అతని ముఖంలో, కళ్లలో అనూహ్యమైన మార్పులొస్తున్నాయి.
నా బెడ్ కు కొంచెం దగ్గరగా వచ్చి నిలబడి నా ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు.
అతని కళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి.
"ఆ రోజే చెప్పాను. నా కన్యాయం జరిగిందని అనుకుంటే నేనంటూ ఉండనని.... నీ వంటి మీద ఇంకోడి స్పర్శ నేను భరించలేను.
ముందుకొచ్చి నా ముఖంమీదకు వొంగాడు. "ఆఖరి సారి...." అంటూ పెదవులు ముట్టు కొనబోయి ఆగిపోయాడు. "నో.... ఐ కాన్ట్"
ఏం జరుగుతుందో ఆలోచించుకునే లోపలే విసురుగా వెనక్కి తిరిగి ప్రక్క గదిలోకి వెళ్లి తలుపు భాడాల్న వేసేసుకున్నాడు.
గుండె అదిరిపోయినట్లయింది.
అతి ప్రయత్నం మీద లేచి కూర్చొని, అస్తవ్యస్తంగా ఉన్న చీరె సరి చేసుకున్నాను. కళ్లు తిరిగి పోతున్నా అలాగే నిలబడి ఒక్కొక్క అడుగు వేస్తూ తలుపు దగ్గర కెళ్లాను.
"సుకుమార్. సుకుమార్" తలుపు తడుతున్నాను.
లోపల్నుంచి ఏ సవ్వడీలేదు.
"సుకుమార్. ప్లీజ్! తలుపు తియ్యవూ?"
అయిదు.... పది నిమిషాలు గడిచిపోయినాయి. తలుపు తడుతూనే ఉన్నాను. ఏ జవాబు లేదు. ఇహ, ఏం చెయ్యాలో తెలీని స్థితిలో బయటి కొచ్చి, కాంపౌండ్ వాల్ దగ్గరికెళ్లి రోడ్డు మీద వెళ్లేవాళ్లని కేకేశాను.
పావుగంట తర్వాత తలుపు బ్రద్దలు కొట్టి చూసేసరికి, ఫ్యాన్ కు ఉరేసుకుని వ్రేళ్లాడుతూన్న సుకుమార్ శవం కనిపించింది.
* * *
ఒక రకం మొండితనమావహించింది. ఎవరి సాయమూ అడగలేదు. పోస్ట్ మార్టమ్ తతంగమంతా అయిపోయాక అంత్యక్రియల ఏర్పాట్లన్నీ ఒక్కదాన్నే చేసుకున్నాను.
స్మశానంలో సుకుమార్ శవం తగల బడుతూంటే శాలువా కప్పుకుని ఒక్కదాన్నే చూస్తూ నిలబడ్డాను.
అలాంటి పరిస్థితుల్లో మనిషి షాక్ లో వుండి దుఃఖాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాడు.
చీకటి పడింది. ఆ దగ్గర్లోనే ఇంకో శవం కూడా కాలుతూ ఉంది. దాని తాలూకు మనుషులు చేసే శబ్దాలతో ఆ వాతావరణమంతా నిండిపోయి ఉంది.
అంతవరకూ ఫిలాసఫీ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. దాన్ని గురించి ఎక్కువ తెలీదుకూడా.
నాకు తెలిసిందల్లా 'ఈ క్షణం....!' అనే దానికి విలువనివ్వటం కాసేపు గడిస్తే ఈ క్షణం అన్నది గతంలో కలిసిపోతుంది. అది ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
ఎదురుగా కనిపించేదాన్ని గురించి తక్కువ పట్టించుకుంటూ, కనిపించని దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి మధిస్తూ ఉంటాడు మనిషి. ఆ మధనమే ఫిలాసఫీగా రూపాంతరం చెందుతుంది.
శవం కాలటం చాలావరకూ అయిపోయింది.
"ఇహ మీరు వెళ్లిపోవచ్చు" అన్నట్లు చూశాడు. ఆ తతంగమంతా నిర్వహించిన మనిషి.
ఇంకా కొంతసేపు అక్కడ ఉండాలనిపించింది.
భుజంమీద ఎవరిదో చేయి పడేసరికి తల త్రిప్పి చూశాను.
మదన్ మోహన్.
"రండి. డ్రాప్ చేస్తాను" అన్నాడు.
23
లోపల కడుగుపెట్టేసరికి సురేంద్ర కుర్చీలో కూర్చుని డ్రింక్ తాగుతున్నాడు.
నన్ను గమనించి తల ఎత్తాడు.
కళ్ళూ కళ్ళూ కలుసుకున్నాయి.
"నిన్ననుభవించినందుకు నేను బాధపడటం లేదు. పడను కూడా కాని సుకుమార్ ఆత్మహత్య చేసుకున్నందుకు బాధపడుతున్నాను."
"సుకుమార్ ఆత్మహత్య చేసుకోలేదు. నువ్వు హత్య చేశావు."
"ఈ సంఘటన ఆధారంగా చేసుకుని నామీద హత్యానేరం మోపుదామని చూస్తున్నావా?"
"అలాంటి అడ్డదారులు నాకు లేవు. అతను చావటానిక్కారణం నువ్వు. అందుకని నువ్వు హత్య చేసినట్లే లెక్క."
"కావచ్చు. కాని జరిగిందాన్ని గురించి ఇద్దరం వాదులాడటం మానేసి ఓ పరిష్కారానికొస్తే మంచిది."
"ఏమిటా పరిష్కారం?"
"మనిద్దరం పెళ్ళి చేసుకుందాం."
"సురేంద్రా. నా గురించి నువ్వేమనుకుంటున్నావు?"
"నువ్వో అపురూప స్త్రీవని."
"స్త్రీ అనే మాట ఉచ్ఛరించకు. దానికర్థం మహా మహులకే తెలీదు."
కావచ్చు. నిన్నెలాగూ చెడగొట్టాను. సమాజంలో నీకో స్థానం కావాలి. నువ్వు నాకు కావాలి."
"సమాజంలో స్థానం. బోడిస్థానం, సురేంద్రా. నీకో నిజం చెప్పనా? అసలు సమాజమనేది లేదు."
"మన చుట్టూ ఉన్నది."
"సమాజ రూపం. అసలు సమాజమన్నది లేదు."
"ఏమిటన్నావు? నేను నీక్కావాలా? నీలాంటి అథముడికి ఆ అర్హత ఉన్నదనుకుంటున్నావేమిటి? ఇంకా ఏమన్నావు? నన్ను చెడగొట్టాననా? నీ బొంద. నన్ను చెడగొట్టడమేమిటి? నాకు తెలివి తప్పేలా చేసి ఓ రాత్రంతా నీ దరిద్రగొట్టు మొగతనం చూపిస్తూ అఘోరించినంత మాత్రాన నేనేదో చెడిపోయాననీ, నానుంచి విలువైనదేదో పోగొట్టుకున్నాననీ, జీవితం నాశనమయిందనీ బతకటానికి అనర్హురాలినై పోయాననీ అనుకోవటం లేదు. చెడు, చెడిపోవటం.... వీటి అర్థాలు నీలాంటి అల్పజీవులకర్థం కావు. అయితే ఎందుకు బాధపడుతున్నావంటారు! అమాయకమైన సుకుమార్ నీవల్ల ప్రాణాలు పోగొట్టుకున్నందుకు. నీ కర్హతలేని పని నువ్వు చేసినందుకు. అందుకు నువ్వు శిక్ష అనుభవించి తీరాలి."
