Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు-3 పేజి 5


    "నా రిక్వెస్టుకి అడ్డం పడితే మర్యాద దక్కదు రోయ్. అంచేత నువ్వు నోరు మూసుకో ... ఏదమ్మా సుగుణా - మావయ్యా అని పిలు!"

 

    పరిస్థితి అంతవరకూ ఎదిగేక ఇక పిలవక తప్పదనే నిర్ణయంతో సుగుణ "మామయ్యా!" అనే పలకరించింది.

 

    అయితే ఆ గొంతు మృదువుగా లడు. కనీసం ఒక సగటు ఆడపిల్ల గొంతయినా కాదు. పరమ మగ గొంతు.

 

    కళ్ళు మూసుకు వింటే ఎస్.వి. రంగారావు ఘటోత్కచుడి వేషం గుర్తుకొస్తుంది.

 

    ఆ దెబ్బతో సత్యం నీరసించి పోయేడు. ఆ పిల్లమీద పెట్టుకున్న ఆశ చప్పగా చల్లారిపోయింది.


                                         5


    అది ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణం. సాయంత్రం క్లాసులయిపోయాయి.

 

    కృష్ణమూర్తి స్కూటరెక్కాడు.

 

    ఆ స్కూటరు అనేకానేకమైన రోడ్లు దాటి కొండదారి పట్టింది. కొండ అంచు దగ్గర కృష్ణమూర్తి స్కూటరు అపేడు. స్కూటరు దిగ దిగగానే ఒక స్వీట్ వాయిస్ ఎంతో మధురంగా పద్యాన్ని ఆలపిస్తోంది.

 

    ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూ సురేంద్రనే

 

    కాంతము నందునున్న జెవరాండ్ర నెపంబడి పల్కురించు...

 

    ---ఒక అప్సరస సరదాపడి భూలోకానికి వచ్చి కులాసాగా గొంతు విప్పి గాంధర్వ గానాన్ని కురిపించినట్టు ఎంతో హాయిగా సాగింది పద్యం.

 

    కృష్ణమూర్తి ఆ గొంతు వినిపించే దిక్కులో కొండెక్కుతూ పద్యం మొత్తాన్ని వినేసేడు.

 

    పద్యం పూర్తయ్యేసరికి ఆ పద్యం పాడిన పద్మను చేరుకున్నాడు.

 

    అందమైన పద్యాన్ని యింపుగా వినిపించినందుకు చప్పట్ల రూపంలో ఆనందాన్ని తెలీజేసుకున్నాడు.

 

    ఒక రాతిమీద కూచుని పుస్తకంలో పద్యం చదువుకున్న పద్మ ఉలికిపడి చూసింది.

 

    కృష్ణమూర్తి నవ్వుతూ అన్నాడు.

 

    "స్ప్లెండెడ్... మోర్వలెస్...చాలా అందంగా పాడేవు!"

 

    పద్మసీరియస్ గా సమాధానం చెప్పింది.

 

    "పాడటమేమిటి నా బొంద. రేపు తెలుగు పరీక్ష!"

 

    "అది తెలిసే కొండలూ, గుట్టలూ వెతుక్కుంటూ వచ్చేను. ఇంగ్లీషయితే రైలు పట్టాలు పట్టుకునే వాడిని. అవునూ ఇదేం సెంటిమెంటు నీకు?"

 

    "సెంటిమెంటా!"

 

    "కాదామరి? ఎవరయినా పాఠాలు బుద్ధిగా గదిలో చదువుకుంటారు. అంతేగాని నీకు మల్లె తెలుగుపాఠం కొండెక్కి చదవడం, ఇంగ్లీషయితే రైలు పట్టాలమీదా, ఎకనామిక్స్ పచ్చిగడ్డిమీదా - ఇట్లా ఒక్కో సబ్జెక్టుకి ఒక్కో లొకేషన్ పెట్టుకుని ఉతికేస్తుంటే సెంటిమెంటుకాక మరేమనాలి?"

 

    పద్మ చిరుకోపం నటిస్తూ లేచి నిలబడి అన్నది.

 

    "అవునులే! ఎంతకీ నా సెంటిమెంట్లు రిసెర్చి చేయడమేగాని మన పెళ్ళి విషయం పట్టించుకునే తీరుబడి ఎక్కడిది?"

 

    ఆ మాటకి కృష్ణమూర్తి గిలగిల్లాడిపోయాడు.

 

    "మన పెళ్ళేకదా! ఆఫ్టరాల్ అదెంతసేపు? మన విషయం మా నాన్నతో చెప్పడ మొక్కటే తరువాయి-ఆ కార్యక్రమం ఫినిష్ కాగానే స్వయంగా మా నాన్నే క్షణాల్లో మన పెళ్ళి జరిపించేస్తాడు."

 

    పద్మ తాను చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా చెప్పాలనే ఉద్దేశంతో అన్నది---

 

    "వారంరోజుల్లో మా పరీక్షలయిపోతాయి. ఆ తర్వాత హాస్టల్ వదిలి మా ఊరెళ్ళి పోతాను. ఇంకెప్పుడు చెబుతావు?"

