మరుసటిరోజు ఉదయానికల్లా సంబంధిత ప్రభుత్వ శాఖల్లో వేడి రాజుకొంది.
పై అధికారుల మధ్య సమాలోచనలు, సమస్యకు వివిధ పరిష్కారాలు, అప్పటి వరకు జరిగిన సంఘటనలపై పూర్వాపరాలు, ప్రభుత్వ శాఖల పరంగా జరిగిన లోటుపాట్లు, నష్టపోయిన అటవీసంపద లెక్కలు, డొక్కలకి సంబంధించిన పేపర్ వర్క్ ఊపందుకుంది.
బూజుబట్టిన ఫైళ్ళు స్థానభ్రంశం చెందుతున్నాయి.
టైప్ మెషిన్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి.
స్టెనోల డిక్టేషన్స్ తీసుకోవటంలో మునిగిపోయి ఊపిరి తీసుకోలేనంత శ్రమకి గురయ్యారు.
ఎక్కడినుంచో ఎక్కడికో ఫోన్లు.... టెలెక్స్ మెసేజ్ లు.... పిలుపులు.... చర్చలు.... మందలింపులు.... సలహాలు.... విమర్శలు.... ఓ పక్క జరుగుతుండగానే ఆ పగలు గడిచిపోయి మలిసంధ్య మసక చీకటిని ప్రోదిచేసుకుంటుండగా మలై మహదేశ్వరా అడవుల్లో సంచలనం మొదలయింది.
పక్షులు గూళ్ళకు చేరుకొని పగలంతా పడిన రెక్కల శ్రమల తీర్చుకుంటూ, తెచ్చిన ఆహారాన్ని పిల్లల ముక్కులకు అందిస్తూ అపర సంధ్యకు ఆహ్వానం పలుకుతూ చీకటిలో కలిసిపోతున్నాయి.
చీకటిలో ఆహారాన్వేషణకి బయలుదేరే జంతువులు సమాయత్తమవుతున్నాయి.
చిక్కటి చీకటి నిశ్శబ్దాన్ని తోడుతీసుకొని అడవిని తనలో లీనం చేసుకుంటోంది.
ఉన్నట్లుండి పరిసరాల్ని భాయోద్వేగంలో నింపేందుకన్నట్లు తీతువు అరిచింది భయానకంగా. అటవీ ప్రాంతంలో ప్రమాదం, మృత్యువు కలిసి సంచరించేందుకు బయలుదేరుతున్న వేళ ఒక కొండ మలుపులో మొదలయిన సంచలనం క్రమంగా చైతన్యాన్ని పుంజుకుంటోంది.
అప్పటివరకు విశ్రమించిన దాదాపు పదిమంది సాయుధులు ఒళ్ళు విరుచుకుంటూ లేచారు.
నియంత్రించిన రోబోట్స్ లా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. ఇద్దరు సాయుధులు తమతో తెచ్చుకున్న దేవదారు దివిటీలని వెలిగించి ఒకింత చదునుగా వున్న ఆ ప్రాంతానికి నలువేపులా వున్న చెట్ల మొదళ్ళకు ఐదారు అడుగుల ఎత్తులో తీగలతో కట్టివేశారు.
మరో ఇద్దరు వంట పాత్రల్ని బయటకు తీసి వంట ప్రయత్నాలు ప్రారంభించారు. నలుగురు రైఫిల్స్ చేతబూని పరిసరాల్ని నిశితంగా గమనిస్తూ పహరా కాయనారంభించారు.
సాధారణంగా అడవులలో తిరిగే నేరస్థులు పగళ్ళు వంట చేసుకోరు. పగళ్ళు వంట చేసుకొంటే దాని తాలూకు పొగ పైకెగసి తమ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే రాత్రిళ్ళు మాత్రమే నేరస్థులు వంట చేసుకుంటుంటారు. పవర్ ఫుల్ బైనాక్యులర్స్ తో ఎత్తైన ప్రదేశాలలో నించుని ఫారెస్ట్ వాచర్స్, పోలీసులు తరుచూ అబ్జర్వ్ చేస్తుంటారు. కేవలం నేరస్థుల జాడ కోసమేకాక, వైల్డ్ ఫైర్ లాంటివి సంభవిస్తే తక్షణ చర్యగా దావానలం బారినుంచి అడవిని రక్షించేందుకు కూడా అలా చూస్తుంటారు.
"బాగా ఆకలిగా వుంది. వంట త్వరగా కానివ్వండి" అన్నాడో సాయుధుడు. అతని పేరు కరియా, వీరూకి కుడిభుజంలాంటి వాడు.
ముప్పై సంవత్సరాల కరియా....కాలభైరవుడు....అపరిమితమైన దేహదారుఢ్యం అతని సొత్తు, ప్రమాదాలతో ఆడుకోవడం, మృత్యువును పరిహసించటం అతనికి బహు సరదా అయిన విషయం. వీరూ చేతిలో కాలపాశంలాంటివాడు. అతను దేనికీ, ఎవరికీ, ఎప్పుడూ భయపడడు. అసలతనికి భయపడటం తెలీదు.
ఆరడుగుల ఎత్తులో, కండలు మెలిదిరిగి కయ్యానికి కదనుతొక్కుతున్నవాడిలా కనిపిస్తుంటాడు, అతను ఒంటరి. వడిచేలలో రాయిలాంటివాడు. వీరూ గురిచూసి అతన్ని సంధిస్తే లక్ష్యాన్ని ఛేదించి కానీ తిరిగి రాడు. ఎక్కువగా మాట్లాడడు. ఎప్పుడు చూసినా మొరోజ్ గా కనిపిస్తాడు.
అతనికి అతని ప్రాణం కంటే కూడా ఇష్టమైన విషయం వీరూ రక్షణ. ప్రపంచంలో అన్నిటికంటే అతను ప్రేమించేది, గౌరవించేది వీరూ ఆజ్ఞల్ని అమలుపరచటం, వీరూకి తన ప్రాణం మీద వున్న మమకారం కన్నా వీరూ ప్రాణం మీద కరియాకే మమకారం ఎక్కువని సహచరులు తరచు అనుకుంటుంటారు. అతనుండగా మృత్యువు సయితం వీరూని సమీపించేందుకు భయపడుతుంది. అతనికున్న పెద్ద జబ్బు వీరూని సమీపించే ప్రతివారినీ అనుమానించి శోధించటం.
ఆ కరియానే ఇప్పుడు మిగతా తొమ్మిదిమంది అనుచరుల రక్షణ విషయం చూస్తున్నాడు. అందుకే ఎక్కడోవున్న వీరూ తను నిర్దేశించిన కార్యక్రమం పట్ల, తన అనుచరుల రఖనపట్ల ధైర్యంగా ఉన్నాడు.
"అన్నం అరగంటలో సిద్ధమవుతుంది, కానీ కూరలు, సాంబారు పొడి, మసాలా దినుసులు ఇంకా రాలేదు" అన్నాడో అనుచరుడు.
"మనవాళ్ళిద్దరూ మలై మహదేశ్వరా హిల్స్ కి వెళ్ళి చాలాసేపయింది. ఇంకా రాలేదు ఆకలి దంచేస్తోంది" అన్నాడు మరో అనుచరుడు.
"పోలీసులు మహదేశ్వరా హిల్స్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు మనకేమన్నా సమాచారం అందించా?" కరియాలో అనుమానం పొడచూసింది.
"లేదు...." అన్నాడు ఒక అనుచరుడు.
తిరిగి నిశ్శబ్దం అలముకుంది. ఆ నిశీధిలో పొయ్యి భగభగమని మండుతోంది. పెద్ద పాత్రలో రైస్ బాయిల్ అవుతోంది. గాలి స్తంభించి పోయిందా అన్నట్లు చెట్ల ఆకులు ఇసుమంతయినా కదలటంలేదు. లోతైన నిశ్శబ్దం....గాడాంధకారం....కాగడాల వెలుగు యాభై గజాలకు మించి వెళ్ళలేకపోతోంది. కౄరమృగాలు తమ దరిదాపులకు రాకుండా, తాము మకాం చేసే ప్రాంతంపై, పరిసరాలపై పట్టుకోసం రాత్రిళ్ళు వాళ్ళు దేవదారు కాగడాల్నే ఆశ్రయిస్తారు.
మలై మహదేశ్వరా హిల్స్ కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో వున్న దట్టమైన అడవిలో వాళ్ళిప్పుడు వున్నారు. ఆ రోజు మధ్యాహ్నమే వారికి ఆ ప్రాంతంలో మకాం చేయమని వీరూ నుంచి వర్తమానం అందింది. అంటే ఆ రాత్రికో మరుసటి రోజు ఉదయానికో ఆ ప్రాంతంలో వున్న చందనం వృక్షాలని నరకటం కోసంగానీ, ఆ చుట్టుపక్కల ఎప్పుడో నరికివున్న చందనం కలపని ట్రాన్స్ పోర్ట్ చేయటానికో తమని వీరూ అక్కడికి తరలించాడని వారికి తెలుసు.
