Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 5

 

                                   3
    ఉత్తరం పత్తరం లేకుండా ఓ సాయంత్రం రైలు దిగి వచ్చిన రామకృష్ణ ని మొట్టమొదట చూసింది ఉమే-- పెద్దక్కయ్య పిల్లలకి కాగితం పడవలు చేసి ఇస్తూ వరండా లో కూర్చున్న ఆ అమ్మాయి, ఎవరో వచ్చిన అలికిడి అయి తల తిప్పి చూసి "అమ్మా బావొచ్చాడు" అంటూ తుర్రున లోపలికి పారిపోయంది.
    "ఏయ్ ఏమిటిది? కొత్తగా సిగ్గు పడటం నేర్చు కుంటున్నావు." అని అతను వెక్కిరిస్తున్నా వినిపించుకోకుండా.
    'ఇంక గుమ్మం లోకి వచ్చిన దగ్గర నుంచీ ఏవో వేళాకోళలు చెయ్యటం మొదలు కాబోలు,' కూతురి మాటలు విని వరండా లోకి వచ్చిన వర్ధనమ్మ గారు అంది సంబరంగా.
    "లేదత్తయ్యా -- నేనిప్పుడలాంటి వన్నీ మానేశాను బుద్ది మంతుడినయ్యాను." అన్నాడతను కుదురుగా కుర్చీలో కూర్చుని రుమాలుతో మొహం తుడుచుకుంటూ.
    లోపల గదిలో ఎక్కడో వున్న రమణమూర్తి గారు కామాక్షమ్మ గారు కూడా ఇవతలకీ వచ్చారు అతని మాటలు వినిపించి.
    'మంచి నీళ్ళు తీసుకు వస్తాను.' అని లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ గారు.
    'నాన్నగారి కేమిటి కులాసాగా వుండటం లేదని వ్రాశారు-- మందు పుచ్చుకుంటున్నారా ?' అంటూ కుశల ప్రశ్నలు వేసింది కామాక్షమ్మ గారు.
    "ముందుగా వుత్తరం రాస్తే స్టేషను కి వచ్చే వాడినిగా,' అన్నాడు రమణ మూర్తి గారు మేనల్లుడి ప్రక్కనే మరో కుర్చీలో కూర్చుంటూ.
    తెల్లబోయినట్లు తల తిప్పి చూసి "నాకిదెం కొత్త చోటా, నేనేం పరాయి వాడ్నా? ఈ మధ్య అంటే రావటం లేదు గాని నాలుగు రోజుల శలవలు వచ్చేసరికి రెండు జతల బట్టలు ఓ సంచిలో కుక్కుకొని వచ్చేసేవాడ్ని కదూ మర్చిపో యావాయెం?' అన్నాడతను.
    'మరిచి పోవటం కాదులే -- అప్పుడంటే వట్టి మేనల్లుడివి-- ఇప్పుడు కాబోయే అల్లుడివి.' అని సమాధానం చెప్పింది కామాక్షమ్మ గారు.
    అందరూ సరదాగా నవ్వుకున్నారు-- వర్ధనమ్మ గారి చేతిలోంచి మంచి నీళ్ళ గ్లాసు అందుకుంటూ 'నాన్నగారికి సుస్తీ ఏమిటని కదూ అడిగావూ-- ఆ మధ్య నాలుగు లంఖణా లు చేశారుటలే -- అప్పుడు నేను లేనూ-- ఇప్పుడు కులసాగానే ఉన్నారు-- అయినా ఆ వూళ్ళోనే కాస్త చల్లగా వుంటుందని వుండి పోయారు." అన్నాడు అమ్మమ్మతో.
    "ఖబుర్లు చెప్పుకుంటూ వుండండి. అయిదు నిమిషాల్లో కాఫీ పట్టుకు వస్తాను,' అని లోపలికి వెళ్ళిపోయింది వర్ధనమ్మ గారు- ఆవిడ అంతకు ముందే కుంపటి మీద నీళ్ళు పడేసి వచ్చింది.
    తను ఆఊరు వచ్చి మూడేళ్ళు కావస్తోన్న మాట నిజమే అయినా  అక్కడి వాతావరణం లో తను ఊహించని మార్పేదో వచినట్లు అనిపించింది రామకృష్ణ కి. అయితే ఆ మార్పు అక్కడిదా లేక తన మనసులో వుందా అని తనని తనే ప్రశ్నించుకుంటూ లోపలికి వెళ్ళాడు.
    మధ్య హల్లో గుమ్మం వార నిలబడిన సురేఖ అప్రయత్నం గానే ఒక్క అడుగు వెనక్కి వేసింది. 'బావ లో చాలా మార్పు వచ్చింది-- సన్నంగా, పొడుగ్గా , చువ్వలా వుండే మనిషి పొడుగు కి తగిన ఒళ్ళు పట్టి నిండుగా దర్జాగా వున్నాడు-- నల్ల ఫ్రేము కళ్ళద్దాలు అతని మొహానికి అందంగా అమిరాయే కాని ఏదో అపకరం వుండటంవల్ల జోడు తగిలించుకున్నాడు అనే భావానికే ఆస్కారం ఇవ్వటం లేదు.' అనుకుంది.--
    కాళ్ళు కడుక్కోటానికి తిన్నగా పెరట్లోకి వెళ్ళబోయిన అతను ఏకంగా స్నానం చేస్తే తీరిపోతుంది అనిపించి బట్టలు మార్చుకుని టవలూ అవీ తీసుకుందామనుకుంటూ , "నా సూట్ కేసు ఈ గదిలో పెట్టారా.' అంటూ లోపలికి వెళ్ళాడు. ఇంక తప్పించుకుంటే మర్యాదగా వుండదని అక్కడే నిలబడిపోయిన సురేఖ అతన్ని పలకరించే లోపునే,    
    'అరె, నువ్వింత సేపూ కనిపించనే లేదేం-- హార్టీ కంగ్రాచ్యులేషన్సు ' అన్నాడతను సందడిగా మాట్లాడేస్తూ . అ వేళే బియ్యే రిజల్ట్స్ వచ్చాయి.
    'ఓ-- థాంక్సు' అంది సురేఖ మెల్లిగా.
    "ఏమిటలా వూపిరి లేనట్లు మాట్లాడతావు-- ఫస్టు క్లాసు తెచ్చుకున్న దానివి ఇల్లు అదిరిపోయేలా గంతు లేస్తుండాలి తెలిసిందా-- ఇంక తరువాత ఏం చేద్దామనుకుంటున్నావు?' అని అడిగి, ఆమె సమాధానం చెప్పే లోపునే "ఏం చెయ్యటం ఏమిటి -- ఎమ్మే చదవమని చెప్తాను నన్నడిగితే -- చదువులో నీకున్న తెలివి తేటలకి నేను అసూయ పడుతున్నాను తెలుసా -- నువ్వు చదువు మానకు.' అని మనస్పూర్తిగా సలహా ఇచ్చాడు.
    'నేనూ అదే అనుకుంటున్నాను బావా' అంది సురేఖ అభిమానంగా అతని వంక చూస్తూ -- అసలు ఎదుట పడటం ఎలాగా అన్నట్లు, ఏదో తప్పు చేసినట్లు బిడియంగా తప్పించుకు తిరగబోయిన వాళ్ళు అంత ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుగలగటం అభిమానం ఉట్టి పడేలా అన్ని మాటలు మాట్లాడుకో గలగటం వాళ్ళకే ఆశ్చర్యంగా వుంది --
    మానవ హృదయంలోని దౌర్భాల్యాం కానీ ఔన్నత్యం కాని అక్కడే వుంది -- మనిషి ఎదుట లేనప్పుడు అనేకం అనుకుంటాం,  ఎన్నో దురభిప్రాయాలని ఏర్పరచుకుంటాం అతని ప్రవర్తన గురించి- ఒక విధమైన అయిష్టాన్ని పెంచుకోటమే కాకుండా వాళ్ళని ద్వేషిస్తున్నాం అని కూడా అనుకుంటాం- కానీ తీరా ఆ మనిషి ఎదుట పడితే మనలోని భావాలు పూర్తిగా సమసి పోకపోయినా తాత్కాలికంగా అవి మరుగున పడిపోతాయి- మనకి తెలియకుండానే ఒక సంస్కారపు పోర మనల్ని ఆవరించుకుంటుంది -- మన్నన మర్యాద ఆదరణ లాంటి భావాలన్నీ మనలో చోటు చేసుకుంటాయి--
    సురేఖ అన్న దానికి సమాధానంగా రామకృష్ణ ఏదో అనబోయాడు -- కాని అప్పటి దాకా వరండా లో కూర్చుని అతని గుణగుణాలని తలుచుకుంటూ కాలక్షేపం చేసిన తల్లీ కొడుకూ లోపలికి రావటం , వంటింట్లో జేరి కాస్సేపు ఉమ అదృష్టాన్ని తలుచుకుని మురిసిపోయి, ఆ తరువాత ఆవాళ రాత్రి భోజనం లోకి మాములుగా చేద్దామనుకున్న ఒక్క కూరే కాకుండా మరో కూరా పచ్చడీ కూడా చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిన తల్లీ కొడుకులు బజారు కి పంపించటానికి సమయానికి ఇంట్లో లేకుండా పోయిన సుందరం, సూర్యాల మీద విసుక్కుంటూ ఇవతలకి రావటం జరిగింది -- అందుచేత ఆ చెప్పదలచిందేదో మేనమామ నే ఉద్దేశించి 'సురేఖని ఎమ్మే చదవ మంటున్నాను ' అనేసి పెట్టె తీసి బట్టలు తీసుకోసాగాడు రామకృష్ణ.
    'చదువా, ఇంకానా' అంటూ అర్ధం లేని నవ్వొకటి నవ్వేశాడాయన.
    'ఉన్న వూళ్ళో చదువు కనక ఈ మాత్రంగా చెప్పించగలిగాం-- ఇంకా ఎమ్మే చదువుతాను ఎల్ ల్ బి చదువుతాను అంటే ఎలా కుదురుతుంది -- అయినా ఈ విద్యకి విజ్ఞానానికి అంతు అనేది ఏముంది, మనకి అందుబాటు లో వున్న దానితోనే తృప్తి పడాలి కాని' అంటూ తండ్రి కాస్త కటువుగా నిష్కర్షగా తన అసమ్మతిని అయిష్టాన్ని వ్యక్తం చేయటం వల్ల సురేఖ మరి ఇంక ఏ కాలేజీ కి అప్లై చెయ్యకుండా ఇంటి పట్టునే వుండి పోవలసి వచ్చింది.
    కాని పదిరోజులు గడిచే సరికే ఆ అమ్మాయికి ఆ జీవితం అంటే విసుగు పుట్టింది -- ఏదో ఓ పని చేస్తున్నాం అన్న మాట లేకుండా ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ కాలం వ్యర్ధ పుచ్చటం ఆ పిల్లకి సుతరామూ నచ్చలేదు -- మళ్ళీ అమ్మకీ, నాన్నగారికీ నచ్చ చెప్పి చివరికి ఎలాగయితే నేం ప్రయివేటు గా ఎమ్మేచదవటానికి అంటే  ఈలోగా సంబంధం కుదిరి పెళ్ళి అయిపోతే ఆ వచ్చే భర్త ఆపేసే షరతు మీద వాళ్ళని ఒప్పించగలిగింది -- పోస్టల్ ట్యూషను ఇచ్చే ట్యూటోరియల్ కాలేజీ లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ సమాచారం అంతా సేకరిస్తూ సురేఖ ఉత్సాహంగా పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చుంటే, ఉమ విసుగ్గా పాత పుస్తకాలకి దుమ్ము దులిపి కొత్త పుస్తకాల మీద పేరు వ్రాసుకుని అట్టలు వేసుకోటం మొదలు పెట్టింది-- అటు రమణమూర్తి గారు పెళ్ళి కొడుకుని వెతికే ప్రయత్నంలో మునిగి పోయాడు --

                                 
    ఓ పెళ్ళి కొడుకు -- అంటే సంబంధం కుదిరితే ' పెళ్ళి కొడుకు ఆయె అబ్బాయి -- ఎమ్మే ప్యాసయాడు-- ఆస్తి ఏమీ లేదు కాని అతనికి లెక్చెరర్ ఉద్యోగం వుంది-- ఉన్న ఇద్దరు చెల్లెళ్ళ కీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కనక ఆ కుటుంబానికి పెద్ద బాధ్యతలూ ఏమీ లేవు-- బాగానే వుందని పిలిచి పెళ్ళి చూపులకి రమ్మని ఉత్తరం వ్రాశారు --
    అబ్బాయిది జీడిరంగు నలుపు -- అంతకు మించి మరేవంకా లేదు కాని అదే భరించలేని లోపంగా అనిపించింది సురేఖ కి-- క్షణం అతని కేసి రెప్ప వాల్చకుండా చూసి ఆ చూపుకు మెల్లిగా తండ్రి వైపుకి తిప్పుకుంది-- ఆముదం తాగిన వాళ్ళ మొహం లా వుంది అయన వాలకం.
    'ఫరవాలేదు , నాన్నగారికీ నచ్చలేదు. ఇంక నాదాకా రాకుండానే వదులు కుంటారు' అని ధైర్యం తెచ్చుకుంది. కాని వాళ్ళందరినీ పంపించి వచ్చిన తండ్రి ఇంట్లో ఆడవాళ్ళతో అదీ ఇదీ మాట్లాడి "అమ్మాయి అభిప్రాయం అడగండి.' అని చెప్పినప్పుడు మాత్రం సురేఖ కి నిజంగా కోపమే వచ్చింది-- అడివరకటి సంఘటన  ఒకటి గుర్తు వచ్చింది- తల్లి వైపు దూరపు బంధువు -- కామేశ్వరమ్మ గారని-- ఆవిడకి ఒక్కడే కొడుకు -- బోలెడు ఆస్తి వుంది - ఊర్మిళ కయితే వీలుగా ఉంటుందని ఆవిడ అభిప్రాయం -- ఆ సంగతి మెల్లిగా వర్ధనమ్మ గారి దగ్గర బయట పెట్టింది-- భార్య తెచ్చిన రాయభారం వింటూనే కస్సుమన్నాడు రమణమూర్తి గారు-- ఊర్మిళ బంగారు తల్లి కదుటే -- మీ కామేశ్వరమ్మ గారినీ ఆవిడ కొడుకునీ మనం ఎరగమా -- ఒంటి నిండా తారు పూసుకున్నట్లు వాలకం వాళ్ళూనూ. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలెం పెట్టుకోవద్దని చెప్పెసేయి. అన్నారు దుమధుమ లాడుతూ.
    అలాంటి నాన్నగారు ఇవ్వాళ ఈ సంబంధం నిశ్చయం చెయ్యటానికి సిద్దంగా వున్నారా-- నాకు అంగీకారం అయితే తనకి అభ్యంతరమే కదా-- ఉమా, ఊర్మిళ వాళ్ళంతా అందగత్తె ని కాదనే కదా ఈ పక్షపాతం-- ఒక చేతి వెళ్ళు అయిదూ ఒక్క తీరుగా వుండవు -- ఒక్క తల్లి కడుపున పుట్టిన సంతానం అందరూ ఒక్కలాగే వుండరు -- అది సృష్టి ధర్మం -- అంతమాత్రం చేత తల్లి తండ్రుల అదరాభిమానాలలో కూడా ఈ వ్యత్యాసాలుండటం న్యాయమా-- అని కుమిలి పోతూనే ఎలాగో అలా నన్ను వదుల్చుకుందాం అనుకుంటున్నారేమో -- వాళ్ళకా అవకాశం ఇవ్వను అనుకుంది కసిగా. తన అయిష్టతని స్పష్టంగా చెప్పేసింది.
    తరువాత ఇంకో సంబంధం -- సురేఖ ప్రారబ్ధమో ఏమో ఆ అబ్బాయి బాగుండలేదు-- అలా రెండు మూడు సంబంధాలు రావటం సురేఖ ఇష్టపడక పోవటం వల్లనే  వదులుకోవలసి రావటం జరిగింది. చివరికి రమణమూర్తి గారికి విసుగొచ్చి 'తనేమంత చక్కగా వుందని, వచ్చిన వాళ్ళందరికి ఇలా వంకలు పెడుతుంది.' అన్నారు కూడ--
    'తల్లిదండ్రులకి పిల్లలంతా ఒక్కటే అనటం మాట వరసకే కాని, రూపు రేఖల్లోనో, గుణగుణాలోనో అంతస్తులలోనో ఓ ప్రత్యేకత వున్నవాళ్ళని వాళ్ళూ ఓ ప్రత్యేకమయిన అభిమానం తోనే చూస్తారు' అనుకుంది సురేఖ మరోసారి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS