Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 7


                                     పాదాలు

    వాళ్లకు సాధ్యం అయితే నన్ను ఎముకలో మూలుగులా పీల్చి పారేసేవాళ్లు.
    ఈ ఇంటికి వచ్చినప్పుడు అదృష్టం మీద నమ్మకం లేదు. అత్తవారింటికి వెళ్ళే కోడళ్లు తమ బలహీనతను అదృష్టంగా భావిస్తే పుక్కిటి పురాణం అనిపించేది. ఆ కోడలుపిల్లలాగే తిట్టుకుంటున్నా ఆ ఇంటికి వెళ్లడం తప్పడం లేదు. రోజూ రెండుసార్లు ఆ ఇంటికి వెళతాను. అసలు నేను మూడుసార్లు వెళ్ళాల్సింది. మహమూద్ అలా ఏర్పాటు చేశాడు. నేను నేలకు ముప్పైరూపాయిలిచ్చేట్లు నాకు మూడు పూటలు వాళ్లు తిండిపెట్టేట్టూ ఏర్పాటు.
    యూనివర్శిటీ హాస్టల్లో ఈగల పులుసూ, రాళ్ల రొట్టెలూ మాన్పించడం కొందరి కుర్రాళ్ల సాహసానికి సాధ్యం కాదు. హైదరాబాదులో కొండల్ని చదును చేయడమూ సాధ్యంకాదు. మహమూద్ మాయదీపపు భూతంలాంటివాడని ప్రఖ్యాతి. అయినా అమ్మాయికి ఇవ్వవలసిన ప్రేమలేఖ లెక్చరర్ కు చేరవేసేవాడు. అతనికి రహస్యం అని చెప్పింది. తప్పక ప్రొఫెసర్లదాకా పోయేది. అదంతా ఏమైనా నాకు మాత్రం నగరంలో ఒక గది ఇప్పించాడు. యూ.పీ. నుంచి వచ్చిన మంచి కుటుంబంలో భోజనం ఏర్పాటు చేశాడు.
    గది మద్రాసు వాళ్లు కిరాయకు ఇచ్చారు. వాళ్లు కాఫీ, ఊరగాయాలు, అప్పడాల బేరం చేసేవాళ్లు. దంచవలసిన వస్తువుల వర్తకం వారిది. కాఫీగుండ నానెత్తిమీద దంచేవారు. ఊరగాయల ఘాటుకు తుమ్ముల వరస. తుమ్ములతో శుభ్రం అయిన మెదడుకు రొయ్యలు వేసిన వాసన అందించేవారు. శ్మశానంలో చందనం చెక్కా, నేతిలో వేసిన పీనుగుల వాసనలో ఉంటున్నట్లు అనిపిస్తుంది.
    సరిగ్గా సమయానికి పనులు జరగడం ఈ ఇంట్లోనే చూశాను. ఇంటికి పెద్దపిల్లవాడు తలుపు తీయమని కేక పెట్టాడనుకోండి. మీరు కళ్లు మూసుకొని ఉదయం ఏడున్నర అయిందని చెప్పొచ్చు. పెద్దమనిషి బయటికి రావడానికి తలుపు తెరిచిన చప్పుడయితే సాయంకాలం ఆరు గంటలయినట్లు. అప్పుడాయన పాలు పోయడానికి బయల్దేరుతాడు. తలుపు తట్టిన చప్పుడయితే రాత్రి ఎనిమిదయినట్లు. తర్వాత గప్ చుప్ ఇహ చప్పుడే గాదు. శ్మశాన ప్రశాంతత ఆవరిస్తుంది. తర్వాత అడుగుల చప్పుడు గిన్నెల కదలిక తప్ప ఏమీ వినిపించవు. ఒకనాడు మాత్రం నా గదిపక్కన ఒక ఆడది పడ్డట్టూ, ఆమె ఆయాసపడుతున్నట్లూ వినిపించింది. మర్నాడు యజమాని వచ్చి క్షమాపణ కోరాడు.
    ఆ తర్వాత భోజనం చేయాల్సిన ఇంటికి వెళ్లాను.
    అది రెండుగదుల క్వార్టర్. మగవాళ్లగది ఖాళీగా ఉంది. గాలిపటాల కాగితాలు, విరిగిన కర్రలు, ఖాళీ సిగరెట్టు పెట్టెలు, ఫిల్ముల వాల్ పోస్టర్లు గుట్టల్లా పడిఉన్నాయి. ఒకమూలకు చిరిగిన చాప ఉంది. దానిమీద చిరిగిన మురికి బట్టలు పడిఉన్నాయి. దానిమీద ఒక ముదుసలి ముడుచుకొని పడి ఉన్నాడు. అతనిది నిప్పుకోడిలాంటి పొడవైన మెడ. దాన్ని మోకాళ్ల మధ్య ఇరికించి ముడుచుకున్నాడు. లోపలినుంచి ఒక ఆడది శ్వాస సైతం ఆడనట్లున్నది. గుట్టమీద గుడ్డపేగులాంటిది వేసి పెంచుతూంది. మహమూద్ కేకవేశాడు. ముసలివాడు ఉలిక్కిపడి లేచాడు. అప్పుడతని మెడ ఆకాశంలో నక్షత్రాల మధ్య నడయాడుతున్నట్లుంది. అతడు మమ్మల్ని చూశాడు. దీక్షగా చూచి గుర్తించినట్లు చేశాడు. చాపమీద కూర్చోడానికి అనుమతించాడు.
    "మురాద్ నుంచి ఉత్తరం వచ్చిందా?" మహమూద్ సంభాషణకు ఉపక్రమించాడు.
    'మూడు నాలుగు నెలల్లో రావచ్చు.' ముసలివాడు నిట్టూర్పు విడిచాడు.
    'రాకున్నా అతని ఆశతో జీవించడం మానేశాం.
    అతనికి అది నచ్చలేదు. ఆశపెట్టుకోవడం వృధా ప్రయాస. డెబ్భై ఏండ్ల వయసులో అదే నేర్చుకొన్నది.' అన్నాడు.
    ఆశలు వదులుకుని జీవిస్తున్న వృద్దుణ్ణి దగ్గరిగా చూచాను. అతడు మనిషిగా ఉండిందెప్పుడో తెలీదుగాని ఇప్పుడు మాత్రం అస్తిపంజరానికి చర్మం తొడిగినట్లున్నాడు. అతని ముఖం ఆరిన దీపంలా ఉంది. కూలిన కొంపలా ముఖంలో మౌనం ఉంది. అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం కదలాడుతూంది. రానున్న ఇక్కట్లలా జులపాలు పెరుగుతున్నాయి. జీవితాంతం ఎడారిలో పాట్లుపడి ఇప్పటికీ అగ్గిమీద అడుగులేస్తున్న జాడలు అతని వదనంలో కనిపిస్తున్నాయి.
    గదిలో మాసిన గోడలమీద ఉమ్మిచారలున్నాయి. ఆ ఫ్రేములో పికాసో ఆర్టులాంటి అసమాన రేఖాప్రతిమలున్నాయి. ఒక కుర్రాడు సిగరెట్టూ పీలుస్తున్నాడు. ఆడదాని రూపానికి చేప శరీరం ఉంది. ఒకడు గాడిదమీద స్వారీ చేస్తున్నాడు. దానికింద 'బహుదూరపు బాటసారి! మమ్ము వెంట తీసికెళ్ళు' అని రాసి వుంది. భూతాలు, పక్షులు, పిచ్చుకల బొమ్మలకు లెక్కేలేదు. ఈ చిత్రలేఖనం లోపలదాకా సాగుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. లోపలనుంచి ఒక పురుషుడు అతి అపస్వరంతో పాడుతున్నాడు. "బాల్యం నుంచే రసికాగ్రేసరుణ్ణి నేను" అని.
    ఆ పాడేవాడు రఫీని తలతన్నాననుకునేవాడిగా కనిపించాడు.
    మహమూద్ నా మంచితనాన్ని గురించిన కథలల్లి ముసలివాడికి చెపుతున్నాడు. నాకేమో ఈ ఇంటిని చూస్తే గుబులుగా ఉంది. రోజూ మూడుసార్లు రావడం గండం అనిపిస్తుంది.
    అమాంతంగా లోపలి పాట మూతపడింది. ఒక సన్నని మెత్తని స్వరం వినిపించింది. 'పెదన్న మిత్రులు వచ్చారు. పెద్దన్న మిత్రులు వచ్చారు.' అమాంతంగా పరుగుపందెం మొదలయింది. గది గుమ్మానికి వేలాడే మురికి తెర కదలసాగింది. తలుపులు కదిలాయి. ద్వారం నుంచి ఒక సుందరి చూస్తున్నట్లనిపించింది. ఇప్పుడు అటు చూడకుండడం నా నైతిక ధర్మం,చూపు తాకుతుంటే అదోలా ఉంది. కాళ్లు చేతులు మంచుముద్దలయినాయి. ఇహ అక్కడ చేత్తో శిరోజములు సవరించుకుంటున్నారు. ముక్కుస్థానం తప్పిందేమోనని చూచుకుంటున్నారు. ఫోటో దిగడానికి తయారైనట్లున్నారు.
    'ముందు వీరి ఆగోర్యం చూచి మేము ఈర్ష్య పడేవాళ్ళం. హాస్టల్ తిండి ఇలా చేసింది'. మహమూద్ చెప్పుకుపోతున్నాడు.
    అప్పుడు నన్ను నేను చూచుకుంటే ఏడ్పు వచ్చింది. ధైర్యం తెచ్చుకోవడానికి కాడ్రాపాంటు చూసుకోవాల్సివచ్చింది.
    తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఆరేడేళ్ళ పిల్లవాడు లోనికి వచ్చాడు.వాడు చొక్కాను మామిడి పండులా చీకుతున్నాడు. ఎర్రని పొడవైన వెంట్రుకలు ముఖంమీద పడుతున్నాయి. మమ్ములను దీక్షగా చూస్తూ మూలన నుంచున్నాడు. అతని ముఖంలో పిల్లల పసితనం బొత్తిగా లేదు. మాంత్రికుని గుహ నుంచి బయటపడినట్లు భయం ఆవహించి ఉంది.
    తెరవెనుక గాజుల చప్పుడు అవుతూనే ఉంది. రఫీని తలతన్నిన పాటకాడు 'నువ్ తడ్పత్ హరి దర్శన్ కో లజ్' అందుకున్నాడు.
    'సరే. ఈ డబ్బు తీసుకోండి. రేపటినుంచి ఇక్కడే భోజనం చేస్తారు.'
    మహమూద్ జేబులోంచి డబ్బు తీశాడు. పిల్లవాడు నిలదొక్కుకున్నాడు. ఆయఃకాంతంలాంటి ఆకర్షణ కుర్రాణ్ణి వృద్ధుని దగ్గరికి లాక్కొచ్చింది.
    తెరవెనుక నాకు కొద్దిదూరంలో నాజూకు పాదాలు నడయాడుతున్నాయి. ఆ పాదాలు చక్కని చాయ్ ఛాయలో ఉన్నాయి. గోళ్ళకు రంగుంది. నాలోని చలనం చచ్చింది. నిశ్చలంగా కూర్చున్నాను. డబ్బులో గారడి ఉంది. అది అందమైన పడుచు పాదాలను ఇంత దగ్గరికి లాక్కొచ్చింది.
    కుర్రాడు లోపలినుంచి ఈ సువార్తవినే వచ్చినట్టున్నాడు. ఎందుకంటారా పాపం హరిదర్శనానికి తపించేవాడికి ఆకాశవాణి వినిపించింది. హరిదర్శనానికి ఉరికివచ్చాడు పందొమ్మిది, ఇరవై ఏళ్ళ పడుచువాడు గుట్టమీంచి గుండు దొర్లినట్లు ఊడిపడ్డాడు. సిగరెట్టు పట్టుకొనే భంగిమలో రెండు వేళ్లెత్తి ఒకే సలామ్, మా ఇద్దరికీ పంచేశాడు నుంచున్నాడు. ముసలవాడిచేతిలో వణుకుతున్న నోట్లను చూస్తున్నాడు. ముఖం అందమైందే. గాలి తిరుగుడుకు అవతారం మారింది. వెంట్రుకలు దిలీప్ కుమార్ లా పెంచాడు. ప్యాంటు చిరిగి, మురికి పట్టింది, ప్యాంటుది ఒక కాలు మోకాలుదాకా మడిచాడు.
    'వీరు మురాద్ గారి తమ్ముడుగారు షాహీజాద్ గారు'
    "ఆదాబె ఆరజ్"
    "ఆదాబె ఆరజ్"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS