Previous Page Next Page 
రాగోదయం పేజి 60


    సూటిగా ఆమెవైపు చూశాడు చౌదరి.
    అతని ధైర్యానికి విస్తుపోయిందామె.
    ఆమెకి నోట మాట పెగల్లేదు. క్షణకాలం గడిచింది.
    "వీడే వీడే వీడి మనుషులతో యిప్పుడే మా యింటి నుంచి వెళ్ళిపోయాడు. నాపై దౌర్జన్యం చేయబోయాడు. నా తమ్ముడిని వీడి మనుషులే చంపారు. వీడిపై కేసు పెట్టండి."
    ఆ మాటలన్నీ అన్నాననే అనుకుంది భార్గవి. కానీ అనలేదు. ఆమె నిశ్చేష్టురాలై నిలువు గుడ్లేసుకుని చూడసాగింది.
    "పాపం చిదానందం గోవులాంటి మనిషి. ఎవరు చేశారో యీ దుర్మార్గం!" అప్పుడే వచ్చిన శేఖర్ అన్నాడు.
    భార్గవి ఆశ్చర్యానికి "అంతులేదు. మరీ యింత ఘాతుకమా?" ఈ వూళ్ళో మనుషులకి రక్షణ లేదు. వీళ్ళు ఎలా ఆడితే అలా ఆడాలి. భగవాన్ ఈ గ్రామాన్ని ఈ రాబందుల నుంచి కాపాడు."
    "నీకెవరి మీదన్నా అనుమానం వుందామ్మా ?"
    కరణం మాటలకి జవాబు యివ్వలేదు ఆమె.
    "మామా! పిలిచాడు శేఖర్. ఈ సంగతి నేను విని యిటుగా వస్తుంటే స్వామీజీ గాభరాగా అటు పెడుతున్నాడు. అతనేనేమో అడగండి."
    వాడి ధైర్యానికి చొరవకి విస్తుబోయాడు "శభాష్!" అనుకున్నాడు.
    "స్వామీజీనా" ఆశ్చర్యంగా అడిగాడు మునసబు.
    "అవును మామా! రెట్టించాడు శేఖర్.
    "సరే! రిపోర్టు రాద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. పోలీసులున్నారు కదా!" అన్నాడు మునసబు.
    ఆ మాటలకి ఎవరూ ఏమీ అనలేదు.
    రిపోర్టు తయారుచేశాడు మునసబు.
    "పోలీసులు వచ్చేదాకా శవాన్ని కదిలించవద్దు. వాళ్ళొచ్చినాక శవ పంచాయితీ జరిపించి దహనం చేయిద్దాం. మీరందరూ బయటికి రండి! తలార్లు కాపలా వుంటారు!" అన్నాడు మునసబు.
    అందరూ ఒక్కరొక్కరే వెళ్ళిపోయారు.
    ఆఖరికి భార్గవి, ఆమె అత్తయ్య మిగిలారు. తలార్లు శవాన్ని కాపలా కాస్తూ వుండిపోయారు.
    అప్పుడు వచ్చాడు సోము. వాడి వెనకాల జయన్న కూడా వచ్చాడు. వాడికీ విషయం యిప్పుడే తెలిసింది.
    "ఎంత ఘోరం జరిగిందమ్మా!
    వాడిని చూడగానే ఆమె గుండె కదిలింది. గొల్లుమంటూ ఏడ్చింది. "సోమూ! చూడ్రా ఎంత అన్యాయం జరిగిందో! తమ్ముడిని పొట్టన పెట్టుకున్నార్రా! నాపై దౌర్జన్యం చేయబోయినారు. నా యిల్లు దోచుకోబొయినారు. అడ్డుపడితే తమ్ముడిని నా యెదుటే పొడిచి పొడిచి చంపినారు. ఇక మేము ఈ వూళ్ళో బతికేదెట్లారా? మేం బతకలేంరా! రేపు నన్ను హింసిస్తారు. చెడగొడతారు. చంపుతారు. మాకు దిక్కెవర్రా?" అంతదాకా నోరు విప్పలేని ఆమె ఆత్మీయుడు లాంటివాడిని చూడగానే చెప్పుకుంది.
    నిర్ఘాంతపోయా రిద్దరూ.
    "పోలీసు రిపోర్టు పంపించలేదామ్మా?"
    తలూపింది భార్గవి. "స్వామీజీపై కేసు రాయించారు వాళ్ళే! ఎంత ధైర్యంరా? ఖూనీ చేసి వెళ్ళి మళ్ళా అక్కడికే వచ్చి కేసు రాయించార్రా! ఎంత గుండెలు తీసే మనుషులురా వీళ్ళు"
    "ఎవరమ్మా?"
    "వాళ్ళేరా! చవుదరీ వాడి తమ్ముడు జనార్ధన్ వాడి మనిషి, శేఖర్ నలుగురూ వచ్చార్రా. శేఖర్ పొడిచాడు!"
    "ఆ విషయం చెప్పలేకపొయినారా?"
    "భయం_ దిగ్భ్రాంతి_ వాళ్ళ చొరవకి ధైర్యానికి ఆశ్చర్యంగా_ నా మనసు మొద్దుబారి పోయింది. నోరు కట్టేసినట్లయింది."
    "ఇప్పుడు పోలీసుల కోసం మనిషి పోయినాడా?"
    "ఆఁ"
    "రాగానే అంతా చెప్పండి!"
    "ఉహు? లాభంలేదు. వాళ్ళు మనమాట నమ్మరు. నలుగురు పెద్ద మనుషులు మధ్య అంతమంది ముందు స్వామీజీ పై కేసు రాస్తోంటే నేను ఏమీ అనలేదు. ఇప్పుడిక చెబితే కథ యిలా అల్లుకున్నానంటారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS