Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 5


    ఖాళీ గాదెలు మిగిలిపోయాయి. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోక తప్పిందికాదు. బజార్లో గింజలేదు. గింజలన్నీ దాచివేయబడ్డాయి. పంట పండించిన రైతుబాబు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్నకాస్త నేలచెక్క అమ్ముకొని తాము పండించిన పంటను తామె కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బియ్యపు ధర అయిదు రెట్లు పెరిగిపోయింది.
    వస్తువులు కొనడానికి పట్నాలనుంచి వచ్చిన వర్తకులు పల్లెల్లో మూగారు. సాలీలు తమ మగ్గాల్ను అమ్ముకున్నారు. బెస్తవారు పడవల్ను పగులకొట్టి వంటచెరుకుగా అమ్ముకున్నారు.
    ఆకలి కార్చిచ్చు ఊళ్ళకు ఊళ్ళనే కాల్చేస్తూంది.
    వంగదేశం మండిపోతూంది.
    ఝార్నా తగలపడుతూంది.
    పనిలేని కాలూ వసారాలో కూర్చొని రోడ్డుమీద వచ్చేపోయేవారిని చూస్తున్నాడు. ఆకలి మంటలు గ్రామాన్ని దహిస్తున్నాయి. జనం పారిపోతున్నారు. చాలా మంది పొట్టచేతపట్టుకొని కలకత్తా వలసపోతున్నారు. గ్రాహకులు వస్తారేమోనని కాలూ ఎదురు చూచాడు. నిరాశచెందాడు. జనులు తమ బోలీబొచ్చా పిడికెడు గింజలకు అమ్మేశారు. అప్పటికే ఇరవై బళ్ళు ఊరినుంచి తర్లాయి. జనాన్ని దోచుకోవడానికి బియ్యపు సంచుల్తోనూ, జేబులో డబ్బుల్తోనూ పట్నంనుంచి వచ్చిన వర్తకులు వీధివీధీ గాలిస్తున్నారు.
    కాలూ చేతికిపనిలేదు. సమ్మెటధ్వని ఆగిపోయింది. కొలిమిలో నిప్పు మండడంలేదు. పనిముట్లన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి.
    విశ్రాంతి తీసుకోమని సమ్మెటనూ, తిత్తినీ ఓదార్చాడు. "మీకు శలవు దొరికింది" అని వాపోయాడు.
    అక్కడున్న పనిముట్లు అంత పాతవేమీకాదు. పాతవాటియుగం అయిపోగానే వాటిని సగౌరవంగా తన పడకగదిలో పెట్టుకున్నాడు. కొత్తవి పాతవాటి స్థానాన్ని ఆక్రమించాయి. అది అతనికి తరతరాలుగా వస్తున్న ఆస్తి.
    ఒకరోజు మధ్యాహ్నం ఒక ఆగంతకుడు వసారాలోకి వచ్చాడు. రెండు చేతుల్తోనూ తల పట్టుకొని కాలూ కూర్చొని ఉన్నాడు. పనిలేనప్పుడల్లా అలా కూర్చోడం అతనికి అలవాటు. కాలూకు ఆగంతకుని కాళ్ళు కనిపించాయి. అతని దృష్టి పట్నపు దుస్తుల్లో ఉన్న మనిషిమీద పడింది.
    కాలూ రెండుచేతులూ జోడించి ఆ వ్యక్తికి అభివందనం చేశాడు.
    "అమ్మడానికి సొమ్ములేమైనా ఉన్నాయా? గాజులు, గొలుసులు, వడ్డాణాలు. మంచిధర ఇస్తాం"
    కమ్మరి ఆలోచనలో పడిపోయాడు. "గాజులు, గొలుసులు" ఆ మనిషి పని చేయించుకోవడానికి వచ్చినవాడు కాడు. నిరాశను దిగమింగాడు.
    "నీకో వయసొచ్చిన బిడ్డ ఉంది కదూ?"
    కాలూ గుడ్లుచీల్చి చూశాడు.
    "ఏమీలేవు. నాదగ్గర అమ్మకానికి ఏమీలేవు" అని కోపంగా అరచాడు.
    "నీ కూతురు.... ఆమె ఏమైనా......" "వర్తకుడు వదలకుండా వెంటపడ్డాడు.
    "ఏమీలేవు అమ్మకానికి ఏమీలేవు" ఆ మాటల్నే ఆవర్తించాడు వర్తకుని మీదనుంచి దృష్టి మళ్ళించుకుని పనిముట్ల దగ్గరికి వెళ్ళాడు.
    "చూడు, నేను చాలాదూరంనుంచి వచ్చాను. కలకత్తానుంచి"
    "అలగాజనం వంగదు విరుగుతుంది. వీరిని వంచడానికే దేవుడు ఈ మహా కాటకాన్ని పంపాడు" అని గొణుక్కుంటూ వర్తకుడు వెనక్కు తిరిగాడు. మరుక్షణంలోనే మిత్రునిలా కాలూను పలుకరించాడు. "నీవు నీ బిడ్డా కలకత్తా రావాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు అక్కడ మీరేంచేస్తారు? బాగా విను. మీరక్కడికి వచ్చినప్పుడు నాదగ్గరికి రండి. పని కల్పిస్తాను. మంచి జీతంకూడాను. నగరానికి ఉత్తరాన చిట్టూరు రోడ్డు ఉంది. అక్కడ 'అంకుల్ సాధూస్ కాస్మపాలిటిన్ క్యాబిన్ అనే టీ దుకాణం ఉంటుంది. కాస్తపైకి వచ్చి మేడమెట్లెక్కుతే మూడో అంతస్తులో 'రజనీబోస్' అనే ఫలకం ఉంటుంది. తెలిసిందా?" అని చెప్పి వెళ్ళిపోయాడు.
    అతడు అలా వెళ్ళిపోగానే కాలూ పనిముట్లవిపు తదేకధ్యానంగా చూచాడు. 'ప్రమాదం తప్పింది. మీ విశ్రాంతికి అంతరాయం కలుగలేదు. ఇంక మీ విశ్రాంతికి భంగం వాటిల్లనివ్వను' అని హామీ ఇచ్చాడా పనిముట్లకు.
    తరవాత రెండు రోజులకు అతనిమీద పిడుగు పడింది. లేఖ చేతులకున్న బంగారు గాజులు మాయమైనాయి. ఎర్రటి గ్లాసు గాజులు కనిపించాయి.
    "అయితే ఆ దొంగవెధవ నీదగ్గరికీ వచ్చాడన్నమాట"
    కాలూ దాచిన సొమ్మంతా పెట్టి చేతికి రెండుచొప్పున నాలుగు పల్చని బంగారు గాజులు చేయించాడు. లేఖ పదిహేనో జన్మదినంనాడు ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. లేఖ అవిచూసి మురిసిపోయింది.
    లేఖ ఒకచూపు విసిరింది. విజయవంతంగా చిరునవ్వు నవ్వింది.
    "బాబూ! ఎందుకు అలాచూస్తావ్" అంది పిల్లతనంగా.
    "నీగాజులేవీ? అమ్మలేదుకదా! అవును నీవు అమ్మి ఉండవు. నాకు తెలుసు."
    లతల్లా ఉన్న ఆమె చేతులెత్తి "ఏఁ ఈకొత్తగాజులు మాత్రం నాకు అద్దినట్లుగా లేవూ?"
    మృదువైన చేతుల్తో ఆటలాడిన ఆ వ్యక్తి ఆమెకు తలపుకు వచ్చాడు. ముఖం వివర్ణం అయింది. వాడి వెచ్చనివేళ్ళు ఇంకా ఆమె చేతుల మీదనే ఉన్నట్లు జలదరించింది. వాడు జేబులోంచి చిన్నత్రాసుతీశాడు.
    చేతికి గాజులు బిగువుగా ఉన్నాయి. లాగుతుంటే రావటంలేదు. చేతులు ఎర్రబారుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి లాగింది.
    "ఆఁ. ఆఁ. మెల్లగా, మెల్లగా" అంటున్న వర్తకుణ్ణి చూసింది. అతడు చేయి వేస్తాడేమోనని గబ గబా లాగింది.
    ఆమె వెళ్ళిపోవడానికి తిరుగుతే "దేవుడు మేలుచేస్తే తిరిగి తొందరలోనే కలుసుకుంటాం" అన్నది దురుసుగొంతు. డబ్బు ఆమె చేతిని మంటపెడ్తూంది.
    గుండెదడ తగ్గకుండానే కిటికీలోంచి వర్తకున్ని చూసింది. వాడు కాళ్ళను లాక్కుపోతున్నాడా! అన్నట్లు నడుస్తున్నాడు. రెండు మూడు సార్లు వెనక్కు తిరిగి చూసి ఆ ఇంటిని తన స్మృతిపథంలో నిలుపుకున్నాడు. అతడు వెళ్ళిపోయేటప్పుడు లేఖ ఊపిరి పీల్చింది. ఏదో రాబోయే అవాంతరాన్ని సూచిస్తూ వర్తకుడు ఆమె హృదయంలో నిలిచిపోయాడు.
    కాలూ కన్ను చేతులమీద పడింది. అతనికోసం దుఃఖంగా పరిణమించింది. లేఖచేతికున్న చౌకగాజులు లేఖతల్లివి. అవి ఒక్కటే ఆమెకు ఉన్నసొమ్ము. మొదట మొదట కాలూకు అట్టే సంపాదనేమీ లేకుండేది. కాస్త బాగుపడేవరకల్లా ఆమె ఈ లోకం వదిలిపోయింది. వారు కలిసి ఉన్న కొద్దిరోజులూ కష్టాల్తోనే గడిచిపోయాయి. అయినా ఆమె పల్లెత్తుమాట అనేదికాదు. సహనంలోకూడా లేఖ తల్లినే అనుసరించింది. తల్లి గాజుల్తోనే ఆమె సంతృప్తి చెందింది. కొద్దిలో సంతోషపడ్డం ఆమెకు అలవాటు. కొద్దికాలం తరువాత ఆ కొద్దిగా సమకూర్చడం కాలూకు సాధ్యపడకపోవచ్చు. ఆకలిమండిపోతున్న గొడ్లలా, వందలమందితోపాటు ఆమెకూడా అడవిదుంపలకోసం పొలం పొలమూ తిరగాల్సిరావచ్చు.
    కాలూగుండె దుఃఖంతో నిండిపోయింది. గాలి తిత్తిదగ్గరకుపోయి మళ్ళీ తల పట్టుకొని కూర్చున్నాడు. దుంపలకోసం త్రవ్వుతున్న లేఖ, కాయగసర్లకోసం చెట్లెక్కుతున్న లేఖ, పరిగెచేపలకోసం మడుగులు గాలిస్తున్న చంద్రలేఖ అతనికళ్ళకు కనిపించింది. ఆమె చెంపలు పీక్కుపోయాయి. గుడ్లు కాంతిలేకుండా కణతల్లోకి పీక్కుపోయాయి. చిన్న పిల్లలా సొక్కుచూ సోలుతూ నడుస్తూంది.
    అది అపరిచిత దృశ్యం ఏమీకాదు. వందలకొద్దీ అప్పుడే ఆ దశను చేరుకున్నారు. వారిలో చాలామందిని అప్పటికే చావు పొట్టన పెట్టుకుంది. కాలూ పొదుపుచేసి దాచింది కాస్త కూస్తా ఉండబట్టి బ్రతికిపోతూన్నారు. ఏండ్లకొద్ది పొట్టకట్టుకొని సంపాదించిందంతా ఇట్టే కరిగిపోతూంది. ఆవిషయం తలపునకురాగానే కాలూగుండె ఎండిపోయేది. కాలూ కష్టించిసంపాదించిన అయిదురూపాయలు ఈరోజు ఒక్కరూపాయికి సమానం. తాను చేసిన శ్రమలో అయిదింట నాలుగువంతులు దండగేనా? అతడు చమటపిండాడు. పగలేకాక రాత్రిపొద్దుపోయేదాకా పనిచేశాడు. బలం అంతా ధారపోశాడు. పేరు చెప్పిన బ్రాహ్మణునిదగ్గరనుంచి తప్ప, అతనికి రావాల్సినదాంట్లో ఒక్కదమ్మిడీ వదులుకోలేదు. ఆ డబ్బుమాత్రం ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? పదహారు సంవత్సరాల శ్రామిక జీవితంలోనూ అతడు తనకు కలిగిన నష్టాన్ని గురించి ఎన్నడూ ఇంతగా విచారించలేదు. రెండురూపాయలు. ఇవ్వాళ వాటివిలువ అయిదవ వంతే! అది తన ఔదార్యానికి చిహ్నంమాత్రమే. ఆ ముసలిబాపడు చెబుతూవుంటే విని అందరూ కాలూను అపహాస్యం చేసేవారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS