అతను నపుంసకుడు. ఈ సంగతి దాచిపెట్టి నన్ను మోసం చేసి పెళ్ళి చేశారు."
"నపుంసకుడంటే నాకర్థం తెలీదులే, కొంచెం వివరించి చెబుతారా?"
"మగతనం లేనివాడు"
"ఈ మగతనం లేకపోవటం కేవలం సైకలాజికల్ అని చెబుతారే డాక్టర్లు."
"సైకలాజికలయినా ఏ లాజికలయినా ఆడదానికి పనికి రానప్పుడు అతన్తో ఎలా కాపరం చెయ్యగలుగుతుంది?"
"అయితే అందుకు పనికొస్తేనేనా కాపురం?"
"అందుకోసమేగా పెళ్ళయిన మర్నాడే కార్యమనీ, హానీమూన్ అనీ ఎరేంజ్ చేస్తారు. అందుకు పనికిరాడనేగా క్లెయిమ్ చేసుకుంటే కోర్టు కూడా విడాకులు మంజూరు చేస్తుంది. అతన్ని విడిచి పెట్టలేదు. న్యాయబద్ధంగా మా అత్తగారి సమ్మతంతోనే విడిపోయాం."
"సుకుమార్ ని నువ్వు ప్రేమించి పెళ్ళి చేసుకున్నావా?"
"అవును?"
"సురేంద్రతో నీ కంతకు ముందే పరిచయముందా?"
"లేదు"
"సుకుమార్ ఇంట్లో లేనప్పుడు సురేంద్ర మీ ఇంటికి, అతనింటికి నువ్వూ స్నేహపూరితమైన రాకపోకలు జరిగేవి."
"కాదు"
"సుకుమార్ తో నీ జీవితం సుఖంగా లేదనీ, ఆర్థికంగా కూడా అతనసమర్థుడనే, అందుకని అతన్ని వదిలిపెట్టి సురేంద్రతో ఉంటానని ఎన్నోసార్లు ప్రాధేయపడ్డావు?"
"లేదు"
"ఒకసారి సుకుమారింట్లో లేనప్పుడు సురేంద్ర ఇంటికెళ్ళి లైంగిక సంపర్కం కూడా కోరావు."
"లేదు అలా ఎప్పుడూ జరగలేదు."
"అతను నీ కోరిక తీర్చకపోవటమే కాకుండా, స్నేహితుడి భార్య చెల్లెలితో సమానమని చెప్పి మందలించి వదిలేశాడు. ఆ కోపంతో అతని మీద పగబట్టావు."
"లేదు. అతను నా మీద వ్యామోహం తీర్చమని అడిగినప్పుడు అంగీకరించ లేదని అతనే నామీద పగబట్టాడు. ఆ పగతో పథకం ప్రకారం నన్ను చెరిచాడు."
