"కాని.... ఈ రేప్స్.... ఇవి ఖండించకపోతే....?"
"ఖండించవద్దని ఎవరన్నారు? రేప్ చేసిన వాడు ఒక మనిషి. మొగజాతి కాదు."
"మీకు మోరల్ గా ఎంతో సపోర్ట్ ఇద్దామనుకుంటున్నాం. మీ వెనకే మేమంతా ఎంతో అండగా ఉన్నామని చాటి చెబుదామనుకుంటున్నాం కవిత్వాలు అల్లుదామనుకొందాం."
"మంచిదే. కాని ఉండి ఏం చేస్తారు? ఇది మనిషిలోని పశుత్వానికీ, రాక్షసత్వానికి సంబంధించిన సమస్య , సామాజిక సమస్య కాదు. సమాజమనే పదం ఉపయోగించటం నాకిష్టం లేదు. అయినా మీకర్థం కావటానికి వాడుతున్నాను. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఇక్కడ సమాజానికేం సంబంధం లేదు. వాడిని అసహ్యించుకోండి. చేతనైతే చంపండి.... చిత్రవధ చెయ్యండి. భయంకరమైన పనిష్ మెంట్లు ఇవ్వండి. కాని.... ఒకర్నొకరు దూషించుకునే ఈ కవిత్వాలేమిటి? స్త్రీ వంటచేస్తే వంట మనిషెలా అవుతుంది? ఇల్లనే నందనవనంలో అదో అందమైన బాధ్యత అని ఎందుకనుకోరు? రాత్రనకా, పగలనకా, ఆత్మని, అభిమానాన్ని చంపుకుని మగాడు గొడ్డుచాకిరి చెయ్యటం లేదా? సంపాదన చాలినా చాలకపోయినా అప్పుల పాలయిపోతూ కూడా కుటుంబ బాధ్యతమొయ్యటం లేదా? మనిషిని తిట్టండి. జాతిని తిట్టొద్దు. మనిషిని తిట్టండి. కులాన్ని తిట్టద్దు. మనిషిని తిట్టండి. మతాన్ని తిట్టద్దు. మగాళ్ళలో ఎలా రాక్షసులూ, నీచులూ ఉన్నారో ఆడవాళ్ళలో కూడా పరమగయ్యాళులూ, కరుడుగట్టిన కాఠిన్యమూర్తులూ, అసహ్యమైన అల్పబుద్ధులూ ఉన్నారు. ఒక మొగాడు కిరాతకంగా ప్రవర్తించినంత మాత్రాన మగాళ్ళంతా రాక్షసులు కాదు. ఒక ఆడది ఆన్యాయానికి బలయినంత మాత్రాన ఆడవాళ్ళంతా అమాయకులని అర్థం కాదు. వికృత పరిస్థితుల్లో జరిగిన సెక్స్ ను అసహ్యించుకోండి. గర్హించండి. కాని అసలు సెక్సే మగాడి ఐశ్వర్యంగా అభివర్ణిస్తూ, కాళ్ళు అలా పెట్టటం, ఇలా పెట్టటం.... అన్నిటినీ నేరాలుగా చీదరించుకుంటే ఎలా? స్త్రీకి మర్మయవాల్లో ఆపరేషన్ చేసేటప్పుడు లిథోటమీ పొజిషన్ లో పడుకోబెడతారు. అంటే కాళ్ళు వెడల్పు చేసి ఆపరేషన్ సౌకర్యం కోసం. అది కూడా స్త్రీ మీద జరిగే అక్రమంగా, అన్యాయంగా భావించి చెలరేగిపోతూ కవిత్వం రాసే స్థితికి దిగజారిపోతే ఎలా? వాల్ పోస్టర్ల మీద జుగుప్సగా, అసభ్యంగా కనిపించే బొమ్మల్ని గర్హించండి. పడగ్గదిలో కూడా శాడిజం ఉంటే విజృంభిస్తూ తిట్టండి. అంతేగాని సహజమైన మాధుర్యాన్ని, రకరకాల భంగిమల్తో అనుమతించబడిన అనుభవాన్ని, అందులో ఓ భాగమై ఆస్వాదిస్తూ ద్వేషించకండి. పిల్లలకు నీళ్ళు పొయ్యటం, పాలివ్వటం, పాలిండ్లు శుభ్రం చేసుకోవటం.... అన్నిటినీ ద్వేషించుకుంటూ పోయి పగతో సెగలు గ్రక్కితే ఎలా? మనిషి మనిషిగా బతకాలంటే ట్రాన్స్ ఫారమ్ కావాలి. ఆ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం ప్రయత్నించండి. మీ చుట్టూ వున్న చెడుని చూపించండి. కాని మీరు కూడా ఆ చెడులో ఓ భాగమని మర్చిపోకండి. ద్వేషంతో నిప్పులు క్రక్కవద్దు. ఆ ద్వేషంతో అసలు నిజం నిక్షిప్తమై నిస్సహాయంగా మిగిలిపోతుంది. సంఘటనని ద్వేషించండి. జాతినీ, జీవితాన్ని ద్వేషించవద్దు. ఎందుకంటే మనమంతా కూడా ఆ జీవితంలో, ఆ ప్రపంచంలో అనుక్షణం బ్రతకాలి. మనిషిని సానబట్టి అతన్లో డస్ట్ ని వొదిలించి ప్రక్షాళనం చెయ్యటానికి ప్రయత్నించండి. అందులోంచి ట్రాన్స్ ఫర్మేషన్ ఆవిర్భవిస్తుంది. పగతో, ఉగ్రభాషణలతో, పూనక మొచ్చినట్లు పలికే ప్రగల్భాలతో ఆవేశం మిగుల్తుంది. ఆవేశమెప్పుడూ నిజాన్ని కప్పేస్తుంది. ఏమిటిలా మాట్లాడుతూన్నదని దయవుంచి అపార్థం చేసుకోకండి. నాకు మీ సింపతీ కావాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఇక్కడ నేను కోరుకునేది విద్వేషం కాదు. వాడి వ్యక్తిగత అహంకారానికి వ్యక్తిగతమైన శాస్తి.
ఒకరు చెప్పింది ఇంకోరి బుర్రలోకి అంత తేలిగ్గా ఎక్కదు. పైగా నెగిటివ్ గా కూడా తీసుకుంటారు. ఈ సత్యం మీ అందరికంటే ఎక్కువగానే తెలుసు.
అసహనంగా.... "నువ్వో స్త్రీవా?" అన్నట్లు చూసి విసురుగా బయటికెళ్ళిపోయారు.
24
కేసు మొదలయింది.
ఈ కోర్టులని అక్కడ జరిగే తతంగాన్ని సినిమాల్లో చాలా విచిత్రంగా చూపిస్తూ వుంటారు. ఓ న్యాయదేవతబొమ్మ. చేతిలో త్రాసు ఆర్డర్ ఆర్డర్ అంటూ జడ్జీగారు అరుస్తూ ఉండటం, ఎదురెదురుగా బోన్లలో కేసు పెట్టిన వాడూ, పెట్టబడినవాడూ ఎదురెదురుగా నిలబడి మాట్లాడేస్తూ ఉండటం, ఆర్గ్యుమెంట్స్ అయిన రోజునే జడ్జిమెంట్ చెప్పేస్తూ ఉండటం...."
ఇక్కడ నేను సినిమాల్ని తప్పు బట్టటం లేదు. వేగం కోసం ఉద్వేగం కోసం, కథను బలంగా నడిపించటం కోసం కొంత లిబర్టీని తీసుకోక తప్పదు.
ఇప్పుడు నేనూ ఆ పని చెయ్యబోతున్నానని చెప్పనుగాని కోర్టులో జరిగిందంతా రాసుకుంటూ పోతే కొన్ని వందల పేజీలు రాయాల్సి వస్తుంది. అందువల్ల కుదించి, సూక్ష్మీకరించి ఎంతవరకూ అవసరమో అంతే రాస్తాను.
తన క్లయింటుని గెలిపించటం లాయర్ వృత్తి ధర్మం. అందుకోసం ఎంతవరకైనా పెనుగులాడతాడు.
కొన్ని వాయిదాలు అర్థం పర్థం లేకుండా అయిపోయాక బోనులో నిలబడ్డాను.
ఈ ప్రపంచమంతా ఎంత యాంత్రికంగా నడుస్తుందో కోర్టులో చేసే ప్రమాణమే చెబుతుంది.
మొదలు మా లాయర్ చీఫ్ ఎగ్జామినేషన్ మొదలు పెట్టాడు.
ఎక్కువ విసిగించకుండా ఎంతవరకూ అవసరమో అంతే రాస్తానని చెప్పాను కదా.
