లోన గదిలో షాహిద్ జమాల్ మాట్లాడుకుంటున్నారు. గుసగుసలు నిట్టూర్పులు. వందలమైళ్ళ దూరం అక్కడొక నది. నది ఒడ్డున బురద, బురదలో పురుగులు బిలబిలాడుతున్నాయి. అక్కడే ఒక పతంగం కూర్చుంది - ఆలోచించింది - ఆ వరుసలో చివరి మజిలీ చేరుకోవాలనుకుంది. ఇంతలో ఒక దివ్వె మండింది, వెలిగింది. ఇహ ఆ పతంగపు ప్రదక్షిణకు అంతం ఏది?
తాను ప్రమాదాన్ని చూచించు జండా అయింది. బయట రెపరెపలాడుతూంది. తనకు ధైర్యం వుంది. సాహసం ఉంది. వాటి బలంతో తను ఒంటరిగా ఇనుప స్తంభం పాతుతూంది. కదిలే తీవల స్విచ్చులను కలుపుతుంది. అది నిజమే. తన శరీరంలో కూడా కరెంటు పాకుతూంది. షాక్ అనిపిస్తూంది. వంటినిండా వేదనల తరంగాలు వెలుగుతూ ఉరుకుతున్నాయి.
ఎంత బరువైన బాధ్యత నిర్వహిస్తూంది తాను! తనకు ప్రమాదాలతో ఆటలు అలవాటే. అయినా వళ్లు వణకుతూంది. నేడు జమాల్ కప్పులేని కరెంటు తీగ. అంటుకున్నవాడు హరీ అనాల్సిందే, ఎంత ధైర్యం తనది? ముగ్గురు పిల్లలు, జబ్బుతోనున్న భర్త నుంచి జమాల్ ను లాక్కొచ్చింది తాను. జమాల్ ఆరేళ్ళక్రితపు అందాలు అక్కడే వదిలేసినట్లుంది. ఆమె చేతులకు భర్త తలకు రాస్తున్న నూనె దుర్వాసన, చీరమీద చిన్నపిల్లవాడి మూత్రం - పెద్దపిల్లకు అల్లుతున్న స్వెట్టర్ అంటుకొని ఇక్కడిదాకా వచ్చింది. అలాంటి జమాల్ సిగ్గుతో ముడుచుకొని గదిలోకి వెళ్ళింది. అప్పుడు సురయాకు కూడా సిగ్గేసింది.
అంత అందమైన అతివ ఇంతలో భార్య అయింది! తల్లి అయింది! ఇహ జీవితాంతం వాటిలోనే మునిగి ఉంటుందేమో! అయినా ఆమె షాహిద్ ప్రేయసి అనే విషయం సురయా గుర్తుచేస్తుంది. జమాల్ బిడ్డకు జబ్బు చేస్తుంది. ఆమె మనసు మనసులో ఉండదు. ఇంట్లో ఏవో చీకాకులు. వాటితో సురయాకు మర్యాదలు చేయలేదు, అప్పుడు సురయా ఆజ్ఞాపిస్తుంది, ఏమని? షాహిద్ కు ఉత్తరం రాయమని. ఎందుకని? రాయకుంటే అతడు ఇంట్లోనే దిగుతాడని.
అయినా ఆమె ప్రేమాభిమానాలను ఎవరూ గుర్తించలేదు. రేలింగ్ మీద వంగీ వంగీ కన్నీరు తుడుచుకుంది. బట్టతల రజాఆలమ్ కూడా ఆమెను గమనించలేదు. ఇప్పుడతడు ఊరినుంచి మిత్రులకు కథలు పంపడం లేదు. ఉత్తరాలు రాస్తున్నాడు. ఆ ఉత్తరాలు తానూ చూచింది. అన్నింటిలోనూ భార్య జబ్బును గురించి, పిల్లల ముద్దులను గురించే ఉంది.
ఆమె కూడా భార్య కాగలదు, ఆమె కూడా పిల్లవాడు మూత్రించిన చీరకట్టుకోగలదు అనే విషయం జనం మరిచారు. తాను సంతోషాలు పంచడంలో ఉదారంగా ప్రవర్తించింది. జనం తన విషయంలో లబ్ధులు ఎందుకవుతున్నారు? తన అనుగ్రహ ప్రవాహాన్ని అందరికీ అందించింది, అంతా దాహం తీర్చుకున్నారు. తమ దారి చూచుకున్నారు, తనను చూచి తుర్రున ఎగిరిపోయే రంగురంగుల పిట్టల్ని పట్టుకొనడానికి ఉరికింది, పిల్లలంటే కనికరం లేని చంద్రునివెంట పరుగులు తీసింది.
ఆమె తన కన్నీటి వరదకు కట్టుకట్టి పైకి చూచింది. గోడకు వ్రేలాడే బల్లమీద Tolet అని రాసిఉంది, ఈ ఖాళీ ఇంటిని షాహిద్ చాలా కష్టంగా సాధించాడు. జమాల్ ను కలుసుకోవడానికి. కాని ఆ బల్ల తన నొసట ఉన్నట్లనిపించింది సురయాకు. ఆమె కూడా ఖాళీ ఇల్లే. దీన్ని దయ్యాల కొంప అనుకున్నారు. అంతా విడిచివెళ్ళారు. ఇప్పుడు దాని గోడల్లో గడ్డి మొలుస్తూంది. గోడల గచ్చు అక్కడక్కడా పెచ్చుల్లేచింది.
ఈ ముంగిలిలోకి దాగుడుమూతలాడే పిల్లలేల రారు? ఇంతవరకు ఇక్కడ దీపం ఎందుకు వెలగలేదు? ఆమె చీకటిలో తలకొట్టుకొని తిరుగుతూంది. కేకలు వేసి పిలుస్తూంది. ఎవడూ పలకడు. ఏడీ షాహిద్? ఏడీ వికార్? ఏడీ రజా? ఏరీ వీరంతా?
ఆమె మొదలు నరికిన చెట్టులా మెట్లమీద పడిపోయింది.
ఎవరది? ఎవరక్కడ? ఎవరు డోలు వాయించేది? నిజం. అది డోలే - డోలు చప్పుడే. ఎవరో అపస్వరాలు వాయిస్తున్నారు. ఛ ఛ ఏమిటా పాట? సలీమ్, గుర్తుందా? నీ పెళ్ళిలో ఎన్ని పాటలు పాడాను? ఎంత హడావుడి చేశాను? ఇంట్లో పెళ్లి అయితే ఎంత సందడి - ఎంత వెలుగు! వెలుగే వెలుగు - సందడే సందడి.
బత్తోలు ఉందే దానికి గోరింటాకు పెట్టుకోవడం గిట్టదు. కొండెంగలా నేనోమూలకు కూచోనని స్పష్టంగా చెప్పేసింది. కమ్యూనిస్టునని తిరిగేది. నాకైతే బాగనిపిస్తుందమ్మా! వదువులకు గోరింటాకు అలంకరించడం వాళ్ల చల్లని చేతులు తాకడం నాకు భలే సరదా. అందుకే జమాల్ కు బాగా గోరింటాకు పెట్టాను.
ఈ నిముషము బుర్రలకు ఏమైంది? భూమీ, చంద్రుడు వేరువేరుగా తిరుగుతున్నారని తెలీదా? వీరిమధ్య దూరం శాశ్వతంగా ఉండేదే - ఉంటుంది.
సలీమ్! ఎందుకింకా కూర్చున్నావు? వెళ్లు నీ మొగుడు ఎడబాటు భరించలేడు. పాపం. పద్యాల అర్థాలు మరిచిపోతాడు. నాకు తెలుసు నీవెందుకు కూర్చున్నావో? ఏదో శుభవార్త విందామని - అంతేకదూ? విను చెపుతా, అమ్మ మళ్ళీ మజేడ్ దగ్గరికి వెళ్ళింది యాచించడానికి. వాడు నిరాకరించాడు. వాడికీ నేనక్కరలేదు. పెళ్ళాం కావాలి. తల్లిలేని పిల్లల్ను సాకడానికి. వాడికో ప్రాణంలేని బొమ్మకావాలి. వాడు నాకేం చేయగలడు? నేను సురయాను -సురయాను మాత్రం. నాకు నీళ్లు తాగించు. ఆ పచ్చికుండ ఎత్తి నామీద గుమ్మరించు. ఈ మాత్రం చేయలేవూ? చాల్లే ఎందుకామాటలు? అవును నాకు ఎందుకు సాయం చేస్తావులే! నేనెవరికేం చేశానని. ఒక ముసలివాణ్ణి పిసిరినారిని జాగీర్దారును తెచ్చావు. అతని అమ్మ ముందూ అక్క ముందూ కూర్చోబెట్టావు. అబ్బ! ఏమిటబ్బా ఈ టెకు? రోజంతా ఆలోచించినా ఏ చీర కట్టుకోవాలో తెగదు. ఎందుకూ అన్ని నగలు పెట్టావు? ఉక్కపోస్తుందబ్బా! సరేకాని ఇవ్వాళ నువ్వు చెప్పినట్లే వింటాను. దాచెనా కాటుకా పెట్టుకుంటాన్లే, కాకుంటే నువ్వు నన్ను పెళ్ళికూతురనవు. అవును కదా! నువ్వు నా పాపిట అలంకరిస్తున్నావు. అప్పుడు నాకో మంచి ఆలోచన వచ్చింది. ఏమిటంటావా? ఒక పెండ్లి పత్రిక రజాఆలమ్ కు పంపుదామని. అప్పుడెలా ఉంటుంది. వాడికి కోపం వస్తుంది. మండిపడ్తాడు. పెళ్ళాన్ని బాదుతాడు. వెధవ ఎండురొయ్య!
ఈ మొగాళ్ళు తమ కోపాలను ఆడవాళ్ళమీద తీరుస్తారు. ఈ ఆడవాళ్ళను చూస్తే భయమవుతూంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. సిగ్గనిపిస్తుంది. వాళ్లు వధ్యశాలలో నుంచున్న జంతువుల్లా ఉన్నారు. ఎందుకూ నేను వాళ్లకోసం వెదకడం? వాళ్లంటే అసహ్యం నాకు. నీకూ, మా అమ్మకూ భయపడి అక్కడ కూర్చున్నాను. అతడెవరూ? నీకు మామా? అతడే వద్దన్నారుగా - ఇహ సరా? ఆడపిల్లలు అలా అనగలరా? ఒకసారి మజీద్ ను వద్దన్నాను. అంతే, ఇలా అయ్యాను.
నేనిప్పుడు ప్రమాదం చూచించు ఎర్రజండాను. నన్ను వెదురుబొంగుకు కట్టి జనానికి చూపించు.
ఎవరది...? మెట్లమీద ఎవరి అడుగుల సవ్వడి...? నువ్వేదో దాస్తున్నావు. నిజంగా ఎవరో వస్తున్నారు. రావచ్చు. వచ్చేవాడు నాకోసం గ్లాసెడు చల్లని నీళ్లు తెస్తుండవచ్చు. రానివ్వు తేనివ్వు.
* * * *
