మొగుడడగ్గానే పడుకునే పడుపుగత్తా?
వాడు చేసిన వెధవ పనికి
తాను కడుపు తెచ్చుకుని
మధ్య మధ్య ఎబార్షన్లు చేయించుకుంటూ
కావాలనుకున్నప్పుడు పిల్లల్ని కంటూ
సంతానోత్పత్తికి పనికొచ్చే యంత్రమా?
పిల్లలకి రొమ్ములు బయటికి తీసి పాలిస్తూ
పాలిండ్ల పాలు హరించుకుపోయినా, తాము క్షీణించిపోయినా
నిద్రపుచ్చటానికి నోట్లో పెట్టి నానుస్తూ
మొగుడు వెధవకి కోరిక్కలిగినప్పుడు
వాడి చేతులకి అందిస్తూ
చప్పరించటానికి నోటికి కూడా అందిస్తూ
ఒకవైపు పిల్లాడు లేకపోతే పిల్ల
రెండోవైపు మొగుడు చచ్చినోడు
స్తనాలను పీల్చి పిప్పి చేస్తోంటే
మళ్ళీ కడుపుకు, మరో ఎబార్షన్ కు
లేకపోతే మరో ఎఫిసియాటమీకి
లేకపోతే మరో సిజేరియన్ కు శరీరాన్ని సిద్ధం చేస్తూ
మరో ప్రక్క పిల్లనో, పిల్లాడ్నో, పెంచే ఆయాగా
తొడలదాకా చీరె పైకెత్తి నీళ్ళు పోస్తూ
వాళ్ళ చీమిడి ముక్కులు తుడుస్తూ, అవి చీరెలకు రాసేసుకుంటూ
వాళ్ళ ఉచ్చల్లో తడుస్తూ
వాళ్ళు దొడ్లో కెడితే ముడ్లు కడుగుతూ....
ఆ వెధవలు తర్వాతెప్పటికో ఎదిగినప్పుడు
తిరిగి తల్లిగా బానిస రూపం ధరించి....
ఇలా సాగిపోయింది. నిజం చెప్పాలంటే వింటూన్నప్పుడు నాలోనూ రక్తం వుడుకులెత్తి ప్రవహించింది.
రెండో ఆమెవైపు ప్రశ్నార్థకంగా చూశాను.
ఓ నిమిషం కళ్ళు మూసుకుని తర్వాత గొంతు విప్పింది.
'సెక్స్ సెక్స్ సెక్స్.'
ప్రపంచంలో ఎక్కడ చూసినా సెక్స్.
మొగముండా కొడుక్కి పన్నెండేళ్ళొచ్చి
ఇంకా ప్యూబర్టీ మొదలవకుండానే
డెబ్బైయేళ్ళు దాటి శరీరంతోబాటు అదీ క్షీణించి ఉన్నా
సెక్స్ సెక్స్ సెక్స్
రోడ్డుమీద వెడుతోంటే గోడలనిండా
పోస్టర్ల రూపంలో
రకరకాల ఇంగ్లీషు పేర్లతో
స్తనాలు, నడుం వొంపులు, పైనా క్రిందా బహిరంగపరుస్తూ
చుంబనాల, కౌగిలింతల, రతిక్రీడల భంగిమల్తో
సెక్స్ సెక్స్ సెక్స్
పత్రికల నిండా సైన్స్ పేరుతో సెక్స్
సినిమాల్లో వాంపులు, లక్షలకు లక్షలు తీసుకునే హీరోయిన్లు
పమిటల్లేకుండా, అసలు బట్టలే లేకుండా
వక్షోజాలు ఊపుతూ, అర్థం పర్థం లేకుండా ప్రదర్శిస్తూ
తొడలు కదిలిస్తూ
హీరో పేరుతో ఉన్న మొగత్రాష్టుడితో
ఇద్దరూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయించుకుంటూ
డాన్స్ పేరుతో ఛాతీతో కుమ్ముతూ
స్త్రీ జాతిని కించపరుస్తూ
స్త్రీలు తలెత్తుకోలేని విధంగా
సెక్స్ సెక్స్ సెక్స్
పెళ్ళయిన మర్నాటినుంచీ
సెక్స్ కోసమే పెళ్ళి చేసుకున్నట్లు
కామం తీర్చుకోటం కోసమే పెళ్ళామొచ్చినట్లు
సెక్స్.... సెక్స్.... సెక్స్....
ఆ ఛండాలుడు ఏం చేస్తే అది భరించి
వొళ్ళప్పచెప్పి
వాడి సుఖం కోసం, తృప్తికోసం
కాళ్ళు పెట్టమన్నట్లా పెట్టి
కదలికల్తో కదలికలు కలిపి
ఆ నీచత్వరిలో నిస్సహాయంగా భాగం పంచుకుంటూ....
ఇలా ఉగ్రంగా, ఉద్రేకంగా సాగిపోయింది.
పూర్తయినాక ఎలా ఉన్నాయి మా భావాలు అన్నట్లు నా ముఖంలోకి పరీక్షగా చూస్తున్నారు.
ఏ విషయం గురించయినా వెంటనే ఓ అభిప్రాయానికి రాకూడదు. అది తొందరపాటు నిర్ణయాలకు దారితీస్తుంది. నిదానంగా, స్థిరచిత్తంతో, ఉద్రేకాలను ప్రక్కకు నెట్టి ఆలోచించాలి.
"మీరు ర్యాష్ గా పోతున్నారేమో" అన్నాను కొంచెమాగి.
వాళ్ళకి కోపమొచ్చినట్లు తెలుస్తోంది.
"అంటే.... మన ఆడజాతిని చీల్చి చెండాడుతున్న మొగలంజా కొడుకుల్ని తిట్టడం, వాళ్ళ దుర్మార్గాలు చూపించటం ర్యాష్ గా పోవటమా?"
"ప్రపంచం చాలా విశాలమైంది. ఒకరినొకరు చెండుకు తినడం ఈ మనుషుల లక్షణం. ఇక్కడ మనుషులు అంటున్నాను. జాతి అనటం లేదు. ఎవరి చేతిలో ఆ ప్యాపకానికి చెందిన శక్తి ఉందో వాళ్ళు రెండో వారిని చెండుకు తింటూ ఉంటారు. అక్కడ డబ్బు, జాతి అనే అంశాలు ప్రక్కకు నెట్టి వేయబడతాయి. అవతలి వాడు బలహీనంగా కనబడితే ఇవతలి వాడు డామినేట్ చేస్తూ ఉంటాడు. ధనవంతునిచేత శ్రామికవర్గం దోచుకోబడుతూన్నదన్న నినాదంతో ప్రపంచంలో కొంత భాగం దద్దరిల్లిపోతోంది. అవకాశం దొరికినప్పుడు ఈ శ్రామిక వర్గం అవతలి వాడి ఆర్ధిక విధానాల గురించి పట్టించుకోకుండా ఎలా దోచుకుంటున్నదో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇళ్ళు కట్టిస్తూన్నప్పుడు, ఆఫీసు వ్యవహారాలు నిర్వహిస్తూన్నప్పుడు వీళ్ళ చేత ఎన్ని ఇబ్బందులకు లోనవుతున్నారా అని ఎవరయినా ఆలోచిస్తున్నారా? అందుకని.... ఇక్కడ కామెంట్ చెయ్యాల్సింది మనిషిని. జాతిని కాదూ. ఆ యుగాల్లో సీతను రావణాసురుడెత్తుకు పోయాడంటే, ద్రౌపతి అనేకసార్లు మానభంగాలకు గురి కాబోయిందంటే అప్పుడున్న మొగజాతి అంతా దుర్మార్గులా? రాముడు లేడా? లక్ష్మణుడు లేడా? స్త్రీలలో రాక్షసత్వాన్ని గుమ్మరించిన కైక లేదా? ద్వాపర యుగంలో ధర్మానికి ప్రతీకలైన పాండవులు లేరా? వాళ్ళు మొగజాతి కాదా?"
