స్సేట్టున్ని, కాడి ఎత్తేసి ఒక్క వూపులో బండిని రోడ్డు కెడం పక్కకి లాక్కొచ్చాడు. ఆపాటి బరువు ఆడికో లెక్కా?
మల్లా ఎల్లి ముంత కూడా తెచ్చుక్కూకున్నాడు.
పోలీసు కళ్ళు సింతగ్గి అయినాయి.
"ఎరా! లేమ్మంటే నీక్కాదూ చెబుతూంట ?"
"ఎందుకు బాబూ?"
"స్టేషనుకి!"
మల్లీ రమ్మండంలో ఆడి వుద్దేసివేంటో ? ఒక్క అంటి గెల సాల్ధా?"అక్కడ నాకేం పని బాబూ? నువ్వెల్లిరా!"
"ఎంత పొగర్రా నీకు! వస్తావా రావా?"
"నా కీలు సిక్కదయ్యా! అయినా ఎందుకూ అంట? యా?" కొరుక్కుతినేవొళ్లా సూశాడాడు.
"బండి కుడి వైపు యిప్పలేదుట్రా?"
"ఇప్పుడేడం పక్క వుందిగా దొర!" బిక్క సచ్చాడాడు.
"ఇప్పుడే పోయి నిన్ను అరెస్టు చేయిస్తా నుండు!"
"ఓరబ్బ ! ఎవడంట ఆ సేసే మొనగాడు. ముందు తెలీక తప్పు సేత్తే మన్నించనం గావా? ఇప్పుడు సరిగా పెట్టినా టేసేనికి రమ్మంటావా? ఈ యేల తెల్లారేక నేను తప్ప నీ కింకేవుడూ దొరకలేదా పోలీసయ్యా?"
కోపం పట్టలేక ఆడు కర్రెత్తబోయాడు . కానీ, యీడు వోల్లూ, వొంపులు తిరిగిన కండలూ సూసి ఎనక్కి జంకాడు. ఈడు కాని తిరగబడితే , సరకారు కరుసు మీద నెల్లాళ్ళు ఆ సపటాల్లో వుండాలిసోత్తాది!
ఆ అదును కనుపెట్టి యీడూ సోరవ సేశాడు.
"పోలీసు బాబూ! నువ్వూ మంచోడివే, నేనూ మంచోడ్నే! ఒకల్ల జోలి కోకల్లు రాడం మంచిది కాదు.
"ఈ బెడ్డబ్బులూ తీసుకుని వోటేల్లో కుతింత కాఫీ తాగి ఏల్లు ! ఏం?"
కిక్కురుమనకుండా తీసుకున్నా డాడు.
"కరిసీ కుక్కకికడడ్డం!' అనుకున్నాడెంకన్న.
"మరి అంటి గులో?"
"ఇత్తాలే . మల్లీ సాలోచ్చినప్పుడు , నీకోసం మంచి అంటి గెల తెచ్చి యిత్తాలే."
పోలీసు ఎల్లి పోయాడు. సుట్టూ వున్న వొళ్ళు యిరగబడి నవ్వారు. ఆళ్ళ లోంచే వోడోచ్చి తన బుజంమీద సెయ్యేసి , ఆ సోరవ సూసి మా మెచ్చుకున్నాడు.
"మెల్లింగా బతిమాల్తే యింటారా యీళ్ళూ? అందితే జుట్టు అందకపోతే కాళ్ళూ! నీలంటోడి వీలు కదపటానికి యీళ్ళ తాతయ్యలు దిగి రావాల."
ఒక్క కల్లె ఎల్లిపోయారు. 'ఆడు' మట్టుక్కి అక్కడే నిలబడ్డాడు. అంటిగెల్లన్నీ ఒక్క సూపుతో ఎంచుతా వున్నాడు.
ముంత లో కూడు మల్లా తినడానికి ఎంకన్న మనుసు పోయింది కాదు. 'పట్నవొచ్చి కూడా గెంజి కూడూ తిండవెం కరవ ?' అనుకున్నాడు.
ఒన్నవంతా గొడార వొంచేసి కూలాయి కాడ ముంత కడుక్కున్నాడు.
'ఆడు' అక్కడే వున్నా డింకా.
"ఏ వూరు మన్దీ?"
"ఏం?"
"ఏం లేదు తమ్ముడో! వూరికే అడుగుతున్నా!"
"అలవూరు!"
"ఒరబ్బో! దూరమే! పేరెంటీ?"
"నాదా?"
"ఊ!"
"ఎంకన్న."
"అంటిగేల్లు అమ్మకానికి తెచ్చావా?"
"మరే."
"రేటెంత ?"
"బజారు ధర బట్టి సూత్తా!"
"నా కియరాదో?"
"కొంటావా?"
"కొనిపిత్తాను."
"ఫైవోల్లిచ్చీదానికి రొండబ్బులు ఎక్కువే ముట్ట సేబుతా." "సరుకు వాడింసేసి రేటు కాయం సేయడం లో మన్ని మించినోడు యీ పట్నం లోనే లేడు. పెద్ద పెద్ద యాపారస్తులందరికీ బేరాలు సేసి పెట్టడం మనవే! కొంతమంది దొంగేదవలు పల్లిటూరోల్లని మోసం సేయ్యాలని సూత్తారు. ఆళ్ళ కళ్ళల్లో పడ్డావో, నీ నోట్లో మన్నేసువా!"
సూసీ సూడనట్లు ఆడిమాట లింటన్నోడల్లా, సూత్తన్నట్టె అదిరి పడ్డాడు. ఆ వోలకం సూడ్డం తో ఆడికీ దయిర్నే వొచ్చినాది.
"సూడు తమ్ముడో! నీ మొగవు సూసి నిజం సెబుతున్నా. నువ్వు నా కిచ్చినా యియ్యాపోయినా నాకేం బాదలేదు. అయితే , అమ్మినప్పుడు మాత్రపు నలుగుర్నీ వోకబు సేసి మరీ అమ్ము! సరుకంతా వోపాలే ఏసుకెల్లావో, లోకూసేసి అయిన కాడికి కేసుగుంటారు. పట్నావోల్లంటే నీకింకా అనబం లేనట్టే వున్నాది . ఏవంటా?"
ఆడి మాటలన్నీ ఎంకన్న కి నచ్చినాయి.
"పాపం, మంచోళ్ళాగే కనిపిస్తున్నాడు! తన ముక్కూ మొగవూ తెలీనోడు గందా . పట్టానికి సరుకేసుకొని యాపారానికి కొత్తగా తను వొచ్చినోడు గందా , తనతో యింత సనువుగా మాటాడి వుపకారం సేత్తానన్నవోడు దొరకడం తన అదురుట్టం కాదో! ఆడ్నే నమ్ముకుంటే , పెద్ద పెద్దోల్లందరికీ తను తెలుత్తాడు. బిగినీసూ పెరుగుతాది. లచ్చలకి లచ్చలు గడించోచ్చు. అప్పుడు రవణయగాడికి తన్ని సూత్తే కళ్ళు కుడతాయి ! తనకోసం దేవుడే యీడ్ని పంపాడా?"
",ముందు కాపీ తాగొద్దాం! అనాక మాటాడుకుందాం" అన్నాడాడు.
"మరి బండో?"
"ఉరువురివినట్టు నవ్వాడాడు.
"ఇంత ఎర్రోడి వెంటి తమ్ముడో! ఇంత పెద్ద పట్నం లో మన బండి సూసీవోడే కరువా? కోయంటే కోటి మందోత్తారు!"
మాటంటుండగానే అది జతగాడెవరో ఎనక నించోచ్చాడు. బండి బద్రంగా సూత్తా వుండమని ఆడికి సేవులో సేప్పోచ్చాడు.
ఇద్దరూ కలిసి వోటేల్లో కేల్లారు. అక్కడ కాపీ తాగెటో ల్లందరికీ కురిసీ లేత్తారంట! ఇద్దరూ కూకున్నారు. రకరకాలేవో, తీపియీ, కారం యీ తెప్పించి యీడు వొద్దంటన్నా తినిపిచ్చా డాడు. బయటికొచ్చి ముందు, గుమ్మం కాడున్న బల్ల ముందర కూకున్న వోలావు పాటోడి దగ్గిరి కెల్లి, యిద్దరూ కలిసి తిన్నదానికి డబ్బులన్నీ ఆడే యిచ్చేశాడు.
ఎంత మంచోడు!
తన జేబీలో సిల్లర డబ్బు ల్లెనందుకు ఎంతో నొచ్చుకున్నాడు ఎంకన్న. ఎంత కరుసు అయిందో పాపం!
'తన డబ్బులు తనిచ్చేత్తే ? అంత తెగింపున్న వోడు తన దగ్గిర పుచ్చుగుంటాడా?' అప్పుడు యీడికే సిన్నదనం కాదో?
మల్లా బండి కాడికొచ్చీ దాకా ఆడు బేరం విసయమేం మాటాల్లేదు.
"మరి నే నెల్లోత్తా తమ్ముడో! కొనసీన నించి నాలుగు పడవల సరుకొత్తన్నాది. అర్జంటు గా ఎల్లి బేరవాడాలి. ఈలుంటే మల్లా కలుసుగుందార్లె!"
ఎంకన్న గుండి లోనికి దించుకు పోయింది. ఆడెల్లిపొతే తన యాపారవెల్లా? బెరాసారా లాట్టే తెలీనివోడాయే! సరుక్కి కరీ దెల్లా కడతారో? బజార్లో సరకంతా తనికి వోలాగే కనిపించినా దరలో తేడా ఎందుకుంటాది? ఒకడు ఓ రేటు పెడితే మిగిలినోళ్ళు యింకో దమ్మిడి కూడా ఎక్కువ పెట్టరేం? పాతోళ్ళయితే బేరం సేయకుండానే సరు కెల్లా కొంటారో? కొంతమంది ఎంటనే డబ్బియ్యరంట. సరుకు అమ్ముడయ్యాక తవరి లాబాలు తీసుకుని మద్దెలో పనిచేసే వొళ్ళకి ముడుపు సెల్లించి మిగిలింది యీలు న్నప్పుడు యిత్తారంట!
యాపారవంటే రావులమ్మ కాడ కవుర్లు సెప్పి నట్టా మరి? బిగినీసు సేసేవోళ్ళ బుర్రలె ఏరంట! ఆళ్ళు మాటాడినాటికి లచ్చ అరదాలుంటాయంట. మనం మాటాడిన దాని క్కూడా లచ్చ అరదాలూ తీతారంట! మరి యాపారవంటే అల్లా టప్పా యవ్వరవా?
పట్నవొళ్ళు అసలే మాయలోళ్ళు! ఇప్పుడాణ్ణి వొదులుకుంటే లాబం లేదనుకున్నాడు ఎంకన్న.
"ఎడుదూగాన్లె అన్నా! అంత తొందరేంటి? బండి కాడ కూకుని కాసేపు కవుర్లు సెప్పుకుందారి. సుట్ట కాలుత్తావా? మొదాటి రకం లంక పొగాకు!"
"సుట్టా?"
"ఆ మాటలో యిడ్డూరావున్నాది , ఈసడింపూ వున్నాది. సిత్రమయిన మందలింపూ , కుసింత జాలీ, మరింత ఎక్కిరింపూ!
"ఏం సుట్ట కాల్సవా?"
"ఉహు! సిగోరెట్టు కాలుత్తా!"
ఆడు బీడీ లైతే ఎరుగును. రొండు మూడు తడవలు కాలిసీ సూశాడు.
సిగరోట్లు రుసీ సూల్లేదు. దగ్గోత్తాదని బయం! అయిదొరలే కాలుత్తారంట . మన దేశ్యపోళ్ళ వొంటికి పడవంట!
అసలు పొగ తాగడవే పెద్ద జబ్బని బాలయ్య గారనీవోరు. సుట్ట ముక్క కొనుక్కోవాలంటే డబ్బు లిచ్చేవోరు కారు. పకోడీల కొసవంటే పావలా యిచ్చీవోరు!
సిగోరోట్ల కరీదెంతుంటాదో? కలకటేరు గోరు కాలిసీ వోటి రకం ఒకోటి ముప్పావళా అంట ! అల్లాగని తన సిన బామ్మరిది సేప్పాడు.
పుట్టి బుద్దేరిగాక సిగొరోట్లు ఎరక్కపోతే తనకే సిన్నదనం! పైగా! పట్నావులో యాపారం సెయ్యబోతున్నవోడు!
జేబీలోంచి సిల్లర కాన్లు తీసి సూసుకొని కిల్లీ కొట్టుకాడికి నడిశాడు.
సిగొరోట్లు రెండు కోనేసేసి , ఆడి కోటిచ్చి తనోటి అంటించుగున్నాడు.
మా మజాగా వున్నాది!
తెల్లోడి మాయ!
ఆడిలా సెక్రాలు యిదల్డం తనకి సేతకాదు! సుట్ట కాలిసీ నోడికి ఆ సిత్రాలెం తెలుసు?
ఏవయినా ఆడు తనకంటే నిజంగా సాలా గొప్పోడు! ఆడ్ని పట్టుకునే పని సేయించుకోవాలి!
'అయితే వూళ్ళో రేటు ఎల్లాగున్నాధన్నా?"
"బండి ఎబయి రూపాయలు."
"ఉరవ పెద్దయితే?"
"ఇంకో రూపాయేక్కువ."
"మరి అందులో మనకి లాబవెంటంట?"
అనువానిస్తానే అడిగాడు.
అది యిని ఆడూ నవ్వాడు. ఆ నవ్వు ఎంకన్నకీ తెలీలేదు.
పట్నం లో అలా గడక్కోడదేవో?
నోరు జారేశాడు. నాలిక్కోరుక్కున్నాడు.
మాట మారిశాడు.
"ఇన్ని సేప్పావు కానీ, నీ పేరు సేప్పేలేదు అన్నా!"
"బద్రయ్య."
"బద్రయ్యన్నా! నా బండి బేరం నీకే కాయం!"
బద్రయ్య ఉలిక్కిపల్లేదు. ఆడి కళ్ళల్లో మట్టుక్కు కొత్త ఎలుగోచ్చినాది. బుర్రలో ఏవాలోసన దోల్లిందో ఏవో, సటుక్కుని సిటికేశాడు. మీసం తడుం'కుని గట్టిగా దమ్ము లాగాడు. ఎంకన్న యీపు తట్టి సొగసుగా నవ్వాడు.