 

    కృష్ణమూర్తి నవ్వుతూ అన్నాడు---

 

    "మా నాన్న దగ్గరెంత చనువున్నా - పెళ్ళి విషయం కదా? కుండబద్ధలు కొట్టినట్టు ఎట్లా చెప్పను? అందుకే ఒక పెద్ద ప్లాన్ వేశాను. అది చెప్పడానికి నిన్ను వెతుక్కుంటూ యిక్కడికి వచ్చేను."

 

    "ప్లానా? ఏమిటది?" కుతూహలంగా అడిగింది పద్మ.

 

    "ఉన్నపళంగా నువ్వు నాతో ఫోటోస్టూడియోకి రావాలి"

 

    "ఇంకా నయం! బార్బర్ షాపుకి రమ్మనలేదు."

 

    "నా జోక్స్ టైమీజ్ షార్ట్ కమాన్..." అంటూ పద్మ చేతిని పట్టుకున్నాడు.

 

    "అసలింతకీ ఫోటోస్టూడియోకీ ప్లాన్ కీ."

 

    కృష్ణమూర్తి ఆమెను మాటాడించలేదు. ఆమె చేతిని పట్టుకుని లాక్కుపోతున్నాడు.

    
                                         6


    సత్యం మరో ఫ్రెండుతో నడుస్తున్నాడు---

 

    ఆ ఫ్రెండు సత్యంతో అంటున్నాడు.

 

    "నీకు ఒక్కగానొక్క కొడుకున్నట్టే నాక్కూడా ఒక్కగానొక్క ఆడపిల్ల. ఈ పోలికేదో బాగానే ఉన్నట్టుంది కదూ?"

 

    అవునని చెప్పాలనిపించలేదు సత్యానికి. ఒక్కరే సంతానం చాలా మందికి వుండచ్చు అదేదో విడ్డూరమైనట్టు చెప్పుకోవడం సత్యానికి నచ్చలేదు అందుకే చిన్న చురక అంటించాడు.

 

    "నారాయణక్కూడా ఒక్కగానొక్క ఆడపిల్లే! కానీ---పూర్ గాళ్ వాయిస్ మాత్రం--మగ గొంతు-అందుకే నాకు నచ్చలేదు."

 

    ఫ్రెండుకి ఉత్సాహం కలిగింది.

 

    "మా అమ్మాయని చెప్పడం కాదుగానీ - మా రాధ గొంతు కోకిల కంఠం రేడియోలో కూడా పడుతుంది!"

 

    ఆ పాయింటేదో సత్యానికి నచ్చినట్టుంది---

 

    "గుడ్. సంగీత జ్ఞానం ఉందన్నమాట!"

 

    ఫ్రెండుకి కొంచెం ఒళ్ళు మండింది---

 

    "రేడియోలో పాడుతుందని చెబితే సంగీత జ్ఞానమని సింపుల్ గా కొట్టిపారేస్తావేమిటి? సంగీతమే కాదురా --- డాన్స్ కూడా నేర్చుకుంది!"

 

    ఈ పాయింటు కూడా సత్యానికి నచ్చింది అంచేత---

 

    "వెరీ గుడ్" అన్నాడు ఆనందంగా.

 

    సత్యం వరస గమనించి మరికొన్ని వివరాలు ఉత్సాహంగా అందజేద్దామనే ఉద్దేశంతో---

 

    "ఇంక నా ఆస్థిపాస్తులు గురించి చెప్పాలంటే-"

 

    "చెప్పద్దు. నీకెంత ఆస్థివున్నది నేను పట్టించుకోను. పిల్ల...పిల్ల ముఖ్యం. అందచందాలంటావా? అఫ్ కోర్స్ - అక్కడ మాత్రం కాంప్రమైజ్ కాలేను. అదుగో అటుచూడు-" అంటూ సత్యం ఒక దిక్కు చూపించాడు.

 

    అదొక ప్లేగ్రవుండు. అక్కడ ఇద్దరాడ పిల్లలు టెన్నికాయిట్ ఆడుతున్నారు. అందులో ఒక అమ్మాయి ఎంచక్కా టైట్ పేంటూ బనీనులో వుండి ఆడో మగో తెలీకుండా వుంది. ఎలక తోకలాగా జడ ఎగురుతోంది గనుక ఆడపిల్లనుకోవాలి. ఆ అమ్మాయిని చూపెడుతూ అన్నాడు సత్యం---

 

    "ఆ అమ్మాయి చూడు. కొంచెమో గొప్పో అందంగానే వుంది.ఆ కట్టూబొట్టూ వరసే నాకు బొత్తిగా నచ్చలేదు. అయ్ హేటిట్ ఆడపిల్లనగానే లక్షణంగా సంప్రదాయ బద్ధంగా వుండాలిగానీ హేట్ పేంట్లూ హీట్ షర్టులూ తొడుక్కుని తగుదునమ్మంటూ రోడ్లమీద తిరగడం నాకు గిట్టదు. నీ అభిప్రాయం ఏమిటి?"

 

    ఫ్రెండు మొహం మాడ్చుకున్నాడు. దిగులుగానే అన్నాడు-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS