కానీ అప్పుడైనా తిరిగి యింటికి రావాలి. అదే ముఖం చూడాలి. దాదాపు రెండు రోజులుగా కలుగుతున్న యీ ఘర్షణకి ఒక తారస్థాయి తేవాలి. తప్పదు. వారుణి అంత సుళువుగా వదలదు.
నిట్టూర్చి లేచి గదిలోకి వచ్చాడు.
అతను సూటిగా ఆమె ముఖం చూళ్ళేక పోయాడు.
నిమిషం_రెండు నిమిషాలు_అయిదు నిమిషాలు.
నిశ్శబ్దం_నిశ్శబ్దం_నిశ్శబ్దం_స్త్రీ సహజమైన ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేని వారుణి తనే ముందుగా పలుకరించింది "రండి!"
ఆమె గొంతు ఆమెకే వింతగా అనిపించింది. ఆ గొంతులోని అభ్యర్ధనకి ఆశ్చర్యపోయాడు అతను. వచ్చి కూర్చున్నాడు.
అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది "అప్పుచేశారా?"
"మళ్ళీ అదే విషయం" అనుకున్న సారధికి కోపం వచ్చింది. "అప్పు చేశాను, అంతేకాని తప్పు చేయలేదు." అన్నాడు కఠినంగా.
"అవసరంలేని అప్పు చేయటం తప్పు చేయటమే."
"నన్ను తప్పుపడుతున్నావా?"
"తప్పుచేస్తే ఎవరినయినా తప్పు పడతాను."
చివాలున లేచి కూర్చున్నాడు "వారుణీ! డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నువ్వు నాతో సహకరించలేదు. నా బాధ నీ బాధ అనుకోలేదు. అందుకే నేను నా విషయం చూసుకున్నాను. అది అప్పో_ తప్పో_ నీ కనవసరం."
"ఎలా తీరుస్తారు?"
"అది కూడా చెప్పాలా?" వ్యంగ్యంగా అడిగాడు.
"అవును, నాకూ బాధ్యత వుంటుంది కదా?"
"బాధ్యత_ అది తెలిస్తే నీవలా ప్రవర్తించవు."
ఆమె జవాబు చెప్పలేదు.
"ఎలాగో తీరుస్తాను. ట్యూషన్స్ చెప్పి_ లేదా గైడ్స్ రాసి_ ఎక్కడైనా పార్టు టైం జాబ్ చేసి" వ్యంగ్యంగా అన్నాడు.
తన సమాధానం తనకే చెబుతున్నాడు, మొండికెత్తుతున్నాడు అనుకుంది.
"వరూ! నువ్విల మాటమాటకీ నన్ను వేధిస్తే నేను భరించలేను. మనం స్నేహితులం, మనం ప్రేమికులం, మనం భార్యాభర్తలం కూడా. నేను నీకెంత సరిసమాన స్థాయి కల్పించినా నలుగురిలో నన్ను నీవు నవ్వులపాలు చేస్తే నేను భరించుకోలేను."
ఆ మాటలకి జవాబివ్వలేదు వారుణి.
"మన మధ్య_ మన పడకగదిలో జరిగే యీ ఘర్షణ నలుగురికీ తెలిసేలా ప్రవర్తించవద్దు."
"ఎవరు? ఎవరు ప్రవర్తిస్తున్నారు. మీరు_మీరే_నన్ను చులకనగా చూశారు, నిర్లక్ష్యం చేశారు. అవమానించారు. ఇప్పుడు హితబోధ చేస్తున్నారు" అని గట్టిగా అరవాలనిపించింది.
కానీ బలవంతాన మనస్సుని నిగ్రహించుకుని అటు తిరిగి పడుకుంది. వారుణి మనస్తత్వం తెలిసిన అతను మౌనంగా పడుకున్నాడు.
30
ఇనుము విరిగితే అతుకుతుంది. కానీ పాలు విరిగితే.... ఆ విరిగిన పాలని జున్నులాగా ఆస్వాదించే వాళ్ళుండొచ్చు. కానీ అది దాంపత్యంలో ఒక అపశృతి... అనురాగవీణపై అప్రయత్నంగా పలికిన అపశృతి....
ఆ రోజునుంచీ సారధితో మనసిచ్చి మాటాడలేక పోతుంది వారుణి. సారధి కూడా ఆమెతో పూర్వంలా వుండలేక పోతున్నాడు. ఏ తెలియని అగాధమో యిద్దరి మధ్యా ఏర్పడింది. దాన్ని భర్తీ చేసి అనురాగ వంతెనని నిర్మించే సంఘటన ఏదీ జరగలేదు.
ఆ రోజు సారధి టెన్నిస్ కోర్టుకి వెళ్ళిపోయాడు. మబ్బుగా వుంటే మూడింటికే క్లబ్బుకి వెళ్ళేడు. అతనికున్న వ్యసనం అదొక్కటే మరి.
చేతిలో చలం దైవమిచ్చిన భార్య పట్టుకుని వసారాలోనే కూర్చుంది వారుణి. మామగారు ఆఫీసుకి వెళ్ళారు. ఫణి ఇంట్లో నిద్రపోతున్నాడు. పద్మ ఎగ్జామ్స్ కి చదువుకుంటుంది. సావిత్రి, సుబ్బరత్నం వంటింట్లో ఏదో గొడవలో ఉన్నారు. వాళ్ళెప్పుడూ అంతే అనుకుంటుంది వారుణి. వేకువన లేవగానే కాఫీ టిఫిన్ల గొడవ, తర్వాత మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంకాలం కాఫీ టిఫిన్లు, టీలు. రాత్రికి డిన్నర్. ఎప్పుడూ తిండి రంధీ_తప్పితే చీరల జాకెట్లు గొడవలు. ఇదేనా వీళ్ళలోకం. ఆదివారం సినిమాకి వెళ్ళిరావటం తప్ప మరో వ్యాపకం లేదు. వీళ్ళ మనసులెలా వుంటాయి. ఎలా పనిచేస్తాయి? అవి బండబారి పోయాయా? అనుకుంది వారుణి.
