పోస్ట్ మాన్ ఆమె ఆలోచనల్ని భగ్నం చేశాడు. కవరు_శిరీష నుంచే. శిరీష మనిషేకాదు మనసేకాదు ఉత్తరాలు కూడా అందంగా వుంటాయి. అక్షరాలు మరీను ఆ పిల్ల జోక్స్ కూడా వేస్తుంది. కొద్దిగా శృంగారంగా అనిపించినా అవి మనస్సుకి కితకితలు పెడతాయి.
చెల్లెలిపై ఆలోచనలతో ఉత్తరం చించి చదవసాగిందామె. ఎడారిలో ఒయాసిస్ లాగా సంవత్సరంలో వసంతం లాగా వారాల్లో ఆదివారంలాగా సంగీతంలో శాస్త్రీయ సంగీతంలాగా కవిత్వంలో శృంగార వర్ణనలాగా జీవితంలో శిరీష ఉత్తరాలు వారుణి మనస్సుని రంజింపచేస్తాయి.
"వరూ !"
ఇదేమిటి బొత్తిగా మూగవై పోయావు. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ మువ్వలా మోగుతూ వుండే నువ్వు యీ మధ్య మోగని గజ్జెవై పోయావేమిటి?
ఉత్తరాలు చదువుకోవటంలో వున్న హాయి రాయటంలో కనిపించటంలేదేమిటమ్మా నీకు! అయినా యింత ఒళ్ళు బరువా! ఊహూఁ నేను ఒప్పుకోను.
ఎవరయినా ఏదయినా ఆశించినపుడు దానికి తగినట్టుగా తగినంత ప్రతిఫలం చెల్లించవలసిందే! ఇకనుంచి నువ్వు నా జాబులు చదవాలనుకుంటే నాకు జవాబు రాస్తేనే సుమా! అయినా నీకు నా మనసు బాగా తెలుసు. భక్తుడు దేవి వరమివ్వకపోయినా ఏదో ఆశతో యింకా భక్తిగా కొలిచినట్టుగా నువ్వు రాసినా రాయకపోయినా నేను రాస్తానని నీ నమ్మకం కదూ! సర్లే. నీ నమ్మకాన్ని ఎందుక్కాదనాలి?
అయినా బావగారు మరీ అంతగా బంధించివేశారా నిన్ను? నాకు ఉత్తరం రాసేటంత అవకాశం కూడా కల్పించటం లేదా? నేన్నమ్మను. నువ్వే బద్దకించి వుంటావు_అవునా!
అవునూ! అదేమిటి అలా చేశావు నువ్వు. డబ్బొద్దన్నావని నాన్నగారు చెప్పారు. నువ్వు తిరస్కరించినందుకు బాధపడినా బావగారూ నీవూ ప్రవర్తించిన తీరు ఆయనకి ఎంతో సంతోషం కలిగించింది. కట్నం యిస్తోన్నా వద్దని తిరస్కరించే మహానుభావులు ఎందరుంటారు? కట్నం అడక్కపోవటం లేదు_ఇచ్చినా- ఇవ్వగలిగిన స్తోమత వున్నప్పుడు కూడా తిరస్కరించగలిగే హృదయ ఔన్నత్యం ఎంతమందికి వుంటుంది? ఆ మాట ఎంత గర్వంగా చెప్పారు నాన్నగారు!
అలాంటి నువ్వు_డబ్బు అవసరమని నాన్నగారితో పదివేలు అప్పుగా తెమ్మని బావగారిని పంపావట. నిజమేనా? ఎందుకు? ఏం అవసరం వచ్చింది? నాన్నగారు సంతోషంగానే యిచ్చారనుకో_
తిరిగి యివ్వక్కర్లేదని అన్నారట కూడా.
దానికి మీ శ్రీవారు_ అదే మా బావగారు ఒప్పుకోలేదట! అప్పుగా తీసుకున్నాను. నెలనెలా యింతని బ్యాంక్ లో జమవేస్తానన్నారట! నెలకి వందో రెండొందలో మీ జీతాల్లోంచి తీసి జమచేసెయ్యొచ్చు. ఫరవాలేదు. మంచిదే అవసరం తీరింది. అప్పు తీరుతుంది...
కానీ వరూ! బావగారూ నువ్వూ కూడా పప్పులో కాలేశారు. అప్పు అనేది చాలా చెడ్డది వరూ! లోకంలో దాన్ని మించిన విషం యింకేదీ లేదు. అది మానవత్వాన్ని చంపుతుంది. మమకారాన్ని నరుకుతుంది. బంధుత్వాన్ని కాలుస్తుంది. మైత్రిని చంపేస్తుంది. మనిషినే నశింప చేస్తుంది.
ధర్మరాజులాంటివాడే తీసుకున్న డబ్బుని తిరిగి యిచ్చే వేళకి అప్పటి మనస్సు వుండదని అన్నట్లు! కొన్ని కఠోర సత్యాలుంటాయి. వాటిని కాదనలేం. మనకి చేదుగా అనిపించినా వాటిని అంగీకరించక తప్పదు అదంతే!
మీరు నాన్నగారి వద్ద డబ్బు తీసుకుని చాలా ఘోరమైన తప్పు చేశారు. అంత అవసరం వచ్చినప్పుడు యింకెక్కడయినా ప్రయత్నించి వుండవలసింది. అయినా మీకు యిప్పుడంతటి అవసరమేమొచ్చిందే?
నాకు తెలీక అడుగుతున్నాను. నవదాంపత్య సౌరభాలు యింకా పరిమళం విడవకముందే సంసారం గొడవల్లో పడ్డారా మీరు ప్రేమించి పెళ్ళి చేసుకుని యిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ నెలకి రెండువేలు సంపాదించుకునే మీకూ యీ యిక్కట్లు తప్పలేదేమిటి? ఖర్మ.
