అతనెక్కడికి వెళ్ళేడు !
ఒక సంవత్సర కాలంలో తన చూపులు పూలజల్లులా, తన మాటలు మంత్రాలుగా, తన మనస్సు ఒక దేవాలయం లాగా, తను ఒక దేవతగా కొలిచాడు. అందులో ఏనాడూ తనకి నటన కానీ అబద్ధం కానీ కనిపించలేదు.
ఒక అచ్చమైన ప్రేమికుడు, ఒక అచ్చమైన భక్తుడు, ఆరాధకుడు కనిపించాడు. మరి యీనాడు?
అతన్లో లోపం వుందా? తనలో దోషం వుందా? తన అంచనాలో ఆచరణలో తప్పొచ్చిందా?
అతనెక్కడికి వెళ్ళినట్టూ?
తల బరువెక్కి పోతున్న ఆలోచనతో అలా విదిలించి లేచి వెళ్ళింది. కాలకృత్యాలు తీర్చుకుని కాఫీతాగి స్నానం చేసి టాయ్ లెట్ అయి తిరిగ గదిలో కూర్చుంది.
చదువుకునేందుకి బుద్ధి పుట్టటం లేదు. కదిలించిన కందిరీగల తుట్టెలాగా ఆలోచనలన్నీ సారధి చుట్టూనే తిరుగుతున్నాయి.
ఆ పగలంతా పగతోనే గడిచిపోయింది. మధ్యాహ్నం భోజనం కూడా సహించలేదు. కానీ అత్తగారి పోరుతో అయిందనిపించింది.
ఆ రోజు సాయంకాలానికి తిరిగొచ్చాడు సారధి.
"వస్తూనే "అమ్మా" అని పిలుస్తూ వచ్చాడు. గేట్లో రిక్షా ఆగిన చప్పుడు వింటే ఆ పిలుపు వినిపించింది.
మూడు ఋతువుల నుండి వర్షాగర్జన కోసం వేచివుండే నెమలి ఆ ఉరుము వినగానే పురివిప్పి నాట్యం చేసినట్టుగా ఆ పిలుపు వినగానే చప్పున లేచి గది నుంచి బయటికి వచ్చింది వారుణి.
సారధిని చూడగానే ఆమె కళ్ళు మిల మిలలాడాయి.
"రధి_" పెదవులు అస్పష్టంగా కదిలాయి.
కానీ సారధి ఆమెవైపు చూళ్ళేదు. ఎదురుగా వచ్చిన తల్లివైపే చూస్తూ "అమ్మా! ఆకలిగా వుంది. ఏదైనా టిఫిన్ పెట్టు. అర్జంటుగా కాఫీ కావాలి. తర్వాత అలసటంతా తీరిపోయేట్టుగా స్నానం చెయ్యాలి. గీజర్ వెయ్యమని చెప్పు. అన్నట్టు ఇదిగో పదివేలు_ తీసుకో_ నేను తేలేననీ, తేననీ అనుకున్నావు కదూ. నీ కొడుకు నీకు చిన్నవాడే కానీ బయటి ప్రపంచంలో పెద్దవాడేనమ్మా."
ఆ మాటలు వారుణి వినాలనే అన్నట్టుగా అన్నాడు.
సుబ్బరత్నమ్మ ముఖం వికసించింది. "డబ్బుతో నాకేం పని బాబూ! మీ నాన్నగారికి యివ్వు. నిన్ననగా వెళ్ళేవు. ఎక్కడికి వెళ్ళేవో ఏమో అని నిన్ను గురించి ఎవరయినా అనుకున్నారా? ఆందోళన పడ్డారా? అయినా అలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? ఎంత అర్జంటు పనయితే మాత్రం నాతో కాకున్నా మీ ఆవిడతోనయినా ఒకమాట చెప్పి వెళ్ళరాదూ! పాపం! వారుణి నీ గురించి ఎంత బెంగపెట్టుకుందని_ సరే! సరే! పద ముందు టిఫిన్ చేద్దువుగానీ_"
ఆమె ఎవరిని వుద్దేశించి ఆ మాటలు విసరిందో వాళ్ళకి సూటిగానే తగిలాయి అవి.
వారుణి ముఖం సిగ్గుతో అవమానంతో ఎర్రబడింది.
కానీ సారధి అటు చూళ్ళేదు.
"ఎన్నో పనులుంటాయి. ఎక్కడికెక్కడికో వెళ్ళిరావాలి. అవన్నీ చెబుతూ కూర్చుంటామా?" అన్నాడు.
ఆ మాటలు ఆమె మనస్సుని మరీ గాయపరిచాయి.
అతను తల్లి చేతికి డబ్బు అందించి గొర్రెలా ఆమె వెనుకే వెళుతుంటే చూస్తూ వుండిపోయింది వారుణి.
29
రాత్రి తొమ్మిది గంటలకి కానీ గదిలోకి రాలేదు సారధి. అంతసేపూ అతను వారుణిని తప్పించుకునే తిరిగాడు. తండ్రితో తల్లితో కబుర్లు చెప్పాడు.
అసహనంగా కూర్చునుంది వారుణి. ఆమెకి అతనితో బాగా పోట్లాడాలని వుంది, రాజీపడాలనీ వుంది. క్షమాపణ వేడితే తిరిగి క్షమాపణ వేడుకోవాలనీ వుంది. ఇతమితమని తేల్చుకోలేని మనస్సుతో గాబరాగా వుంది.
పదిగంటలకి నారాయణ, ఫణి అక్కడినుంచి లేచిపోయాక మరికాస్సేపు ట్యూబ్ లైట్ ని, హాలులోని సోఫాలనీ, తిరుగుతోన్న ఫాన్ నీ గమనిస్తూ అలాగే కూర్చున్నాడు సారధి. అతనికి సెకండ్ షోకి వెళ్ళాలనిపించింది. మరో మూడు గంటలు_వారుణి ముఖం తప్పించుకోవచ్చు.
