వాళ్ళిద్దరూ ఏం మాటాళ్ళేదు.
"ఏం చేయాలిరా? నాకు భయంగా వుంది!"
"భయపడకండమ్మా! నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకి కూలిపోతుంది. వీళ్లకి పోగాలం దాపురించింది!"
"ప్చ్!" నిట్టూర్చింది.
నిశ్శబ్దంగా ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ అలాగే కూర్చున్నారు వాళ్ళు.
* * *
తెల్లగా తెల్లారకముందే దిగారు పోలీసులు. హత్యానేరం అంటే వాళ్ళకి కాళ్ళు నిలవ్వు. రాగానే మునసబు, చౌదరి మాటలు విని చౌదరి యింట్లో పడుకుని వున్న స్వామీజీని శిష్యురాలిని అరెస్టు చేశారు. తర్వాత శవం దగ్గరికి వచ్చారు. పంచాయితీ జరిపారు. పోస్టుమార్టంకి భార్గవి ఒప్పుకోలేదు. అందుకని వివరాలన్నీ రాసుకున్నారు. పుష్టిగా చౌదరి యింట్లో భోజనం చేసి అతనిచ్చిన దక్షిణ తీసుకుని జీపులో స్వామీజీని ఎక్కించుకుని వెళ్ళిపోయారు. పాత హత్యానేరానికి కాదు. కొత్త హత్యానేరం బనాయించారు. స్వామీజీకి యిదేమీ తెలియదు. ఏమరుపాటున దొరికిపోయానని బాధపడ్డాడు.
అయితే గ్రామంలో మాత్రం సోము చెప్పిన కథే బాగా ప్రచారమైంది. దాంతో అందరికీ చౌదరంటే విపరీతమైన భయం పట్టుకుంది. పులిని చూసినట్టు, పాముని చూసినట్టు భయపడసాగారు. ఊర్లో భద్రత లేక ప్రభుత్వం అండ లేక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. భార్గావికి మాత్రం రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. ఈ ఉచ్చు నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు.
29
దాదాపు నెల రోజులు గడిచాయి.
పెద్ద తలకాయలందరికీ విశ్రాంతి లభించినట్లయింది. దాంతో వాళ్లకి పాతపగలు గుర్తుకొచ్చాయి. పొలం పనుల సమయంలో కూలీలంతా ఎలా కట్టుదిట్టంగా వ్యవహరించిందీ తమంతవాళ్ళని ఎలా ముప్పుతిప్పలు పెట్టిందీ బాగా గుర్తుకొచ్చి ప్రతీకారవాంఛ బయలుదేరింది.
"ఇదో! యిలా అయితే మనం కాపురాలు చేయలేం! ఎట్లాగైనా ఆ సోముగాడిని ఆ జయన్నగాడిని లొంగదీసుకోవాలి!"
"ఎట్లా చౌదరీ !"
"ఎట్లేముంది నాయుడూ ? నాలుగు తగిలిస్తే సరి! కుక్కలా పడి వుంటారు!" అన్నాడు శేఖర్.
"అదంతా సులభమా ?"
"కాకపోతే కష్టమంటావా ?"
"అవును!"
"నీ ముఖం. నీకేం తెలుస్తుంది. కొరడా తీసుకుని చచ్చేట్టు బాదితే సరి. దిమ్మతిరిగి కాళ్ళదగ్గరి కొస్తారు"
"ఊహుఁ అట్లాగా ! చూద్దాం పట్టండి"
"ఏమిటి చూసేది నీ ముఖం? ఏదో దగ్గరికి రానిస్తే నువ్వూ పెద్ద మొనగాడిననుకుంటున్నావ్? మా వ్యవహారాలు నీకేం తెలుస్తాయ్?" చీదరించుకున్నాడు మునసబు.
శేఖర్ ముఖం ఎర్రగా అయింది. అవమానం జరిగినట్టుగా ఫీలయ్యాడు. అది గమనించాడు చౌదరి. "మనలో మనకు కొట్లాటలెందుకు? ముందు వాళ్ళని లొంగదీద్దాం!" అన్నాడు.
"అదీ సరైన మాట !"
"ఈ విషయంలో కారణం వుంటే ఏం సలహా యిచ్చేవాడో !"
"ఇంకెక్కడి కరణం వెంకటేశ్వరస్వామి సొమ్ము దొంగిలించబోయిన రోజే మతిపోయింది. ఎవరేం అడిగినా కోతి అంటాడు తప్ప మరో మాటరాదు. కళ్ళు మూసినా కోతే, తెరిచినా కోతే! భార్యని చూసినా బంధువులని చూసినా కోతి కోతి అంటాడు. తిండి తినడు. నిద్రపోడు. తనకయి తానుగా ఏదైనా తీసుకు తింటాడు అంతే" చెప్పాడు శేఖర్.
"పాపం!"
