Previous Page Next Page 
నేను పేజి 60


    "ఏం చేస్తావు? నన్ను హత్య చేస్తావా?"


    "నాకు నేను హాని కల్గించుకునే పని చెయ్యను. నీమీద కేసు పెడతాను."  


    "ఏమని? రేప్ చేశాననా?"


    "అవును."


    "నీకు లజ్జా, అవమానం.... ఇలాంటివేవీ లేవూ? నలుగురిలో అల్లరిపాలు అవుతూన్నందుకు నీ తల కొట్టేసినట్లుగా ఉండదూ?"    


    అవేమిటో నీక్కూడా రుచి చూపించాలి. ఈ లోకంలో హీరో అనుకున్నవాడంతా నరకమనుభవించి తీరాలి."


    "అది నువ్వనుకూన్నంత తేలిక్కాదు. ఈ లోకంలో న్యాయానికెప్పుడూ న్యాయం జరగదు. నాలాంటి హీరోలకెప్పుడూ కెదురుండదు."  


    "ఆ అహమే అణిచి పారేస్తాను. ఏమన్నావు? న్యాయానికెప్పుడూ న్యాయం జరగదని కదూ. ఈ విషయం నీకంటే నాకే ఎక్కువ తెలుసు. అందుకే అన్యాయాన్ని అన్యాయంతోనే ఎదుర్కొంటాను."


    "నువ్వు ఓ కొండతో ఢీ కొంటున్నావు. కోర్టంటే ఏమనుకుంటున్నావు? లాయర్లు, ఫీజులు. నేను డబ్బుతో ఏమన్నా కొనగలను."


    "నేను శక్తితో కొనగలను."


    "చూద్దాం. ఛాలెంజ్."


    "నీలాంటి అల్పుడితో నేను ఛాలెంజ్ మాటల్తో చెయ్యనురా చేసి చూపిస్తాను రా" అంటూ బయటికొచ్చేశాను.


                                   24


    సురేంద్రపై నేను పెట్టిన క్రిమినల్ కేసు రాష్ట్ర వ్యాప్తంగానే గాకుండా, దేశ వ్యాప్తంగానే పెద్ద సంచలనం కలిగించింది. నైతికంగా నన్ను బలపరుస్తామంటూ అనేక ఉత్తరాలొస్తున్నాయి. ఒకరోజు శమంతకమణి వచ్చింది.


    "మునుపటి కన్నా ఎంతో అందంగా, గొప్ప వర్ఛస్సుతో వెలిగిపోతోంది.


    నవ్వి ఊరుకున్నాను.


    "నీకు జరిగిన సంఘటన గురించి ఒక కోణంనుంచి కేర్ చెయ్యటం లేదనీ, ఇంకో కోణం నుంచి చాలా సీరియస్ గా తీసుకుంటున్నావనీ తెలుసు. నువ్వు సృష్టించిన సంచలనం తక్కువదేం కాదు. ఇది నీ జీవితంలోకి దూసుకొచ్చిన అద్భుతమైన మలుపు. ఇప్పటికైనా నాతో చేయి కలుపు. మంచిలోంచి కన్నా చెడులోంచి పైకి రావటం తేలిక. ఈ సంఘటన్ని మన కనుగుణ్యంగా మలుచుకుని నిన్ను దేశంలోనే గొప్ప హీరోయిన్ని చేస్తాను" అంది.


    "క్షమించండి. నేను ఒంటరిగానే పోరాడదలిచాను."       


    "సతీ! నీకెందుకంత అహంకారం?"


    "ఇది అహంకారం కాదు. వ్యక్తిత్వం."


    "సతీ! నువ్వెలాగూ చెడగొట్టబడ్డావు. ఈ చిన్న వయసులోనే భయంకరమైన ఎదురు దెబ్బలు తిన్నావు. ఈ మనుషులమీద, ప్రపంచం మీద నీకు కసి ఏర్పడటం లేదా? వీళ్ళని చెండుకు తినాలనిపించటం లేదా?"    


    చెడిపోవటం, చెడిపోవటం, చెడిపోవటం.... ఈ మాట నా చెవుల్లో హోరెత్తిస్తోంది. గుండెని నరికి ముక్కలు చేస్తోంది. అర్థం తెలీకుండా ఉపయోగించబడుతూన్న ఈ మాట! నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నాలో కసి ఉంటే అది వ్యక్తిగతం. ఈ ప్రపంచం మీదకాదు, మనుషులమీద కాదు. మనుషులంతా వక్రగుణాలు కలవాళ్ళే. నాతో సహా. ఈ లోకంలో 'పదా'లున్నాయి. అర్థాలు లేవు. ఆచరణలు లేవు. ఉదాహరణకు : 'శాంతి' అనే పదం తరుచు ఉపయోగించబడుతూ ఉంటుంది. దాన్ని గురించి రాజకీయ నాయకులు, వక్తలు, ప్రవక్తలు, యోగులు, స్వామీజీలు ప్రవచిస్తూ ఉంటారు. అదెక్కడుంటుందో ఎవరికీ తెలీదు, శాంతికోసం అన్వేషిస్తూ మనిషి అంతకుపూర్వం కొంచెమో గొప్పో ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటాడు. నాక్కావల్సింది 'ఈ క్షణం....' ఈ క్షణంలో నాలో ఉప్పొంగుతూన్న భావన. సంఘటన.... దీనికి జీవితం మీద అత్యంత ప్రభావముంది. అది చాలా బలమైంది. సంఘటన ఓ సిద్ధాంతం కాదు. యిజం కాదు. అదో శాసనం. వక్రలిపిలో అదో అక్షరం. వికృతాక్షరం కావచ్చు. అమృతాక్షరం కావచ్చు. దాని చుట్టూ కొంత దుర్గంధమో, సుగంధమో వ్యాపించి ఉంటుంది. అదేదో నన్ను తేల్చుకోనివ్వండి. మీ జోక్యమవసరం లేదు. ఒంటరిగా సాధించలేనని తెలుసు. కొంతమంది సాయమవసరం రావచ్చు. కాని మీ జోక్యం వద్దంటున్నాను. ఎందుకంటే కొంతమంది జోక్యం క్షిపణిలా దూసుకొచ్చి, మనల్ని శాసిస్తూ ఉంటోంది. అయోమయంలో పడేసి తను కైవసం చేసుకుని ఎటో తీసుకుపోతుంది. నేనేమిటో నాకు తెలియాలి. నాకు నేను కావాలి. భావదాస్యం, జీవితదాస్యం నాకు రుచించవు. ప్లీజ్! నాదార్న నన్ను పోనివ్వండి. ఇంకా కొన్ని మలుపులొస్తాయని తెలుసు. ఎప్పటికైనా ఓ నక్షత్రంలా ప్రకాశిస్తాననీ తెలుసు. కాని మీ ప్రభావం నామీద పడనివ్వకండి. ఓ స్నేహితురాలిగా రండి. శాసనకర్తగా కాదు. వెళ్ళిరండి.


    చేతులు జోడించి నమస్కారం చేశాను.


    నా వంక చూస్తూ కొంతసేపు నిలబడి పోయింది. ఆమె కళ్ళలో విస్మయం తెలుస్తోంది.       


    ఇద్దరాడ వాళ్ళొచ్చారు. ముప్పయి ముప్పయి అయిదేళ్ళ వయసులో షుమారైన అందంతో ఉన్నారు. కట్టు, బొట్టు సంప్రదాయ బద్ధంగానే ఉన్నాయి. గాని ముఖాల్లో మాత్రం అహంకారం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.    


    "మేము రచయిత్రులం. ఎక్కువగా కవిత్వం రాస్తూ ఉంటాం" అన్నారు.


    మర్యాదగా "కూచోండి" అని "ఏదీ ఓ గేయం వినిపించండి" అన్నాను కుతూహలంగా.     


    ఒకామె గొంతు సవరించుకొని పాడటం మొదలుపెట్టింది.


    "ఆడదంటే ఏమిటనుకున్నావు?"


    మొగాడి చేతిలో మెలికలు తిరిగే కీలు బొమ్మా!  


    జీవితాంతం వంటచేసే వంట మనిషా?


    అడుగడుక్కి కాఫీలిస్తూ, ఇల్లు క్లీన్ చేసే బానిసా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS