Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 6


    "ఎలాంటి భర్త... ఐమీన్ ఏం చదువుకున్న వాడ్ని, ఎంత చదువుకున్న వాడ్ని నీకు భర్తగా చూస్తుంది మీ నాయనమ్మ?" క్రీస్టినీ నాయకి తనకు వదిన కానందుకు లోలోపల బాధపడుతూ అడిగింది.

 

    "ఎట్ లీస్ట్ ఎమ్.ఇ. అండ్ పి.హెచ్.డి." గర్వంగా చెప్పింది నాయకి.

 

    కారు ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి ప్రవేశించింది.

 

    పార్కింగ్ ప్లేస్ లన్నీ నిండిపోయాయి.

 

    ఎక్కడ ఖాళీ వుందా అని చూస్తూ కారుని మెల్లగా పార్కింగ్ ఏరియాలోకి నడిపిస్తోంది నాయకి.

 

    ఆమె కళ్ళు రాబర్ట్ కోసం వెతుకుతున్నాయి.

 

    కారు పార్క్ చేసేందుకు ఖాళీచోటు దొరకలేదు. రాబర్టు కూడా కనిపించలేదు. ఆమెలో ఒకింత అసహనం తొంగిచూసింది.

 

    "నాయకీ ఆ చివరి వరకూ పోనివ్వు కారును. అక్కడేమన్నా వుందేమో చూద్దాం" అంది మాంటే ముందుకుచూస్తూ.

 

    కారు ఆవేపుకి సాగింది.

 

    కారు ఒకింత ముందుకు వెళ్ళాక అప్పుడు కనిపించాడు రాబర్ట్. ఓ కారును ఆనుకుని ఎటో శూన్యంలోకి చూస్తూ వున్నాడు.

 

    కారు ఇంకొంచెం ముందుకెళ్ళాక అక్కడ పార్కింగ్ ప్లేస్ కనిపించింది.

 

    ఆ ప్లేస్ అలా ఖాళీగా వుండేలా అట్టిపెట్టి అక్కడికే తను వస్తానని ఎదురు చూస్తున్నాడని భావించిన నాయకి మెల్లగా మ్యూజికల్ హారన్ ని మోగించింది.

 

    ఆ శబ్దానికి రాబర్ట్ ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చి నాయకిని చూసి మందహాసం చేశాడు.

 

    కారు పార్క్ చేసి ముగ్గురూ దిగారు.

 

    నాయకి లగేజ్ నలుగురూ తీసుకున్నారు.

 

    ముందు క్రీస్టినీ, మాంటే వెళుతుంటే వెనగ్గా నాయకి, రాబర్టు నడుస్తున్నారు.

 

    "ఈ పాటికి మీ లక్ష్యాలేమిటో నిర్ణయించుకుని వుంటారు. ఆ లక్ష్య సాధనకు నా నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా సంకోచించవద్దు" అన్నాడు రాబర్ట్ హృదయపూర్వకంగా.

 

    కృతజ్ఞతా భావంతో నాయకి కను కొలుకుల్లో ముత్యాల్లాంటి కన్నీటి బిందువులు నిలిచాయి.

 

    ఇక ఆ తరువాత వాళ్ళెక్కువగా మాట్లాడుకోలేదు.

 

    నాయకి ఫ్లయిట్ ఎక్కేవరకు నలుగురూ మౌనంగానే వుండిపోయారు.


                                                     *    *    *    *


    సెంటౌర్ హోటల్, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఏరియా... సూట్ నెంబర్ 801లో ఆ ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చుని వున్నారు.

 

    వారి మధ్య ఫైబర్ గ్లాస్ చెస్ బోర్డు వుంది. వాటి మీద పావులు.

 

    ఆ ఇద్దరూ ఎవరికివారే తమ బలగాలవేపు సీరియస్ గా చూసుకుంటున్నారు.

 

    అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు.

 

    "ఈపాటికి ఫ్లయిట్ బయలుదేరి వుంటుంది కదూ?"

 

    "బయలుదేరి గంటయి పోయింది" అన్నాడు పీటర్ అర్జునరావువైపు నర్మగర్భంగా చూస్తూ.

 

    "బలిపశువును సిద్ధం చేసే వుంటారు కదా మనవాళ్ళు"

 

    "ఆహా.... ఎప్పుడో...."

 

    "ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా, మనమనుకున్న పని పూర్తయ్యే లోపు మన పథకం ఏమాత్రం బయటకు పొక్కినా, నాయకురాలు నాగమ్మ చేతిలో మన ఆట కష్టమవుతుంది"

 

    "అలాంటి భయాలేం పెట్టుకోనక్కర్లేదు" పావును కదుపుతూ నెమ్మదిగా అన్నాడు పీటర్.

 

    మరికొద్ది నిమిషాలకు అర్జునరావు ఆట కట్టయింది. పీటర్ తాను గెలిచినందుకు ఆనందించే బదులు దిగులుగా ముఖం పెట్టాడు.

 

    అర్జునరావు పావుల్ని తిరిగి సర్దాడు.

 

    అర్జునరావు చూడటానికి సాత్వికుడిలా, చీమక్కూడా హానిచేయని సాధువులా కనిపిస్తాడు. నెమ్మదిగా నడవటం, మెల్లగా మాట్లాడటం, ప్రశాంతతను ప్రదర్శిస్తూ చూడటం... అన్నీ వెరసి అతనో అపరబుద్ధుడిలా కనిపిస్తాడు.

 

    కానీ అతని ఉబ్బిన కనురెప్పల వెనుక ప్రమాదకరమైన అగ్ని పర్వతల్లాంటి ఆలోచనల సెగలు రగిలిపోతుంటాయి.

 

    అతని ఎత్తుగడలు విచిత్రంగా వుంటాయి. అవతలి వ్యక్తి చేతిలో గెలిచే సామర్ధ్యం వున్నా కావాలనే ఓడిపోతాడు. ఓడిపోతున్న ప్రతిసారీ అతనిలో అంతర్లీనంగా రూపుదిద్దుకునే పథకం పదునుదేరుతుంది.

 

    అవతలి వ్యక్తిలో గెలుపు నిషాని బాగా తలకెక్కనిస్తాడు.

 

    అతనా నిషాలో ఎంత పందానికయినా సిద్ధపడే స్థితికి తీసుకువస్తాడు.

 

    అప్పుడు తను చిరాకు ప్రదర్శిస్తూ హైయెస్ట్ స్టేక్ కి సిద్ధపడతాడు.

 

    మొఖంలో నిరాశని, కళ్ళలో నిస్పృహను ప్రదర్శిస్తూ 'ఎలాగూ నేను ఓడిపోతాగా' అన్న భావాన్ని పలికిస్తూ, ఇష్టం లేకున్నా పందానికి సిద్ధపడుతున్న చావు తెగింపుని కనబరుస్తూ ఆట మొదలెడతాడు.

 

    ఆట చివరి వరకు అతని వ్యూహాన్ని నరమానవుడెవడూ పసిగట్టలేడు.

 

    ఆట చివరి దశ కొస్తుంది.

 

    గర్వం అవతల వ్యక్తిని గుడ్డివాడ్ని చేస్తుంది.

 

    సరీగ్గా... సరీగ్గా అదే సమయంలో అవతలి వ్యక్తితో  అంటాడు. "నేను పూర్ ప్లేయర్నీ. నామీద నీ పూర్తి మేధస్సు ఉపయోగించడం పిచిక మీద బ్రహ్మాస్త్రమేగదా" అంటాడు.

 

    ఆ వ్యక్తి కళ్ళు పూర్తిగా మూసుకుపోతాయి.

 

    అప్పుడు తన బరువయి కనురెప్పల్ని పూర్తిగా ఎత్తుతాడు.

 

    ఇక ఆ తరువాత ఒకే ఒక ఎత్తు. మరిక ఆ వ్యక్తి కోలుకోడు ఎప్పటికీ. గెలిచి వెళుతూ కూడా "ఇది నా మేధస్సు కాదు. జస్ట్ ఫ్లూక్" అంటాడు.

 

    ఏం జరిగిందో తెలుసుకునేలోపు అతను పీకల వరకు ఊబిలో కూరుకుపోతాడు.

 

    అలాంటి అర్జునరావు...

 

    అంత ప్రమాదకరమయిన అర్జునరావు...

 

    ఇప్పుడు అమెరికా నుంచి చదువు పూర్తి చేసుకొని వస్తున్న నాయకి కోసం ఎదురుచూస్తున్నాడు.

 

    కొందరికి గెలుపు నిషా నెక్కిస్తుంది.

 

    మరికొందరికి ఓటమి నిషా దిగిపోయేలా చేస్తుంది.

 

    కాని అర్జునరావుకి ఓటమి నిషా నెక్కిస్తుంది.

 

    గెలుపు మరింత అప్రమత్తుడ్ని చేస్తుంది.

 

    అతనారాత్రంతా నిద్రపోడు.

 

    కనురెప్పలు బరువుగా వాలుతుంటే అతని ఆలోచనల కదలికలు చైతన్యాన్ని ఆశ్రయిస్తాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS