Previous Page Next Page 
రాగోదయం పేజి 59


    మెల్లిగా మంచం దగ్గరికి వెళ్ళిచూసి, చప్పున పక్కనే కూర్చున్నాడు చౌదరి. నిద్రలో కొద్దిగా కదిలింది భార్గవి.
    మెల్లిగా తన చెయ్యి ఆమె వక్షోజాలపై వేశాడు.
    దెబ్బతిన్న తాచుపాములాగా లేచింది భార్గవి.
    ఎదురుగా మంచంమీద కాలరాక్షసుడిలా కూర్చున్న చవుదరిని చూడగానే ఆమె భయపడింది. అయితే క్షణంలో తేరుకుని వెంటనే అతడిని మంచంపై నుండి తోసింది.
    "ఛీ! దుర్మార్గుడా! ఎంతకి తెగించావు ? ఇంత పాపానికి ఒడిగడతావా? నిన్ను నలుగురిలో సిగ్గు తీయకపోతే అడుగు పద! వెంటనే బయటికి వెళ్ళిపో!"
    విషంగా నవ్వాడు చవుదరి. నేను వెళ్ళటానికి రాలేదు. మర్యాదగా లొంగిపో. అది నాకూ నీకూ మంచిది. నువ్వు బాగుపడతావు. సుఖపడతావు. ఈ విషయం ఎవరికీ తెలియదు.
    "ధూ ! సిగ్గులేదూ అలా అనటానికి ?"
    ఆమె యింకా నోరు చేసుకోబోతూ వుంటే చప్పున నోరు మూశాడు చవుదరి. తను అనుభవించటానికి వచ్చాడు. అంతేకాని నీతి వాక్యాలు వినటానికి రాలేదు. ఊరికే సమయం వృధా చేయటం ఎందుకు? అనుకుని తన బలిష్టమైన చేతుల్లో బంధించాడు.
    గింజుకుంటోంది భార్గవి. ముఖాన వూస్తోంది. నిర్లక్ష్యంగా చేతులు విసుర్తోంది. అయినా చౌదరి తన ప్రయత్నం మానలేదు. ఆక్రమించుకునే ప్రయత్నంలో వున్నాడు.
    అక్కడికి వచ్చిన శేఖర్ వాకిట్లో నుంచుని చూడసాగాడు. అతని మనసులో కోపం సంతోషం రెండూ వున్నాయి.
    కెవ్వున కేక వేసింది భార్గవి.
    అవతలి గదిలో ఎంత ప్రయత్నించినా బీరువా తెరవలేకపోతున్న జనార్ధన్, తిమ్మన్న ఆ కేక విని బయపడ్డాడు. ఆ కేకకి అదే గదిలో పడుకుని నిద్రపోతున్న చిదానందం లేచాడు.
    ఆ మసక వెలుతురులో బీరువా సమీపంలో ఎవరో నుంచున్నట్టు కనిపించి గాభరాగా ఎవరు? ఎవరు? అంటూ కేక వేశాడు. ఆ కేకలు విని చప్పున గది నుంచి బయటికి వచ్చారు. ఇద్దరు అది చూసి మంచం మీద నుంచి చప్పున దూకాడు చిదానందం.
    వాళ్ళిద్దరికి వాకిట్లో నుంచున్న శేఖర్ కనిపించాడు. కొద్దిగా భయపడినా శేఖర్ ని గుర్తించిన జనార్ధన్ ధైర్యంగా అటే వచ్చాడు.
    "ఓహో! రెండు పనులకి వచ్చారన్నమాట! అనుకున్నాడు శేఖర్ వాళ్ళని చూడగానే. అంతలోనే రివ్వున పరిగెత్తుకొచ్చాడు చిదానందం. వీళ్ళపై దూకేడు. ఎడాపెడా బాదసాగాడు.
    ఈ అల్లరికి చౌదరి భార్గవిని వదిలేసి అటు చూశాడు. శేఖర్, చిదానందం, జనార్ధన్, తిమ్మన్న హోరాహోరీ కొట్టుకుంటున్నారు.
    "అడ్డు తప్పించండి. వెళ్ళిపోదాం!" అరిచాడు చౌదరి.
    భార్గవి అయోమయంగా చూడసాగింది.
    శేఖర్ బొడ్డులోని కత్తి తీసి చప్పున పొడిచాడు. కెవ్వుమన్నాడు చిదానందం. అంతే దెబ్బపై దెబ్బ. పోటుపై పోటు. కళ్ళు మూశాడు చిదానందం. నేలకొరిగిపోయాడు.
    కెవ్వున కేక వేసి అటుగా వచ్చింది భార్గవి.
    "దీన్ని పొడిచెయ్యనా ?" అడిగాడు శేఖర్.
    "చేసిన ఘనకార్యం చాలుగాని వెళదాం పదండి !" రివ్వున పరిగెత్తాడు చౌదరి. ముగ్గురూ అనుసరించారు. ఎవరికంటా పడకుండా పరిగెత్తారు యింటి వైపు.
    తమ్ముడు చిదానందంపై పడి గోడు గోడున విలపించసాగింది భార్గవి. ఆ ఏడ్పులకి లేచివచ్చి పరిస్థితి చూసిన ముసలమ్మకి మతిపోయినట్లయి కేకలు పెట్టసాగింది.
    ఆ కేకలకి యిరుగు పొరుగు లేచివచ్చి దీపాల వెలుగులో పట్టపగల్లా వుండి హత్య చేయబడిన చిదానందాన్ని చూసి ఎవరిమట్టుకు వాళ్ళు తోచినట్టు వ్యాఖ్యానాలు చేయగలిగారు. మెలమెల్లగా వార్త కారు చిచ్చులా వ్యాపించింది.
    ఒక్కరొక్కరే గుమిగూడసాగారు.
    ఆఖరికి సర్పంచ్ నాయుడు, కరణం, శేషయ్య, మునసబు, రెడ్డి, చౌదరి కూడా వచ్చారు.
    "రిపోర్టు చేద్దాం !" అన్నాడు చౌదరి.
    తలెత్తి చూసింది భార్గవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS