అదా గొప్పదనం!
హెచ్చు తగ్గు అని అనుకోకుండా భార్యని సమానంగా చూసే పురుషోత్తముడే వుండడా!
ఎందుకిలా అయిపోతున్నాయి యీ సంసారాలు! శాంతిలేక, సామరస్యం లేక...
"వారుణీ_"
అత్తగారి పిలుపుకి ఆలోచనలనుంచి బయటపడి గదిలోంచి బయటికి వచ్చింది.
"అలా వున్నావేం ?"
అత్తగారి కంఠంలోని ఆప్యాయతకి ఆశ్చర్యపోయింది. కాపురానికి వచ్చిన యిన్ని రోజులలోనూ ఏనాడూ ఆవిడ కంఠంలో యీ మార్దవం లేదు.
జవాబివ్వలేదు.
"భోంచేద్దాం రా! మీ మామగారు, ఫణి భోజనాలు చేశారు."
"సారధి కూడా భోంచేశాడా?" అనుకుంది వారుణి.
"సారధి ఊరెళ్ళాడు." ఆమె మనస్సు గ్రహించినట్టుగా అంది సుబ్బరత్నమ్మ.
"ఊరెళ్ళారా?" ఆశ్చర్యంగా అడిగింది. "తనతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళేడు? ఏమిటి పని?"
"అవును, ఏదో అర్జంటు పని అని వెళ్ళాడు_రా! భోంచేద్దాం" సావిత్రి వడ్డించి కూర్చుంది.
"నాకు ఆకలిగా లేదత్తయ్యా!" పొడిగా అంది వారుణి. "అన్నీ కొత్త అనుభవాలు. జీవితంలో ఎన్నడూ ఎరుగని అనుభవాలు ఇంకా ఎన్ని రుచి చూడాలో?"
"అదేమిటమ్మా! శుక్రవారం పూట అలా అభోజనంగా వుండకూడదు. రా! నాలుగు మెతుకులు ఎంగిలి పడిపోదువు కానీ_" ఎక్కడలేని ఆప్యాయతా వర్షించిందామె.
"శు_క్ర_వా_ర_మా_" తనలో తను అనుకున్నట్టుగా అంది. పెళ్ళయిన తర్వాత ప్రతి శుక్రవారం తమకు ఒక దివ్యవరం లాగా గడిచిపోయింది. చిన్నా! శుక్రవారం ప్రతి ముత్తయిదువూ ఒక లక్ష్మీదేవి! భార్యలో దేవీ స్వరూపాన్ని చూడాలి భర్త. అప్పుడే ఆమె ఇల్లాలై గృహలక్ష్మి అయి వరాలు వర్షిస్తుంది. సుఖడోలికల్లో తేలి ఆడిస్తుంది. చిన్నా! ప్రసన్నురాలైన స్త్రీ భర్తకి ఎంత ఆనందాన్నిస్తుందో నీకు తెలీదా? అందుకే భార్యని ప్రసన్నం చేసుకోవాలి ఎప్పుడూ! కనీసం శుక్రవారం నాడు! తలంటు పోసుకుని కురుల్ని అలా విడిచేసి తడి ఆరపెట్టుకుంటూ వున్న భార్యని చూస్తే కలిగే ఆనందం తాజమహలుని దర్శించినప్పుడు కూడా కలగదు వరూ! మగవాడిని కటాక్షించటానికి దేవత అలా స్త్రీ రూపంగా భార్యగా, తల్లిగా వచ్చింది. ఆ దేవతా మూర్తిని ప్రసన్నం చేసుకోవాలి మగవాడు. అప్పుడే ఆ దాంపత్యం నవ నవోన్మేషణమైన ఆనందాన్ని పొందుతుంది." ఒకరోజు తన ఎదపై తలదాచుకుని సారధి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆ క్షణంలో.
దాంతో మనస్సు పూర్తిగా పాడైపోయింది.
"రామ్మా"
"వద్దత్తయ్యా! బొత్తిగా ఆకలి లేదు"
"నీ యిష్టం. పోనీ యిన్ని పాలైనా తీసుకో. నిండింట్లో అలా విట్రుపవాసం వుండకూడదు" అని వెళ్ళిపోయింది సుబ్బరత్నమ్మ.
వారుణి తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది.
మరో అయిదు నిముషాలకి పద్మ పాలు గ్లాసు తీసుకుని వచ్చి టేబిల్ పై పెట్టిపోయింది.
కాని వారుణి వాటిని ముట్టుకోలేదు.
28
ఆ రాత్రంతా అలాగే ఆలోచనలతో తెల్లగా తెల్లారిపోయింది. వారుణి మనస్సు నిండా వేదన! తన అంచనా తప్పిందా! లేక భ్రమపడిందా! సారధిని బాగా "చదివా"ననుకుంది. అందులో తప్పిపోయిందా? తప్పుపోయిందా!
