Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 5


    'ఒకసారి కిషన్ చందర్ సురయాను గురించి చాలా మంచి వాక్యం రాశాడు. చెప్పనా సురయా?' సలీమ్ అడిగితే సురయా జంకింది.
    'ఇదిగో సలీమ్ చూడు - నామీద ఒట్టు. చెప్పావంటే. చూడు మజాబ్ అన్నమాట నేనూ చెప్పేస్తాను.'
    'ఏమిటామాట? ఏమిటది?' అందరిలో ఆసక్తి పొంగింది.
    అసలు విషయం షాహిద్ కు మాత్రమే తెలుసు. మాటా లేదు మట్టీ లేదు. తనకు అంత పెద్దపెద్ద వాళ్ళతో పరిచయం ఉందని చెప్పుకోవడానికే ఇదంతా.
    'ఇహ కవిగోష్టి ప్రారంభిద్దామా...?' షాహిద్ అడగ్గానే అందరూ అందుకు సంసిద్ధులయినారు.
    ఈ పార్టీ పర్యవసానం ఏమైనప్పటికీ రజాఆలమ్ అదృష్టం పండింది. అతని విశాల వదనం మీద విధాత పేరు ప్రఖ్యాతులే కాక ఒక చురుకైన పిల్ల సాంగత్యం కూడా రాసిపెట్టాడని సురయా అతనికి విశ్వాసం గలిగించింది. ఏ ద్వారంలోకి ప్రవేశం లభింపని దురదృష్టవంతుల్లో రజాఆలమ్ ఒకడు. అతడు తన కథల్లో అభ్యుదయం, ట్రాజిడి, సెక్స్ చిట్కాలు అన్నీ సమపాళంలో వేసేవాడు. అయినా అతని వంటకం నచ్చిన సంపాదకులు ఉండకపోవడం దురదృష్టం కాదూమరి! విసిగిపోయి స్వయంగా ఒక పత్రిక ప్రారంభించాడు. అప్పుడు నగరంలోని చిన్నా, పెద్దా రచయితలు అతని నైపుణ్యాన్ని గురించి రాయసాగారు. ప్రతి రచయిత కర్తవ్యం ఏమిటంటే అతని పత్రిక భారతదేశంలో ఏకైక పత్రికగా కీర్తించడం - అతణ్ణివినా, మరొకణ్ణి కథాకారునిగా గుర్తించకపోవడం. ఇప్పుడు రజాఆలమ్ కథలు అచ్చుకావడమే కాదు. అతని కథల్ని గురించి సురయా రాసిన ప్రశంసా వ్యాసాలూ కూడా అచ్చవుతున్నాయి.
    సురయా కాలేజీ నుంచి బయటపడి స్కూలు టీచరు అయింది. రజాఆలమ్ క్లర్కు ఉద్యోగం వదిలేశాడు. కథలు రాయడమే అతని పని. పగలంతా సిగరెట్లు కాలుస్తూ కథలు రాస్తాడు. సాయంత్రం తాగి తూలుతూ సురయా ఇంటిముందు కూలబడి ఆమె పేరుపెట్టి పిలుస్తుంటాడు. మొదటిసారి అతను వచ్చినప్పుడు ప్రళయం వచ్చేసింది. లోన కూర్చున్న అమ్మా, అక్కా సురయా తాత్కాలికంగా చనిపోతే బావుండుననుకున్నారు. నాన్న మెడపట్టి రజాఆలమ్ ను గెంటాడు. బెత్తం అందుకొని సురయావైపు సాగాడు.   
    'ఆగు అడుగు ముందుకు వేస్తే ఉండను. లేచిపోతా'
    వేలెత్తి అన్న సురయాను చూచి తండ్రి ప్రతిమలా నిశ్చేతనుడై నిలిచిపోయాడు. ఆ బెదిరింపు విని తల్లి తల్లడిల్లింది. నిజంగానే లేచిపోతే అనుకుంది.
    ఆమెకు పెళ్లి కావాల్సిన మరి ముగ్గురు కూతుళ్లు కనిపించారు. వాళ్లు ఎదుగుతున్నారు. వారిలో మొలుస్తున్న వయసు తండ్రితో మార్వాడీ దగ్గరికి వెళ్లు - అప్పులు తే అంటూంది. కాని అచ్చం అప్పులతో జీవితం లభించదే! సురయాను గురించిన గుసగుసలు, ముసిముసి నవ్వుల నుంచి హేళన నవ్వులదాకా వచ్చేశాయి. మంచివాళ్ళెవరూ ఈ గుమ్మంలో అడుగు వేయలేకపోతున్నారు. ఎలా వేస్తారు? మెట్ల దగ్గరే రజా ఆలమ్ కుక్కలా పడి ఉంటుంటే! సురయా వచ్చి అతని చేతికి మూడు, నాలుగు రూపాయలిచ్చి పంపితేగాని కదలడు. ఇంటివాళ్లకు ఆమెతో సంబంధం పలచబడింది. స్కూలు నుంచి కాలేజీకి వెళ్తుంది. అక్కడ సంధాన కార్యక్రమంలో కొంతకాలం గడుపుతుంది. ఆ తరువాత రజాఆలమ్ గదికి వెళ్తుంది. అంతకుముందు ఆ గదిని నాన్ రొట్టెలవాడు అద్దెకు తీసుకున్నాడు. అందుకే అందులో ప్రవేశిస్తే పట్టపగలు కూడా అర్థరాత్రిలా ఉంటుంది. సురయా దానికి సున్నం వేయించింది. ఇప్పుడా నల్లని గోడలు తెల్ల ముసుగువేసుకున్న సురయాలా ఉన్నాయి. రజాఆలమ్ ఆమెను గురించి ప్రశంసా కవితలు చదివినప్పుడు ఆ గదిలో దీపావళి రేయి పరచుకుంటుంది. ఆమె బాల్యంలో రచయిత సాహచర్యం కోరుకుంది. అది అక్షరాలా నిజమయింది. ఆ గది గోడల నిండా 'సురయా రజాఆలమ్' అని పెన్సిల్ తో రాసింది.
    తండ్రి దగ్గరికి వెళ్లి పెళ్లిని గురించి అడగమని సురయా రజా ఆలమ్ తో చాలాసార్లు తగాదా పడ్డది. రజాఆలమ్ పద్దహ్తి ఆమెకేమీ నచ్చలేదు. బాజాలు లేకుండా ఊరేగింపు లేకుండా ఎక్కడో గప్ చుప్ న నికా కట్టుకోవడం ఆమెకు ఇష్టంలేదు. అలా జరిగితే తాను పెండ్లికూతురు కావడం, పెండ్లి విందులు జీవితాంతం కలగానే ఉండిపోతాయి. ఈలోగా రజాఆలమ్ మహబూబ్ నగర్ లో తనకో తల్లి ఉందనీ, ఆస్తీ ఉందనీ ప్రకటించాడు. ఆ మాటవిని సురయా పొంగిపోయింది. అత్త, ఆడబిడ్డలతో తగాదాలు పడొచ్చుననుకుంది. ముసలిదాన్ని ఆటలాడించవచ్చుననుకుంది. ముసలిది తన బాధలు పడలేక రజాఆలంతో మొరపెట్టుకుంటుంది. ఆ విధంగా, ఊర్లో ఏమూలనో పడి ఉన్న ముసలిదానికి ఆయువు ప్రసాదించమని ప్రార్థించింది. తన జీతం సాంతం రజాఆలమ్ కు అప్పగించింది. అక్కడి ఆస్తి అమ్మి ముసలిదాన్ని ఇక్కడికి తీసుకురమ్మంది. అవును డబ్బు లేకుండా పెళ్లి కార్యం ఎలా జరుగుతుంది!
    రజాఆలమ్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె కళ్ళు తెరిచింది. లోకాన్ని చూస్తే చాలా మారిపోయింది. షాహిద్ కాలేజీ ముగించుకున్నాడు. బొంబాయిలో రోడ్లమీద తిరుగుతున్నాడు. జమాల్ విరహం భరించలేక పిచ్చవాడయినాట్ట. జమాల్ ఫిలాసఫీ ప్రొఫెసర్ భార్య అయింది. జీవితం గడుపుతూంది.
    సలీమ్ టీబీ చివరిదశ నుంచి జీవితపు తొలి మజిలీ చేరుకుంది. అప్పటి ఉర్దూ ప్రొఫెసర్ క్లాసులో భార్యకు సంబంధించిన కథలు వినిపిస్తున్నాడు. సలీమ్ కు తలనొప్పి అయితే ప్రొఫెసర్ కు మనసులో మనసు ఉండడంలేదు. క్లాసులో 'జవుఖ్' కవితను 'గాలిబ్' కవిత అంటున్నాడు. సలీమ్ ఇప్పుడు పరదాలో ఉంటూంది. తన పాత స్నేహితులకు గూండాలని బద్మాషులని బిరుదులు ప్రధానం చేస్తుంది.
    సురయా రజాఆలమ్ నుండి ఉత్తరం కోసం వేచివేచి సలీమ్ ఇంటికి చేరుకుంది. తానే ఆ ఇంటికి నియంత అయినట్లు సోఫాలో పడిపోయింది. సలీమ్ ఆమెకు విసనకర్రతో విసరుతూంది. చాయ్ చేసి తెచ్చి ఇస్తుంది తన జీవితం వెలుగొందడానికి సంబంధించిన బ్యాటరీ స్విచ్చి సురయా దగ్గరుందని ఆమెకు తెలుసు.
    జమాల్ కు తనను గురించి చాలా గర్వం ఉండేది. షాహిద్ ను తననుంచి ఎవరూ వేరుచేయలేరని విర్రవీగేది. కాని ఏదో అదృశ్యహస్తం షాహిద్ ను బొంబాయి రోడ్లమీద విసరివేసింది, జమాల్ పెండ్లి ఫిలాసఫి ప్రొఫెసర్ తో జరిగినప్పుడు సురయా స్వయంగా డోలు వాయించింది. పాటలు పాడింది. స్వహస్తాలతో జమాల్ చేతిని వరుని చేతికి అందించింది.
    ఇవన్నీ సురయా స్వప్నంలో చేసినట్లుంది. ఆమె జమాల్ ను, సమీల్ ను పెండ్లికూతుళ్ళను ఎందుకు చేసింది? తాను పెళ్ళికూతురు కావడానికి నిరీక్షించింది గనుక. ఆమె జమాల్ తల్లియై జమాల్ పిల్లలను ఏల చిచ్చికొట్టింది? ఆమె దగ్గర జమాల్ కు ఉత్తరాలు రాస్తే ఆమెకూడా వాటిని చదివి కన్నీరు రాల్చింది.
    ఆమె కోరిందేమిటి? తాను చేసిందేమిటి? ఏమీ అర్థం అయ్యేదికాదు. షాహిద్ వెర్రివాడయి బొంబాయి నుంచి వచ్చేవాడు. అప్పుడు జమాల్ ను పొగడాల్సివచ్చేది. సాగదీయాల్సివచ్చేది. ఏమిటది? వందలకొద్ది అబ్బాయిల అమ్మాయిల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత తనకెందుకు?
    రజాఆలమ్ రావాలి. తానూ పెళ్ళికూతురు కావాలి. అత్తతో పోట్లాడాలి. పిల్లల్ని బాదాలి. తాను కూడా గుండాలకు దూరంగా ఉంటుంది. పరదాలో ఉంటుంది. పాపం రజాఆలమ్ తన కథలు వినిపించి వినిపించి శ్రోతలను క్షమాపణ కోరతాడు.
    "క్షమించండి మా ఆవిడకు నిన్నటినుంచి డోకులు. నా బదులు కిషన్ చందర్ మీకు కథ వినిపిస్తాడు."
    ఆమె రేలింగ్ మీదినుంచి వంగింది. కరెంటు వాళ్ళపని చూస్తూంది, కూలీలు చీమల్లా ఉన్నారు. ఇనుప స్తంభాన్ని కరచుకొని ఉన్నారు. ఎటు చూచినా చుక్కల గుర్తులు - స్విచ్చులు, ఉచ్చులు, రోడ్డుకు ఇటునుంచి అటు తాడు మధ్యన రెపరెపలాడే ఎర్రజండా.
    ఈ శ్రామికులు అనంత కళలు సృష్టించగలరు - ప్రదర్శించగలరు. ప్రవహించే నదులను నిలుపగలరు. ఆ నదికి అగ్గిపెట్టగలరు. అందునుంచి విద్యుత్కాంతిని సృష్టించగలరు. ఆ విద్యుత్తు వందలమైళ్లు పయనించి చుక్కల వల పరచగలదు. కంపన - ప్రకంపన - ఉచ్చులు - ప్రమాదాన్ని హెచ్చరించు ఎర్ర జండా - ఒక మీట, దాన్ని నొక్కడం - లైటు వెలగడం - ఆ వెలుగుకు ఒక వెర్రి శలభపు ఆత్మరక్షణ, ఇంతే, ఇదే మనిషి కథ - వలపు గాథ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS