Previous Page Next Page 
వారుణి పేజి 5


    ఆమె పెదవి విరిచింది నిరసనగా.
    అతనేదో చెప్పబోయాడు.
    అంతలో సారధి వచ్చాడు బయటనుంచి, అప్పుడే అటు దిగి వస్తున్నాడు అతను.


                                   3


    తండ్రిని చూడగానే చిరునవ్వు నవ్వేడు సారధి.
    "గుడీవెనింగ్ డాడీ !"
    "గుడీవెనింగ్, ప్రయాణం కులాసాగా జరిగిందా?"
    "ఆఁ"
    అంతలో అతని వెనుకగా వచ్చిన్ ఆటో డ్రైవర్ రెండు చేతుల్లో రెండు సూట్ కేసులు తెచ్చి లోపల పెట్టాడు. మళ్ళీ వెళ్ళి బెడ్, మరో హోల్డాల్ తెచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ యింకోసారి వెళ్ళి ఒక పెద్ద ట్రంక్ తెచ్చాడు. మళ్ళీ రెండు పెద్ద బుట్టలు తెచ్చాడు. ఆఖరున రెండు పళ్ళ బుట్టలు తెచ్చాడు.
    ఇంతసేపూ నారాయణ ఆ వస్తువుల వంక ఓ చూపు పారేసి కొడుకుని "కుశలాదికములు" ప్రశ్నిస్తూనే వున్నాడు.
    సారధి ఠీవిగా నుంచుని డ్రైవర్ అన్నీ తెచ్చిపెడుతున్నాడా లేదా అని గమనిస్తూ తండ్రి ప్రశ్నించే ప్రశ్నలకి జవాబులు చెబుతున్నాడు.
    అయినా అతని మనస్సులో ఆ యింట్లో వారుణి ప్రవేశించగానే తల్లి ఎలా రిసీవ్ చేసుకుంటుందో, వదిన ఎలా బిహేవ్ చేస్తుందో అని సందేహాలు మెదులుతూనే వున్నాయి.
    సారధి చెప్పినట్టుగా ఆటోలో వచ్చిన సామానంతా ఆ హాలులో ఓ మూలగా పెట్టాడు ఆటో డ్రైవర్ సామానంతా లోపలికి చేర్చి నుంచున్నాడు.
    మీటర్ అంతకు పూర్వమే చూసిన సారధి దాన్ని రూపాయికి రౌండప్ చేసి, ఎక్ స్ట్రాగా మరో అయిదు చేర్చి "తీసుకో సలాం" అన్నాడు.
    అతను వినమ్రంగా అందుకుని, లెక్క చూసుకుని ప్రశ్నార్థకంగా సారధి వైపు చూశాడు.
    "లగేజ్ వుంది కదా! అందుకని ఆ అయిదూ ఎక్కువిచ్చాను తీసుకో సలాం!" అన్నాడు సారధి.
    "వద్దు సర్! ఛార్జీలు చాలు!" అయిదూ తిరిగి యివ్వబోయాడు అతను. అతను సారధి దగ్గర చదువుకున్నాడు. డిగ్రీ పుచ్చుకోగానే ఎంప్లాయిమెంటులో పేరు రిజిష్టరు చేసి ఉద్యోగం కోసం వేచి కూర్చోకుండా చదువుకొనే రోజుల్లో లారీ డ్రయివర్ అయిన తండ్రి వెంట వెళ్ళి హాబీగా నేర్చుకున్న డ్రైవింగ్ తో ఆ లైసెన్స్ తో స్టేట్ బ్యాంకికి వెళ్ళి సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీం క్రింద ఆటో కొనుక్కొని దర్జాగా నడుపుకుంటున్నాడు.
    అప్పుడు కాలేజీలో చదువుకున్న ఆ కృతజ్ఞత యింకా అలాగే వుంది అతనిలో_
    "ఫర్లేదోయ్! తీసుకో" అన్నాడు నారాయణ.
    "వద్దు సర్! అది దోపిడీ అవుతుంది. అందరిలా నేనూ ప్రవర్తిస్తే యిక నా డిగ్రీకి విలువేమిటి?" వినయంగా అన్నాడు సలాం.
    "గుడ్!" యింకేమీ అనలేదు నారాయణ.
    అయిదు రూపాయలు యిచ్చేసి వెళ్ళాడు సలాం.
    హమ్మయ్య అన్నట్టుగా నిట్టూర్చాడు సారధి. ప్రయాణం బడలిక కొద్దిగా కనిపిస్తోంది అతని ముఖంలో, తల్లి వైపు చూశాడు సారధి.
    "సారేనా?"
    కొడుకు ముఖంలోకి సూటిగా చూసి ఎగతాళిగా అడిగింది సుబ్బరత్నమ్మ.
    ఆమెవైపు చూశాడతను.
    ఆమెకి సమాధానం చెప్పాలనిపించలేదు. అందుకే ఏమీ అనలేదు.
    సుబ్బరత్నమ్మ నిర్లక్ష్యంగా చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
    హాల్లో యిద్దరే మిగిలారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS